ధృవ ప్రమోషన్స్ : యూఎస్ బయల్దేరుతోన్న చరణ్!
Published on Dec 6, 2016 1:31 pm IST

dhruva
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’, సినీ అభిమానుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈనెల 9న భారీ ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని మొదట్నుంచీ చెబుతూ వస్తోన్న టీమ్, ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. గత ఇరవై రోజులుగా ఇక్కడే ప్రమోషన్స్ నిర్వహించిన టీమ్, తాజాగా అమెరికాలోనూ ఇదే స్థాయిలో ప్రమోట్ చేయాలని అక్కడికి వెళ్ళేందుకు రెడీ అయిపోయింది.

రామ్ చరణ్‌తో పాటు విలన్ అరవింద్ స్వామి, దర్శకుడు సురేందర్ రెడ్డి రేపు యూఎస్ బయల్దేరుతున్నారు. గురువారం రోజున ప్రదర్శితమయ్యే ప్రీమియర్ షోస్‌కి చరణ్ కూడా స్వయంగా హాజరవుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. పెద్ద హీరోలందరూ ఇప్పటికే 1 మిలియన్ క్లబ్‌లో చేరగా, ఒక్క చరణ్ మాత్రం చాలాకాలంగా ఇందుకోసం ఎదురుచూస్తున్నారు. ధృవతో తనకు యూఎస్‍లో అతిపెద్ద హిట్ వస్తుందన్న నమ్మకంతో చరణ్ ఉన్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook