సమీక్ష : తుంగభద్ర – ఊహాజనితమైన పొలిటికల్ డ్రామా

Tungabhadra

విడుదల తేదీ : 20 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75 /5

దర్శకత్వం : శ్రీనివాసకృష్ణ గోగినేని

నిర్మాత : రజని కొర్రపాటి

సంగీతం : హరి గౌర

నటీనటులు : అదిత్ అరుణ్, డింపుల్ చోపడే, సత్యరాజ్…

‘ఈగ’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ లాంటి సక్సెఫుల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మించిన మరో అందమైన పల్లెటూరి ప్రేమకథే ‘తుంగభద్ర’. అదిత్ అరుణ్ హీరోగా, డింపుల్ చోపడే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ద్వారా శ్రీనివాసకృష్ణ గోగినేని అనే పేరుతో టాలీవుడ్ కి మరో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సత్యరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ మూవీ ఉగాది కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కొత్త సంవత్సరం ఉగాది రోజున వచ్చి విజయం సాధించి వారాహి చలన చిత్రం బ్యానర్ కి మరో విజయాన్ని అందించిందా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దామ్..

కథ :

ప్రస్తుత రాజకీయాలలో తాము నమ్మిన పొలిటికల్ లీడర్స్ కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్దపడే పార్టీ అనుచరులు, కార్యకర్తల కథే ఈ ‘తుంగభద్ర’. గుంటూరు బ్యాక్ డ్రాప్ లలో మొదలయ్యే ఈ కథ తాడికొండ – కర్లపూడి గ్రామాల మధ్య జరుగుతుంది. ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యే అభ్యర్థులు కోట శ్రీనివాసరావు – శివరామకృష్ణ(శివరామకృష్ణ). శివరామకృష్ణ అనుచరుడైన రామరాజు(సత్యరాజ్) కోట అనుచరుడైన త్రిమూర్తులు(చలపతిరావు)ను చంపేయడంతో శివరామకృష్ణ ఎమ్మెల్యే అవుతాడు. పవర్ లేకపోవడంతో కోట మరియ్యు త్రిమూర్తుల ముగ్గురు వారసులు రామరాజుపై పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంటారు.

ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాక.. రామరాజు అందరికన్నా ఎక్కువగా నమ్మే శ్రీను(అదిత్ అరుణ్)కి తన కూతురు గౌరీ(డింపుల్ చోపడే) వెంట ఎవరో పడుతున్నాడని, వాడి గురించి తెలుసుకొని అవసరమైతే ఫినిష్ చెయ్యమని చెప్తాడు. ఇదే టైంలో శ్రీను – గౌరీల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఈ ప్రేమ వల్ల రామరాజు ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. అదే టైంలో రామరాజు పార్టీ ఎలక్షన్స్ లో ఓడిపోతుంది. మళ్ళీ పవర్ లోకి వచ్చిన కోట మరియు త్రిమూర్తుల వారసులు రామరాజుని ఏం చేసారు.? రామరాజుని కాపాడుకోవడానికి శ్రీను ఏమన్నా చేసాడా.? లేదా.? రామరాజు ఇంట్లో శ్రీను – గౌరీల వల్ల వచ్చిన సమస్యలు ఏమిటి.? అన్న విషయాలను మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ పాయింట్ చాలా బాగుంది. అలాగే దాని కోసం ఎంచుకున్న నేపధ్యం కూడా కాస్త కొత్తగా ఉంది. రెగ్యులర్ గా స్టేట్ లెవల్ రాజకీయాలు కాకుండా లోకల్లో జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయి, దానివల్ల సామాన్యులు ఎమైపోతున్నారనేది క్లైమాక్స్ లో బాగా చెప్పాడు. ఈ సినిమాలోని విజువల్స్ మరియు మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కాలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీగా ఉంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా స్టార్టింగ్ కూడా బాగుంది.

ఈ సినిమాకి హీరో అదిత్ అరుణ్ కాదు సత్యరాజ్ అని చెప్పాలి.. సీనియర్ యాక్టర్ సత్యరాజ్ అటు పార్టీ కోసం ఏమన్నా చేయడానికి సిద్దపడే నాయకుడిగా, మరోవైపు తన లోపల ఉన్న మంచి తనాన్ని గుర్తు తెచ్చుకొని మంచి వాడిగా మారే రెండు షేడ్స్ ని చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్ లో అద్భుతమైన నటనని కనబరిచి సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్ళాడు. అదిత్ అరుణ్ పల్లెటూరి కుర్రాడి పాత్రకి సెట్ అయినా పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. డింపుల్ చోపడే కి ఉన్నది చిన్న పాత్రే కానీ ఉన్నంతలో క్యూట్ లుక్స్ తో, తెలుగమ్మాయిలా, లంగా ఒనీల్లో కుర్రకారుని ఆకట్టుకుంది. అదిత్ ఫ్రెండ్ గా చెఇస్న జబర్దస్త్ శ్రీను ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ని బాగా నవ్వించాడు. అలాగే ధన రాజ్ , నవీన్ లు కూడా కాసేపు నవ్వించారు. కోట శ్రీనివాసరావు, శివరామకృష్ణ, పవిత్ర లోకేష్, చరణ్, శశాంక్ లు ఉన్నంతలో బాగా చేసారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే, ఆ తర్వాత కథ.. పైన చెప్పినట్టు డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే, దాన్ని క్లైమాక్స్ లో దాదాపు చెప్పగలిగాడు. అది ఒక్కదానిని పక్కన పెడితే ఇలాంటి కథలని మనం ఇప్పటికే చూసాం. సరే కథ విస్తరణ పాతగా ఉన్నా కథనం అన్నా కొత్తగా ఉండాలి కదా.. కథనం మొదటి నుంచి చాలా స్లోగా ఉండడమే కాకుండా, చాలా ఊహాజనితంగా సాగుతూ ఉంటుంది. ఎక్కడా ఆడియన్స్ ఇదేదో బాగుందే అనే ఫీలింగ్ అస్సలు రాదు. ఇకపోతే సినిమాలో చాలా ట్రాక్స్ ఉన్నాయి. అనగా లవ్ ట్రాక్, రివెంజ్ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్, పాలిటిక్స్ లాంటివనమాట.. కానీ వీటిలో ఏ ఒక్క ట్రాక్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఇక ఆడియన్స్ ఏ పార్ట్ లో సినిమాకి కనెక్ట్ అవుతారో మీరే చెప్పండి..

