ఇంటర్వ్యూ : రాహుల్ రవీంద్రన్ – ‘శ్రీమంతుడు’కి మహేషే నన్ను సజెస్ట్ చేశారు!

ఇంటర్వ్యూ : రాహుల్ రవీంద్రన్ – ‘శ్రీమంతుడు’కి మహేషే నన్ను సజెస్ట్ చేశారు!

Published on Jun 23, 2015 4:05 PM IST

Rahul-Raveendran
‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’ చిత్రాల ఫేం రాహుల్ రవీంద్రన్, యువహీరోల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్‌తో కలిసి ‘టైగర్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే! ఫ్రెండ్‌షిప్, లవ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘టైగర్’ సినిమా గురించి చెప్పండి?

స) ఫ్రెండ్‌షిప్, లవ్ నేపథ్యంలో నడిచే ఓ డిఫరెంట్ కాన్సెప్టే టైగర్. మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ట్రంయాంగిల్ స్టోరీ. చిన్నప్పట్నుంచీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న ఇద్దరి జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించాక వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పేంటి? అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా నడుస్తుంది. కమర్షియల్ ఫార్మాట్‌లోనే కొత్తగా ఈ సినిమాను ప్రెజెంట్ చేశాం.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?

స) ఈ సినిమాలో నేను విష్ణు అనే ఓ మెచ్యూర్డ్ అబ్బాయిగా కనిపిస్తాను. తనకు ఎదురయ్యే ప్రతీ విషయంపైనా ఓ స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం ఎలాంటి మార్పు తెచ్చిందనే దానిపై నడిచే కథలో విష్ణు క్యారెక్టర్ ప్రధానమైనది.

ప్రశ్న) సందీప్ కిషన్‌తో కలిసి నటించడం ఎలా ఉంది?

స) నేను, సందీప్ కిషన్ గత మూడేళ్ళ నుంచీ మంచి ఫ్రెండ్స్. ఈ కథ విన్న వెంటనే సందీప్‌ నాకు ఫోన్ చేసి ఈ ఆఫర్ గురించి చెప్పాడు. నేను కూడా ఒకసారి కథ విన్నాక వెంటనే ఓకే అనేశా. సందీప్ నా ఫ్రెండే కాబట్టి ఇక ఈ సినిమా షూటింగ్ కూడా సరదాగా గడిచిపోయింది.

ప్రశ్న) ‘అలా ఎలా’ లాంటి హిట్ తర్వాత ఇద్దరు హీరోలున్న సినిమా ఎంచుకోవడానికి కారణం?

స) ‘అలా ఎలా’ లాంటి హిట్ సినిమా తర్వాత కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడే ‘టైగర్’ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ సమయంలో నా కెరీర్‌ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయగల సినిమా కోసం చూస్తూన్నా. ‘టైగర్’ విషయంలో ప్రసాద్, మధు లాంటి పెద్ద నిర్మాతల సినిమా కావడం, మంచి బడ్జెట్‌లో తెరకెక్కే సినిమా కావడం.. ఇలా వీటన్నింటి గురించి ఆలోచించాక ఈ సినిమా నా కెరీర్‌కి బాగా ఉపయోగపడుతుందని నమ్మే ఈ సినిమా చేశా. నా నమ్మకం తప్పక నిజమవుతుందని ధీమాగా ఉంది. కచ్చితంగా టైగర్ నటుడిగా నా స్థాయిని పెంచుతుంది.

ప్రశ్న) దర్శకుడు ఆనంద్ గురించి చెప్పండి?

స) దర్శకుడు వి.ఐ.ఆనంద్ దగ్గర నాకు నచ్చే విషయమంటే.. ఒక యాక్టర్‌కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంతా ఇచ్చేస్తారు. ఆ ఫ్రీడం ఇచ్చేసి వాళ్ళ దగ్గర్నుంచి తనకు కావాల్సింది రాబట్టుకుంటారు. తనకేమేం కావాలో సరిగ్గా తెలిసిన దర్శకుడితో పనిచేయడం ఎప్పుడూ సులువుగానే ఉంటుంది.

ప్రశ్న) ‘శ్రీమంతుడు’లో ఓ రోల్ చేశారు కదా. మహేష్‌తో కలిసి నటించడం ఎలా ఉంది?

స) మహేష్ నా ఫేవరైట్ యాక్టర్. ఆయన నటనలో ఉండే ఇంటెన్సిటీ అంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి నటుడి సినిమాలో ఓ రోల్ చేసే అవకాశం రావడమంటే సంతోషమే కదా! అందులోనూ ఈ క్యారెక్టర్‌కు నేనైతే బాగుంటుందని మహేషే సూచించారట. నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది? ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా లక్కీ. నా రోల్ కథలో చాలా కీలకం.

ప్రశ్న) హీరోగా కొనసాగుతుండగానే సపోర్టింగ్ రోల్ ఎందుకు చేశారు?

స) ‘శ్రీమంతుడు’ సినిమాలో నాది కథలో భాగంగా వచ్చే ఓ కీ రోల్. దాన్ని సపోర్టింగ్ రోల్ అనలేం. ఆ రోల్‌కి ఎవరైనా యంగ్ హీరో లాంటివారైతేనే సూటవుతారు. ఆ అవకాశం నాకు వచ్చింది. ఈ సినిమా తర్వాత కూడా రెండు మూడు కామియో రోల్స్ చేయమని అవకాశాలు వచ్చాయి. వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించా. సోలో హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఉన్నా. సోలో హీరోగా చేయడమనేది ఎక్కడా ఆగలేదు కూడా.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?

స) ఈవారం ‘టైగర్’ రిలీజ్ అవుతోంది. వచ్చే నెలలో ‘హైద్రాబాద్ లవ్‌స్టోరీ’ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఇవేకాక ‘శ్రీమంతుడు’, తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. అలాగే రెండు తెలుగు సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇలా బిజీబిజీగా గడిపేస్తున్నా.

ఇక అక్కడితో రాహుల్ రవీంద్రన్‌తో మా ఇంటర్వ్యూ ముగిసింది. నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్న రాహుల్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, టైగర్ సినిమాకు 123తెలుగు తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు