ఇంటర్వ్యూ : నారా రోహిత్ – ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకం కాబోతోంది!

ఇంటర్వ్యూ : నారా రోహిత్ – ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకం కాబోతోంది!

Published on Jul 24, 2015 3:38 PM IST

nara-rohit
‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’, ‘రౌడీఫెలో’ లాంటి డిఫరెంట్ మూవీస్‌తో అలరించిన నారా రోహిత్ తాజాగా మరో డిఫరెంట్ మూవీ ‘అసుర’ ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘అసుర’ విజయం తర్వాత తనను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసే సినిమాలను ఎంచుకుంటూ నారా రోహిత్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ కోవలోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘సావిత్రి’, ‘పండగల వచ్చాడు’.. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రేపు (జూలై 25న) ఆయన తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ముందుగా మా తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజున ఏమేం నిర్ణయాలు తీసుకుంటున్నారు?

స) థ్యాంక్యూ. పుట్టినరోజున నిర్ణయాలంటే చాలానే ఉన్నాయి. ఎక్కువ సినిమాలతో మెప్పించాలి. ఇప్పటివరకూ నా కెరీర్‌ను చూసుకుంటే సినిమా సినిమాకూ చాలా గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా నావే నాలుగైదు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నా. ప్రస్తుతానికిదే నా టార్గెట్. ఇక సన్నగా అవ్వడానికి కూడా ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టేశా. సరికొత్త లుక్‌లో కనిపించడం కూడా ఈ పుట్టినరోజుకు పెట్టుకున్న రిజల్యూషన్‌లో ఒకటి. ఒక్కమాటలో చెప్పాలంటే కెరీర్ పరంగా ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం కానుంది.

ప్రశ్న) ‘అసుర’ విజయం తర్వార కెరీర్ ఎలా ఉంది?

స) చాలా బాగుంది. చెప్పాలంటే కొంత బాధ్యత కూడా పెరిగింది. హిట్ వచ్చినప్పుడల్లా ఎంత సంతోషమేస్తుందో, అంతకుమించి బాధ్యత కూడా పెరుగుతుంది. ఇకపై డిఫరెంట్ సినిమాలనే కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా చూసుకుంటున్నా. ప్రస్తుతానికి నాలుగైదు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.

ప్రశ్న) నిర్మాతగానూ మారిపోయారు. ఈ జర్నీ ఎలా ఉండబోతోంది?

స) బాగుంది. బాగుంటుందనే కోరుకుంటున్నా. ప్రొడక్షన్, యాక్టింగ్ రెండూ వేర్వేరు విషయాలైనా నాకైతే ఏ ఇబ్బందీ లేదు. సినిమా గురించి రెండు కోణాల్లోనూ ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి రెండూ ఎంజాయ్ చేస్తున్నా. కేవలం నేనే హీరోగా కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు చేస్తా.

ప్రశ్న) ఆరేళ్ళ కెరీర్‌ను ఒక్కసారి విశ్లేషించుకుంటే ఎలా అనిపిస్తోంది?

స) అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఎక్కువ సినిమాలు చేయలేకపోయామే అన్నది మాత్రం కచ్చితంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇకపోతే ఇప్పటివరకూ కొంచెం డిఫరెంట్ సినిమాలు చేస్తూ పోయానే కానీ, కమర్షియల్‌గా ఆడతాయా లేదా అన్నది ఆలోచించుకోలేదు. ఇకపై ఈ విషయంపై కొంత శ్రద్ధ పెట్టాలి.

ప్రశ్న) ఇకపై ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తానంటున్నారు. డిఫరెంట్ సినిమా, కమర్షియల్ సినిమా రెండింటినీ ఎలా చూస్తారు?

స) డిఫరెంట్ సినిమా, కమర్షియల్ సినిమా వేర్వేరని చెప్పడం లేదు. డిఫరెంట్ సినిమానే కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా తీయడంలోనే విజయం ఉందని నా అభిప్రాయం. కథలు కొత్తవి వస్తేనే మంచిది. అయితే వాటిని అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎలా చెబుతున్నామన్నదే పాయింట్!

ప్రశ్న) నటనతో మొదలుపెట్టారు. ఇప్పుడు నిర్మాతగానూ మారారు. భవిష్యత్‌లో దర్శకత్వం కూడా చేస్తారా?

స) అయ్యో నాకంత సీన్ లేదు. ఓ కథ నా దగ్గరకొస్తే బాగుందా? లేదా? అని మాత్రమే జడ్జ్ చేయగలను. అంతే తప్ప రాయడం, దర్శకత్వం లాంటి విషయాల డీల్ చేసేంత ఓపిక నాకు లేదు. కాకపోతే ఏదైనా డైలాగ్ ఇంకా బాగా రాయగలం అనిపించినప్పుడు సలహాలు మాత్రం ఇస్తుంటా.

ప్రశ్న) ఎక్కువగా ఏ తరహా సినిమాలను చూడడానికి, చేయడానికి ఇష్టపడతారు?

స) చూడటమంటే.. రొమాంటిక్ కామెడీ, వార్, స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి సినిమాల నుంచి మంచి ప్రేరణ లభిస్తుంది. ఇక చేయడమంటే.. నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనే విషయంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే నచ్చిన కథలు చేసుకుంటూ వెళుతున్నా.

ప్రశ్న) బాలయ్య గారితో ఓ మల్టీస్టారర్ చేయనున్నారని టాక్. నిజమేనా?

స) ఇంకా ఈ విషయంపై ఆలోచించలేదు. మల్టీస్టారర్ చేయడమంటే నాక్కూడా ఇష్టమే! అయితే అన్నింటికీ సరైన స్క్రిప్ట్ దొరకాలి.

ప్రశ్న) ప్రస్తుతం చేస్తున్నవి, ఒప్పుకున్న సినిమాలు ఏమేం ఉన్నాయి?

స) ‘శంకర’ మొత్తం పూర్తైంది. ఆ సినిమాను ఆగష్టులో విడుదల చేయలనుకుంటున్నాం. సెప్టెంబర్‌లో ‘పండగలా వచ్చాడు’, డిసెంబర్‌లో ‘సావిత్రి’, ఆ తర్వాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ఇలా కొన్ని సినిమాలను లైన్లో పెట్టా. ఇక మురుగదాస్ గారు అందించిన కథతో తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా ‘మాన్ కరాటే’ను తెలుగులో రీమేక్ చేస్తున్నా.

ఇక అక్కడితో నారా రోహిత్‌తో మా ఇంటర్వ్యూ ముగించాం. మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడాది మరిన్ని మంచి విజయాలను సొంతం చేసుకోవాలని ఆల్ ది బెస్ట్ తెలిపాం.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు