అంతా అనుకున్నట్లుగానే కింగ్ అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పేరుతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టేశారు. సంక్రాంతికి ఫిక్స్ అయిన నాలుగు సినిమాల్లో మొదట్నుంచీ ఒక ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించిన ‘సోగ్గాడే..’ నిన్న పెద్ద ఎత్తున విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు అన్నిచోట్లా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘మనం’ తర్వాత నాగ్ చేసిన సినిమా ఇదే కావడం, రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌తో విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా మొదటి రోజు హౌస్‌ఫుల్స్‌తో కనిపించింది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నాగార్జున కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మూడు ఇతర సినిమాలతో థియేటర్లు పంచుకున్నా కూడా ఈ సినిమా నాగ్ కెరీర్‌కు బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చింది. ఈ వీకెండ్‌కి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మించారు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటించారు.


