ప్రత్యేక ఇంటర్వ్యూ : శశికిరణ్ నారాయణ – కొత్త కథలేమీ లేవు..పాత కథని కొత్తగా ప్రెజెంట్ చెయ్యడమే ముఖ్యం.

ప్రత్యేక ఇంటర్వ్యూ : శశికిరణ్ నారాయణ – కొత్త కథలేమీ లేవు..పాత కథని కొత్తగా ప్రెజెంట్ చెయ్యడమే ముఖ్యం.

Published on Dec 11, 2014 6:41 PM IST

Saisi-kiran
రైటర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత నటుడిగా మారి యావత్ ప్రేక్షకులను నవ్విస్తున్న కమెడియన్ ఎంఎస్ నారాయణ. ఆయన వారసురాలు అయిన శశికిరణ్ నారాయణ దర్శకురాలిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. మలయాళంలో హిట్ అయిన ‘తట్టతిన్ మరయతు’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా ఈనెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేము శశికిరణ్ నారాయణతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆమె ఎంతో ఓపెన్ గా చెప్పిన విశేషాలు, సాహెబా సుబ్రహ్మణ్యం గురించి విశేషాలు మీకోసం..

ప్రశ్న) నాన్నగారు రైటర్ గా వచ్చి నటుడిగా సెటిల్ అయ్యారు, అయినా మీరు దర్శకులు కావడానికి మీకు స్పూర్తినిచ్చింది ఏమిటి.?

స) నాన్నగారు నాకు నటుడిగా కంటే రైటర్, టెక్నీషియన్ గానే తెలుసు, ఎందుకంటే ఆయన నా చిన్నప్పుడు థియేటర్ షోస్ కోసం కథలు రాసి డైరెక్ట్ చేసేవారు. చిన్నప్పటి నుంచే ఆయన ప్రభావం నాపై ఉంది. ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీ కాదు, అందుకే నేను మొదట టీవీ ఇండస్ట్రీలోకి వెళ్ళాను అక్కడ వర్క్ నేర్చుకొని అలాగే సినిమాల గురించి తెలుసుకున్నాక ఇది రైట్ టైం అనిపించి ఇలా డైరెక్టర్ అయ్యాను.

ప్రశ్న) మీ మొదటి సినిమానే ఓ రీమేక్ సినిమాని ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి.?

స) చెప్పాలంటే నేను ఏదో డైరెక్టర్ అవ్వాలి అని ఈ సినిమా చెయ్యలేదు. ముందుగా ఈ చిత్ర నిర్మాత నా దగ్గరకి వచ్చి ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చెయ్యాలని అన్నారు. ఆ తర్వాత ఈ మలయాళ సినిమా చూసి నచ్చడంతో రీమేక్ రైట్స్ తీసుకున్నాం. ఆ సినిమా తీసుకున్నాక నేను 6 నెలలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసాను.

ప్రశ్న) మలయాళంలో మెచ్యూర్ యాక్టర్స్ అయిన నివిన్ పాలీ, ఇషా తల్వార్ నటించారు. కానీ మీరెందుకు కొత్త వారిని హీరో హీరోయిన్ గా తీసుకున్నారు.? వారు మీ కథకి న్యాయం చేయగలిగారా.?

స) ఒక ఫీల్ గుడ్ లవ్ స్టొరీ చెబుతున్నాం, నటీనటులు కూడా ఫ్రెష్ గా ఉంటే బాగుంటుంది అనుకొని ఇలా చేసాం. మీరన్నట్టు మలయాళంలో నివిన్ పాలీ, ఇషా తల్వార్ బాగా చేసారు. దిలీప్ కుమార్ – ప్రియ గోర్ లు కొత్త వారైనప్పటికీ వాళ్ళ పరిధి వరకూ పాత్రలకు చాలా న్యాయం చేసారు. ఈ సినిమాని మలయాళం మూవీకి పోల్చి చూస్తే ఇది బాగుందా, అది బాగుందా చెప్పడం కష్టం కానీ ఇదొక డైరెక్ట్ తెలుగు సినిమా అనుకుంటే మాత్రం చాలా మంచి సినిమా తీసాం అనే ఫీలింగ్ వస్తుంది.

ప్రశ్న) ఇదొక లవ్ స్టొరీ, ఇప్పటికే చాలా మంది లవ్ స్టోరీస్ వచ్చాయి. మరి ఇందులో ఉన్న కొత్తదనం ఏమిటి.?

స) నాకు తెలిసి ఇప్పటికే అన్ని జోనర్స్ లో కథలు వచ్చాయి. కావున మన దగ్గర కొత్త కథలేమీ లేవు.. అందుకే ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే ఉన్న పాత కథని ఎంత కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాం అనేదే ముఖ్యం. అదే నేను ఈ సినిమాలో ట్రై చేశాను. ఇది ఒక సింపుల్ టీనేజ్ బాయ్ లవ్ స్టొరీ. కథ మన పక్కింట్లో జరిగినట్టే ఉంటుంది.

దిలీప్ కుమార్ పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. తను ఏమి చెయ్యాలన్నా కాస్త భయపడుతూ ఉంటాడు. కానీ తన పక్కని వారు తను చెయ్యగలడు అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంటారు. అలాంటి వాడు తన ప్రేమ విషయంలో మాత్రం డేరింగ్ గా ఎలా స్టెప్స్ తీసుకుంటాడు. అలాగే హీరోయిన్ ఓ ముస్లీం పాత్రలో కనిపించింది. తను కూడా చాలా బాగా చేసింది. మలయాళంతో పోల్చుకుంటే తెలుగులో హీరోయిన్ పాత్రని ఇంకాస్త ఎలివేట్ చేసాము.

ప్రశ్న) మలయాళంలో నివిన్ పాలీ – ఇషా తల్వార్ కెమిస్ట్రీ అనేది మేజర్ హైలైట్. మరి మీరు నూతన నటీనటులతో మీరు ఆ మేజిక్ ని రీ క్రియేట్ చెయ్యగలిగారా.?

స) రీ క్రియేట్ చెయ్యడం అనేది నా ఒక్కదాని మీదే కాకుండా టీం అందరి మీద కూడా ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసినంతవరకూ ఆ కెమిస్ట్రీని రాబట్టుకున్నాననే అనుకుంటున్నాను. కానీ మలయాళం దీనికి పోల్చుకుంటే మాత్రం నేను చెప్పలేను. ఇక నేను ఎంతవరకూ క్రియేట్ చేయగలిగాను అనేది ఆడియన్స్ చూసి చెప్పాలి.

ప్రశ్న) ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ ఏమిటి.?

స) ఈ సినిమాకి షాన్ రెహమాన్ అందించిన మ్యూజిక్, సాయి ప్రకాష్ విజువల్స్, అలాగే కథలోని పాత్రలని తీర్చిదిద్దిన విధానం ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అవుతాయి.

ప్రశ్న) మలయాళ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన షాన్ రెహమాన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి గల కారణం ఏమిటి.?

స) ఈ సినిమాకి ప్రాణమే మ్యూజిక్., మొదటగా ఇక్కడ వేరే వారిని పెట్టుకుంటే ఆ ఫీల్ రాబట్టుకోలేను అని అనిపించింది. అందుకే తననే తీసుకున్నాను. మలయాళం నుంచి 4 సాంగ్స్ తీసుకున్నా, రెండు సాంగ్స్ మాత్రం వేరే కొట్టించుకున్నాను. ముందు సినిమాటోగ్రాఫర్ కూడా మలయాళం అతనినే తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరక సాయి ప్రకాష్ ని తీసుకున్నాం. సాయి ది బెస్ట్ ఇచ్చాడు.

ప్రశ్న) రజినీ ‘లింగ’తో పాటు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అలాంటి పెద్ద సినిమాతో పాటు రిస్క్ చేసి రిలీజ్ చేస్తున్నాం అనే టెన్షన్ లేదా.?

స) ముందుగా మీరన్నట్టు అది పెద్ద సినిమా కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. అది వేరే కథ వేరు, మనది వేరు. మన సినిమా చూసేవాళ్ళు కూడా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అలాగే సినిమా రెడీ అయ్యి కూడా 6 నెలలు అవుతుంది, ఇక ఆలస్యం చేయలేక రిలీజ్ చేసేస్తున్నాం.

ప్రశ్న) మీ నాన్నగారు డైరెక్టర్ అవుతాను అంటే ఎలాంటి సూచనలు ఇచ్చారు. అలాగే ఆయన సినిమా చూసారా.?

స) నాన్నకి నేను డైరెక్టర్ గా సినిమా చేయబోతున్నాను అంటే నీకు అస్సలు అనుభవం లేదు కదా నువ్వెలా తీస్తావు అని అడిగారు. లేదు నాన్న నేర్చుకున్నాను చెయ్యగలను అని చెప్పి ఈ సినిమా చేసాను. సెన్సార్ అయ్యాక ఆయన ఈ సినిమా చూసారు. నాతో డైరెక్ట్ గా చెప్పలేదు కానీ మా అమ్మతో అన్నారట.. బాగా చేసింది, ఇంత బాగా తీస్తుందని ఊహించలేదు అని అన్నారని అమ్మ చెప్పింది.

ప్రశ్న) మీ పరంగా ఒక డైరెక్టర్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి.?

స) ఒక డైరెక్టర్ కి ముందుగా ఉండాల్సింది ఫోకస్ మరియు సహనం. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఫోకస్ పెట్టి సినిమాలు చేయగలిగితే 10 రోజుల్లో చేయాల్సింది 5 రోజుల్లోనే చేయచ్చు. అందరినీ మేనేజ్ చెయ్యగలిగేలా ఉండాలి. అలాగే 24 క్రాఫ్ట్స్ పై అవగాహన ఉండాలి. ఒక డైరెక్టర్ కి ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది కానీ ఆ ప్రెజర్ ని తీసుకోకుండా వర్క్ చెయ్యాలి.

ప్రశ్న) చివరిగా ఈ సినిమా చూడాలనుకునే ఆడియన్స్ కి ఓ డైరెక్టర్ గా ఏమి చెప్పాలి అనుకుంటున్నారు.?

స) నేను ఒక ఆడియన్ గా సినిమాకి వెళితే ఒక కథని ఎంత కొత్తగా ప్రెజెంట్ చేసాడు, ఆ కథకి మనల్ని ఎంత వరకూ కనెక్ట్ చెయ్యగలిగాడు అనేదే చూస్తాను. అదే ఆ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది. అది దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తీశాను. చూస్తున్న ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. అలాగే సినిమా అయ్యాక ఓ చిరునవ్వుతో బయటకి వస్తారు. ముఖ్యంగా ఈ సినిమా చూసినందు వల్ల టైం వృధా అయ్యింది, మనీ వృధా అయ్యింది అని మాత్రం ఎవ్వరూ అనుకోరు.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి శశికిరణ్ నారాయణకి మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు