ప్రత్యేక ఇంటర్వ్యూ : రాకేష్ శశి – సాయి కొర్రపాటి బ్రాండింగ్‌తోనే సగం సక్సెస్ అయ్యాం!

ప్రత్యేక ఇంటర్వ్యూ : రాకేష్ శశి – సాయి కొర్రపాటి బ్రాండింగ్‌తోనే సగం సక్సెస్ అయ్యాం!

Published on Dec 24, 2015 5:05 PM IST

Rakesh-Sashii
‘జతకలిసే’.. గత కొద్దికాలం క్రితం పెద్దగా పరిచయం కూడా లేని ఈ సినిమా, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి రాకతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌తో సినిమా ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి రేకెత్తించడంలో సఫలమైంది. రాజుగారి గది సినిమాతో పరిచయమైన అశ్విన్ హీరోగా తేజస్వి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను నరేష్ రావూరి నిర్మించారు. రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు (డిసెంబర్ 25న) విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతోన్న రాకేష్ శశితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) మీ మొదటి సినిమా ‘జతకలిసే’ రేపు విడుదలవుతోంది. ఎలా ఉంది?

స) ‘జతకలిసే’ దర్శకుడిగా నా మొదటి సినిమా అయినా కూడా ప్రస్తుతం చాలా రిలాక్స్‌డ్‍గానే ఉన్నా. ఎలాంటి ఒత్తిడీ లేదు. ఓ రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథ మొదట్నుంచీ, చివరివరకూ హాయిగా నవ్వించేలా ఉంటుంది. ఆ ఫన్ ఎలిమెంటే సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) మీ నేపథ్యం ఏంటి? ఈ ప్రాజెక్టు ఎలా మొదలైంది?

స) నాది కృష్ణా జిల్లా జగ్గయపేట. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే 2007లో నేను తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌కు వి.వి.వినాయక్ గారి ప్రశంస దక్కింది. ఇక ఆ తర్వాత సినీ పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం ఏర్పరచుకోగలనన్న నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. దర్శకుడిగా అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలోనే చిన్నప్పట్నుంచీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన నరేష్, స్వయంగా తానే సినిమా చేస్తానని ముందుకొచ్చి ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేశాడు.

ప్రశ్న) హీరో, హీరోయిన్లుగా అశ్విన్, తేజస్విలనే ఎంచుకోవడానికి కారణం?

స) ఓంకార్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన జీనియస్ సినిమాకు నేను అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశా. అప్పుడే అశ్విన్‌తో పరిచయం ఏర్పడింది. నేననుకున్న కథకు అశ్విన్ సరిగ్గా సరిపోతాడని అనిపించగానే, ఓంకార్ గారిని ఒప్పించి అశ్విన్‌ను హీరోగా ఫిక్స్ చేశాం. ఇక తేజస్వి మంచి ఎనర్జిటిక్ యాక్టర్, తనైతే ఈ పాత్రలోని ఎనర్జీని సరిగ్గా అందుకుంటుందన భావించి ఆమెను ఓకే చేశాం. ఈ సినిమాతో వీరిద్దరికీ ఓ మంచి గుర్తింపు వస్తుందని చెప్పగలను.

ప్రశ్న) ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు రావడం ఎలా అనిపించింది?

స) సాయి కొర్రపాటి లాంటి మంచి గుర్తింపున్న నిర్మాత మా సినిమాను స్వయంగా విడుదల చేసేందుకు ముందుకు రావడం ఈ సినిమా స్థాయినే మార్చేసింది. ఎప్పుడైతే ఆయన మమ్మల్ని నమ్మి తన బ్రాండ్‌ను సినిమాకిచ్చారో, అప్పుడే సగం సక్సెస్ అయ్యామన్న నమ్మకం కలిగింది. ఆడియో లాంచ్ దగ్గర్నుంచి మొదలుపెడితే ప్రమోషన్స్ చేపట్టడం, రేపు భారీగా సినిమాను రిలీజ్ చేయనుండడం.. అంతా ఆయన వల్లే సాధ్యమైంది.

ప్రశ్న) ఈ సినిమాలో సాయి కొర్రపాటి, ఓంకార్‌ల ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉంది?

స) క్రియేటివ్‌ అంశాల పరంగా ఎవ్వరూ ఇన్వాల్వ్ కాలేదు. ఓంకార్ గారు స్క్రిప్ట్ దశనుంచే ఈ సినిమాతోనే ఉన్నారు కాబట్టి, ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. స్క్రిప్ట్ పరంగా, క్రియేటివ్ అంశాల పరంగా ఆయన ఇన్వాల్వ్ కాలేదు. ఇక సాయి కొర్రపాటి గారు కూడా సినిమా ఔట్‌పుట్ విషయంలో మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు.

ప్రశ్న) ట్రైలర్‌లో తెలుగు హిట్ సినిమాల స్పూఫ్స్ కొన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఆ ఐడియా ఎవరిది?

స) సినిమా కథను డీవియేట్ చేయకుండా, కథా గమనానికి మరింత పనికొచ్చేలా ఏవైనా ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందని స్పూఫ్స్ ఐడియా తెచ్చాం. అయితే గతంలో మనం చూసిన స్పూఫ్స్‌లా కాకుండా ఇవి నిర్మాణపరంగానూ ఆ స్థాయిని అందుకునేలా ఉంటాయి. ఏ హీరోనూ కించపరచే విధంగా అయితే ఈ స్పూఫ్స్ ఉండవు.

ప్రశ్న) పూరీ జగన్నాథ్ ఈ సినిమాను మెచ్చుకోవడం, రాజమౌళి ఆడియో లాంచ్‌కి రావడం.. ఇవన్నీ సినిమాకు హైప్ తెచ్చాయి. వారు మీ సినిమాను సపోర్ట్ చేయడం ఎలా అనిపించింది?

స) పూరీ జగన్నాథ్ గారు, రాజమౌళి గారు లాంటి టాప్ డైరెక్టర్స్ ఈ సినిమాను సపోర్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. వారి ప్రోత్సాహంతో మా ఎనర్జీ రెట్టింపైంది.

ప్రశ్న) రెండో సినిమా ప్లాన్స్ ఏమైనా నడుస్తున్నాయా?

స) రెండో సినిమా కోసం కొన్ని ఆలోచనలైతే ఉన్నాయి. అయితే ఇప్పుడే అవేవీ చెప్పలేను. రేపు సినిమా రిలీజ్ అయి, దానికొచ్చే రెస్పాన్స్ చూసి నా నెక్స్ట్ స్టెప్ గురించి చెప్తా.

ఇక అక్కడితో రాకేష్ శశితో మా ఇంటర్వ్యూ ముగిసింది. రాకేష్ మొదటి సినిమా మంచి విజయం సాధించాలన కోరుకుంటూ రాకేష్ అండ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు