సమీక్ష : వజ్రాలు కావాలా నాయనా – పసలేని కామెడీ థ్రిల్లర్ !

Vajralu Kavala Nayana review

విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : పి. రాధాక్రిష్ణ

నిర్మాతలు : కిషొర్ కుమార్ కోట

సంగీతం : జాన్ పొట్ల

నటీనటులు : అనిల్ బురగాని, నేహ‌దేశ్ పాండే, నిఖిత బిస్ట్

ఈ మధ్య కాలంలో కామెడీ, థ్రిల్లర్ జానర్లో రూపొందిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని దక్కించుకున్నాయి. ప్రేక్షకులు కూడా రెగ్యులర్ గా ఈ తరహా సినిమాల్ని ఇష్టపడుతున్నారు. ఆ ధైర్యంతో దర్శకుడు పి. రాధాకృష్ణ తెరకెక్కించిన చిత్రమే ఈ ‘వజ్రాలు కావాలా నాయనా’ చిత్రం. అనిల్‌ బూరగాని, నిఖిత బిస్థ్‌ జంటగా శ్రీపాద ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై కిషోర్‌ కుమార్‌ కోట నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

భవిష్యత్తు మీద ఎన్నో కలలతో సిటీకి వచ్చి స్నేహితులుగా మారిన ప్రేమ్(అనిల్‌ బూరగాని), స్వీటి (నిఖిత బిస్థ్‌), రాజేష్, వేదిక, పండు లు ఒకే ఇంట్లో ఉంటుంటారు. వీళ్ళలో ప్రేమ్ చిన్నతనంలో తనకెదురైన కష్టాల మూలంగా ఏం చేసైనా సరే జీవితంలో మిలీనియర్ అవ్వాలని ఆశపడుతుంటాడు. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసమే రకరకాల ఆలోచనలు చేస్తుంటాడు.

అలా ఆలోచిస్తున్న అతనికి సిటీలో ఉన్న ఓ ఇంట్లో రాజ కుటుంబం నివసిస్తుందని, వాళ్ళ దగ్గర కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలుస్తుంది. దాంతో ఎలాగైనా వాటిని దొంగిలించాలని స్నేహితులతో చెప్తాడు. వాళ్ళు కూడా సరే అంటారు. అలా దొంగతనానికి బయలుదేరిన ఆ ఐదుగురు స్నేహితులకి ఆ ఇంట్లో ఎలాంటి అనుభవాలు ఎదురయాయ్యి ? అసలా రాజ కుటుంబం నైపథ్యం ఏంటి ? చివరికి హీరో బృందం వజ్రాలు దక్కించుకుందా లేదా ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ఆకట్టుకునే అంశాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాలోని కామెడీ గురించి. దర్శక నిర్మాతలు తాము ఎంచుకున్న కామెడీ థ్రిల్లర్ జానర్ కు న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రధానంగా కామెడీపై ఎక్కువ దృష్టి పెట్టారు. సినిమాలో నరసింహం అనే పాత్ర ద్వారానే మాక్సిమమ్ ఎంటెర్టైమెంట్ ఇవ్వాలని ఆ పాత్ర చుట్టూ చాలా కామెడీ ఎపిసోడ్లు రాసుకున్నారు. వాటిలో హిట్ చిత్రాల స్పూఫులు ఆకట్టుకున్నాయి. ఇక హీరో స్నేహితుల్లో పండు పాత్ర చేసిన ‘ఒకరికి ఒకరు’ ఫేమ్ విజయ్ సాయి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది.

ఇంటర్వెల్ సమయంలో కథ అనూహ్య మలుపు తీసుకోవడం థ్రిల్లింగా అనిపించింది. కామెడీ కామెడీగా నడుస్తున్న కథ అలా ఒక్కసారి థ్రిల్లర్ జానర్లోకి మారడం సెకండాఫ్ పై కాస్త ఆసక్తిని పెంచగలిగింది. అలాగే థ్రిల్లర్ కు కాస్త హర్రర్ టచ్ ఇవ్వడం బాగుంది. సెకండాఫ్ లోని వచ్చే థ్రిల్లర్ సన్నివేశాలకు శివప్రసాద్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరి వాటికి కాస్త బలాన్ని అందించింది. కథలో మరో ప్రధాన పాత్ర అయిన రాణి (నేహాదేశ్‌ పాండే) గతం కాస్త ఆకర్షణీయంగా తోచింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నటీనటుల నటన అస్సలు ఆకట్టుకోలేదు. ఒక్క విజయ్ సాయి తప్ప మిగిలిన అందరు ఎక్కడా మెచ్చుకోదగిన ప్రదర్శన చేయలేదు. హీరో హీరోయిన్ల మధ్య నడిచే రొమాన్స్ ఎలాంటి ఫీల్ కలిగించలేకపోయింది. ఎంచుకున్న జానర్ బాగానే ఉన్నా నిర్మాత కిషోర్ కుమార్ అందించిన కథ సాధారణంగానే ఉంది. దానికి దర్శకుడు రాధాకృష్ణ రాసిన కథనం మాత్రం ఒక్క ఇంటర్వెల్ టైమ్ లో వచ్చే చిన్నపాటి మలుపు మినహా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది.

మొదటి అర్థ భాగంలో ఐదుగురు ఫ్రెండ్స్ మధ్య నడిచే చాలా అనవసర సన్నివేశాలు చికాకు తెప్పించాయి. అసలు ఇలా కూడా సీన్లు రాస్తారా అనిపించేలా తయారయ్యాయి. నరసింహం పాత్రతో చేయించిన కామెడీలో కొన్ని స్పూఫులు బాగున్నా కొన్ని సీన్లు మాత్రం బోర్ కొట్టించాయి. సెకండాఫ్ లో కథ హర్రర్, థ్రిల్లర్ జానర్లోకి వెళ్లిన తర్వాత వచ్చే హర్రర్ సన్నివేశాలు తలపట్టుకునేలా ఉండటమేగాక మళ్ళీ మళ్ళీ రిపీటవుతూ ఆ భాధను మరింత పెంచాయి. ఇక దర్శకుడు సినిమా కథనాన్ని ఆరంభం నుండి చివరి దాకా తనకిష్టమొచ్చిన రీతిలో నడుపుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడా మెప్పు పొందలేకపోయాడు. ఇక మధ్యలో వచ్చే పాటలు కూడా అక్కడక్కడా మిగిలివున్న కాస్త సహనాన్ని మింగేశాయి.

సాంకేతిక విభాగం :

నిర్మాత కిషోర్ కుమార్ తయారు చేసిన కథ మామూలుగానే ఉంది. ఇక దానికి కథనాన్ని అందించిన దర్శకుడు రాధాకృష్ణ తన ప్రతిభతో ఎక్కడా మార్కులు పొందలేకపోయాడు. దర్శకుడి సన్నివేశాల టేకింగ్ కూడా ఏమంత చూడదగిందిగా లేదు. శివ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా జాన్ పోట్ల అందించిన సంగీతం అస్సలు వినేలా లేదు. ఎడిటర్ రామారావు తన కత్తెరకు ఇంకా చాలా పని చెప్పుండాల్సింది. పి. అమర్ కుమార్ కెమెరా పనితనం అంతంత మాత్రంగానే ఉంది. నిర్మాత కిషోర్ కుమార్ పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

కామెడీ, థ్రిల్లర్ జానర్లను నమ్ముకుని రూపొందిన ఈ చిత్రం కాస్త కామెడీని, కాస్తంత థ్రిల్ ను మాత్రమే తెరపై చూపించగలిగింది. అక్కడక్కడా ఆకట్టుకునే కామెడీ, ఇంటర్వెల్ సన్నివేశంలో వచ్చే ఒక ట్విస్ట్, కథలోని ప్రధాన పాత్ర రాణి నైపథ్యం ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా విసుగు తెప్పించే కొన్ని సన్నివేశాలు, ఒక ఖచ్చితమైన బలహీనమైన కథనం, బోరింగా ఉన్న సంగీతం ఇందులో ప్రధాన బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద ఈ పసలేని కామెడీ థ్రిల్లర్ లో కాస్తంత కామెడీ, చిన్నపాటి థ్రిల్ మాత్రమే దొరుకుతాయి.

Click here for English Review

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team