ఇకపోతే డైరెక్టర్ శ్రీనివాస్ కనీసం లాజికల్ గా అన్నా ఇంకాస్త ఆలోచించాల్సింది.. ఎందుకంటే ఇరు పార్టీలలో ఒక పార్టీ రూలింగ్ లో ఉన్నంత మాత్రానా ఇరు వర్గాల మధ్య ఉన్న పగలు ఉంటాయని చూపించడం నమ్మశక్యంగా లేదు. ఇక్కడ మరో లూప్ హోల్ ఏంటంటే మొదటి అటాక్ మాత్రం పవర్ లో ఉన్నప్పుడే చేస్తారు, కానీ ఆ తర్వాత మాత్రం చెయ్యరు. అలాగే రవివర్మ పాత్ర విలన్స్ తో కలిసి సొంత బావ అయిన సత్యరాజ్ ని ఎందుకు చంపాలనుకుంటుంది అన్నదానికి సమాధానం మీకు ఈ సినిమాలో దొరకదు. ఇలాంటి లాజిక్ లేని లూప్ హోల్స్ చాలానే ఉన్నాయి. సప్తగిరి ట్రాక్ ఈ సినిమాకి అనవసరం. అసలు ఈ ఎపిసోడ్ పెట్టాలని ఐడియా ఇచ్చిన వారికి దండేసి దండం పెట్టాలి. అలాగే పాటలు వినడానికి బాగానే అనిపిస్తాయి. కానీ సినిమాలో పాటలు సినిమా నిడివిని పెంచేయడమే కాకుండా, ఆడియన్స్ కి బోర్ కొడతాయి. సెకండాఫ్ మొత్తం చాలా స్లోగా సాగుతూ ఆడియన్స్ కి నీరసం తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ కి పూర్తి ప్రాణం పోసింది అంటే ముగ్గురే.. వాళ్ళే సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాత్సవ్, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మరియు నిర్మాత రజని కొర్రపాటి. ఇదొక పల్లెటూరి నేపధ్యంలో సాగే కథ. ఈ కథలో చూపించిన అందమైన పల్లెటూరి విజువల్స్ మనకు ఓ సారి మన పల్లెటూరి రోజుల్ని గుర్తు చేసేలా ఉన్నాయి. ఆడియన్స్ విజువల్స్ కి బాగా కనెక్ట్ అవుతారు. అలాగే ఈ విజువల్స్ కి, డైరెక్టర్ రాసుకున్న సీన్స్ కి హరి గౌర అందించిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. హరి గౌర రీ రికార్డింగ్ ఆడియన్స్ ని కథకి కనెక్ట్ చెయ్యడానికి చాలా వరకు హెల్ప్ అయ్యింది. కానీ సీన్స్ లో ఆ ఫ్లేవర్ లేకపోవడం మైనస్ అనుకోండి..ఇక నిర్మాత.. కొత్త డైరెక్టర్, ఎలా తీస్తాడో అని అనుమాన పడకుండా కథను నమ్మి ఎక్కువగానే ఖర్చు చేసారు. కానీ విజువల్స్ పరగా రిచ్ నెస్ తీసుకొచ్చినా, ఓవరాల్ సినిమా పరంగా మాత్రం డైరెక్టర్ న్యాయం చేయలేకపోయాడు.

తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ఎందుకంటే సినిమాలో చాలా చోట్ల సింపుల్ గా ముగించేయాల్సిన సీన్స్ ని సాగదీసినట్టు ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి. హరి వర్మ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇకపోతే కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం డీల్ చేసింది కొత్త డైరెక్టర్ శ్రీనివాసకృష్ణ గోగినేని. కథ – పాయింట్ బాగున్నా కథ విస్తరణ అస్సలు బాగోలేదు. చాలా ఓల్డ్ ఫార్మాట్ లో డెవలప్ చేసారు. కథనం – మరీ ఊహాజనితంగా, చాలా స్లోగా సాగుతుంది. డైలాగ్స్ – డీసెంట్ గా ఉన్నాయి. దర్శకత్వం – దర్శకుడిగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ముఖ్యంగా రాసుకున్న సీన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేని విధంగా తీస్తే దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇక్కడ అదే జరిగింది కావున శ్రీనివాసకృష్ణ ఫ్లాప్ అయ్యాడు.

తీర్పు :

పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో లోకల్ రాజకీయ గొడవల చుట్టూ తిరిగే ఈ ‘తుంగభద్ర’ సినిమా ఆడియన్స్ ని అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. డైరెక్టర్ అనుకున్న స్టొరీ లైన్ బాగున్నప్పటికీ పూర్తి కథాపరంగా సినిమాని ఆసక్తికరంగా తీయలేకపోయాడు. వారాహి చలన చిత్రం వారు ఎంతో ఖర్చు చేసి తీసిన ఈ సినిమా గత సినిమాల స్థాయిలో కమర్షియల్ విజయం అందుకోలేకపోవచ్చు. సత్యరాజ్ పెర్ఫార్మన్స్, స్టొరీ లైన్, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ ఎలిమెంట్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ అయితే, కథ విస్తరణ, కథనం,డైరెక్షన్, సెకండాఫ్ చేపప్దగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా మెసేజ్ ఓరియెంటెడ్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చూసేవారికి ఈ తుంగభద్ర నచ్చుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :