సమీక్ష : తులసీదళం – నాసిరకమైన హర్రర్ థ్రిల్లర్!

సమీక్ష : తులసీదళం – నాసిరకమైన హర్రర్ థ్రిల్లర్!

Published on Mar 11, 2016 11:40 PM IST
tulasidalam review

విడుదల తేదీ : 11 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : ఆర్పీ పట్నాయక్

నిర్మాత : ఆర్పీ పట్నాయక్

సంగీతం : ఆర్పీ పట్నాయక్

నటీనటులు : నిశ్చల్ దేవా, వందన గుప్తా, ఆర్పీ పట్నాయక్, దువ్వాసి మోహన్


గతంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన ఆర్పీ పట్నాయక్, కొద్దికాలంగా దర్శకత్వ బాధ్యతలను చేపట్టి పలు ఆసక్తికర సినిమాలను చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘తులసీ దళం’ అనే హర్రర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినిమాలో ఓ సరికొత్త ప్రయోగమని ప్రచారం పొందిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

ఎవరూ లేని అనాథైన సాత్విక్ (నిశ్చల్ దేవ) తాను ప్రేమించిన అమ్మాయి నిషా (వందన గుప్తా) కోసం లాస్ వేగాస్ వెళతాడు. దయ్యాలను, అదృశ్య శక్తులను ఏమాత్రం నమ్మని సాత్విక్, అందుకు విరుద్ధమైన ఆలోచనలున్న సుబ్బుతో కలిసి ఒకే ఉండాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే ఓ రోజు సుబ్బూ, సాత్విక్‍ని స్మశానంలో ఓ రాత్రి గడపాలనే ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్‌ను సాత్విక్ విజయవంతంగానే పూర్తి చేసినా, ఆ తర్వాత అతడికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. శాంతి పేరుగల ఓ అమ్మాయి అతడిని వెంటాడుతున్న ఫీలింగ్ కూడా అతడ్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీటన్నింటికీ కారణం ఏంటి? శాంతి ఎవరు? ఈ సమస్యల నుంచి సాత్విక్‌ని డాక్టర్ తిలక్ (ఆర్పీ పట్నాయక్) ఎలా కాపాడాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ పాయింట్స్ అంటే నటీనటుల పనితీరు గురించి చెప్పుకోవచ్చు. హీరో నిశ్చల్ దేవా, హీరోయిన్ వందన గుప్తా తమ తమ పాత్రల్లో బాగానే నటించారు. వందన గుప్తా చూడడానికి కూడా బాగుంది. ఇక చిన్నరోల్‌ అయినా కూడా ఆర్పీ పట్నాయక్, కథను మలుపుతిప్పే పాత్రలో బాగా మెప్పించారు. ఇక నటుడు దువ్వాసి మోహన్, సుబ్బు పాత్రలో నటించిన నటుడు బాగా నటించారు. సినిమా పరంగా చూస్తే తక్కువ రన్‌టైం ఉండడాన్ని ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అసలు కథే ప్రధాన మైనస్ పాయింట్ అన్నది సుస్పష్టం. అసలు ఏమాత్రం బలం లేని ఒక కథకు, ఏదో అర్థం లేని కారణాన్ని చూపి హర్రర్ థ్రిల్లర్‌గా మార్చాలన్న ప్రయత్నమే వృథా. ఇక అర్థంపర్థం లేకుండా వచ్చిన క్లైమాక్స్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. సినిమా మొత్తమ్మీదా ఎక్కడా లాజిక్ అన్న అంశానికి విలువే ఇవ్వకపోవడం పెద్ద మైనస్ పాయింట్.

ఈ మధ్యకాలంలో వచ్చిన హర్రర్ సినిమాల్లో ఈ స్థాయిలో కథ, కథనం, మేకింగ్ పరంగా మెప్పించలేకపోయిన సినిమాగా దీన్నే చెప్పుకోవాలి. వీఎఫ్ఎక్స్ కూడా నాసిరకంగా ఉన్నాయి. లాస్‌వేగాస్‌లో సినిమాను తీశామని చెప్పుకొచ్చినా లొకేషన్స్ పరంగా సినిమాలో కొత్తగా చేసిందేమీ లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగానూ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరిచిన డిపార్ట్‌మెంట్ ఏదీ లేదు. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఎడిటింగ్ గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ఇక ఈ సినిమాకు దర్శకుడు, రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడు, ఒక కీలక పాత్రలో నటించిన నటుడు కూడా అయిన ఆర్పీ పట్నాయక్ ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ మెప్పించలేకపోయారు. ఒక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఫర్వాలేదనిపించాడు.

తీర్పు :

తెలుగులో గత కొద్దికాలంగా హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘తులసీదళం’ పేరుతో దర్శకుడిగా మారి వినూత్న చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తోన్న ఆర్పీ పట్నాయక్ ఓ హర్రర్ థ్రిల్లర్‌తో మెప్పించేందుకు వచ్చి విఫలమయ్యారు. ఒక్క నటీనటుల ప్రతిభ తప్పిస్తే, ఈ సినిమాలో చెప్పుకోవడానికి ప్లస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. ఏ ఒక్క డిపార్ట్‌మెంట్‌ పరంగా చూసినా కూడా మెప్పించని ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన నాసిరకమైన హర్రర్ థ్రిల్లర్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు