సమీక్ష : బంతిపూల జానకి – బోరింగ్ కామెడీ థ్రిల్లర్!

సమీక్ష : బంతిపూల జానకి – బోరింగ్ కామెడీ థ్రిల్లర్!

Published on Aug 26, 2016 9:33 PM IST
Banthi Poola Janaki review

విడుదల తేదీ : ఆగష్టు 26, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : ప్రవీణ్ చందర్

నిర్మాత : కళ్యాణి – రామ్

సంగీతం : భోలే

నటీనటులు : ధన్‌రాజ్, దీక్షాపంత్..


కమెడియన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ధన్‌రాజ్, కొద్దికాలంగా హీరోగానూ మారి చిన్న చిన్న సినిమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘బంతిపూల జానకి’. కామెడీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అదుర్స్ రఘు, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ లాంటి టీవీ స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

‘బంతిపూల జానకి’ అనే సినిమాకు గానూ జానకి (దీక్ష పంథ్) అనే ఓ హీరోయిన్‌కు జాతీయ అవార్డు ప్రకటించబడుతుంది. ఇక జానకికి అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆ సినిమా హీరో ఆకాష్ (సుడిగాలి సుధీర్), రచయిత మిరియాలు (రాఘవ), నిర్మాత బంగారయ్య (రఘు), దర్శకుడు అహంకారం (చమ్మక్ చంద్ర).. ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెను సర్‌ప్రైజ్ చేయాలనుకుంటారు. అనుకోకుండా ఒక దగ్గర చేరిన వీరంతా ఆ సాయంత్రం తమ సినిమాకు అవార్డు రావడాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కాగా కొన్ని అనుకోని పరిస్థితుల్లో, ప్రమాదవశాత్తూ ఒక్కొక్కరూ జానకి చేతిలో చనిపోతూ ఉంటారు. ఇక మిగతా కథంతా ఈ హత్యల నుంచి జానకి ఎలా తప్పించుకుంది? జానకి స్నేహితుడు, మేనేజర్ అయిన శ్యామ్ (ధన్‌రాజ్) ఆమెను ఎలా కాపాడాడు? అన్న దాని చుట్టూ తిరుగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ఉన్నంతలో ప్లస్ పాయింట్స్ అంటే అదుర్స్ రఘు, రాఘవ, సుధీర్, చమ్మక్ చంద్రల మధ్యన వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రఘు కొన్ని చోట్ల తన డిక్షన్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. ధన్‍రాజ్ సిన్సియర్‌గా తన పాత్రలో బాగా నటించేశాడు. అయితే కామెడీ యాంగిల్ లేని పాత్ర కావడంతో ఆయన ఇమేజ్‌కు ఈ పాత్ర సరిపడలేదనిపించింది. చమ్మక్ చంద్ర, రాఘవలు తమ డైలాగ్ డెలివరీతో సినిమాను చాలాచోట్ల నిలబెట్టారు.

మైనస్ పాయింట్స్ :

ఒక స్పష్టమైన కథ, కథనాలంటూ ఏవీ లేకపోవడమే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఓ చిన్న పాయింట్‌ను పట్టుకొని 90 నిమిషాల సినిమాగా మలచడంలో పూర్తిగా విఫలమవ్వడంతో సినిమా అంతా బోరింగ్‌గా, ఎక్కడా ఎగ్జైట్‌మెంట్ అన్నదే లేకుండా సాగింది. ఆ ఉన్న ఒక్క పాయింట్ కూడా సిల్లీగా ఉండడం కూడా మైనస్ పాయింట్‌గా చెప్పాలి. ప్రమాదవశాత్తు ఒక్కొక్కరూ చనిపోవడం, వాటిని దాచిపెట్టేందుకు హీరోయిన్ కష్టాలు పడుతూండడం.. ఈ సన్నివేశాల్లో ఎక్కడా సీరియస్‌నెస్ అన్నదే లేదు. పోనీ అది కామెడీగా ఉన్నదా అంటే అదీ లేదు. దీంతో సినిమా అంతా ఇటు థ్రిల్లర్‌గా కాక, అటుగా కామెడీగా కాకుండా పోయింది.

కథకు చాలా కీలకమైన హీరోయిన్ పాత్రలో దీక్షాపంథ్ తేలిపోయింది. పతాక సన్నివేశాల్లోనూ నటనలో సాదాసీదా ప్రతిభ కనబర్చిన ఆమె సినిమాకు మైనస్‌గానే నిలిచింది. ఇక క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఐటెం నంబర్ ఎందుకొచ్చిందో అన్నట్లనిపించింది. సినిమాలో చావడాన్ని, ఆ తర్వాత ఆ చావు చుట్టూ వచ్చే సన్నివేశాలను ఏమాత్రం ఆకట్టుకోని విధంగా డిజైన్ చేశారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే దర్శకుడు ప్రవీణ్ చందర్, ఒక వీక్ స్క్రిప్ట్‌తో సినిమా తీస్తూ, ఆ తీసే ప్రయత్నంలో అక్కడక్కడా కూడా మెప్పించే సన్నివేశాలను చెప్పలేక విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. ఒకే ఇంట్లో జరిగే 90 నిమిషాల సినిమాను దర్శకుడు ఇంత బోరింగ్‌గా ఎలా తయారుచేశారా అనిపించకమానదు.

సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. డైలాగ్స్, ఎడిటింగ్, మ్యూజిక్.. ఇలా టెక్నికల్‌గా సినిమా వీక్ అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదనేలా ఉన్నాయి.

తీర్పు :

ఒక్క కామెడీ జానర్‌లో మాత్రమే ఎంత సిల్లీగా పరిస్థితులు మారిపోతూ కనిపించినా నడిచేస్తూంటుంది. అయితే ఆ కామెడీలో బలం ఉండాలన్నది, చెప్పే సన్నివేశాలు సిల్లీగా ఉన్నా, అందులో ఎక్కడో ఒకమూల చిన్నపాటి కామెడీ లాజిక్ ఉండాలన్నది మరవకూడని అంశం. సరిగ్గా ఇక్కడే ఫెయిలైన కామెడీ థ్రిల్లర్ ‘బంతిపూల జానకి’. స్పష్టమైన కథ, కథనాలు లేకపోవడం, హాయిగా నవ్వించే సినిమాలు ఎక్కడో గానీ కనిపించకపోవడం లాంటి మైనస్‌లతో వచ్చిన ఈ సినిమాలో ‘జబర్దస్త్’ యాక్టర్స్ కాస్త నవ్వించారన్నదే ప్లస్. ఒక్కమాటలో చెప్పాలంటే.. 15 నిమిషాల బోరింగ్ స్కిట్‌ను 90 నిమిషాల సినిమాగా మార్చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందీ సినిమా!
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు