సమీక్ష : శివ తాండవం – డెడ్ స్లో

సమీక్ష : శివ తాండవం – డెడ్ స్లో

Published on Oct 5, 2012 2:53 PM IST
విడుదల తేదీ: 05 అక్టోబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ :2/5
దర్శకుడు : ఎ.ఎల్ విజయ్ కుమార్
నిర్మాత : రోని స్ర్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, సి. కళ్యాణ్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నటీనటులు : జగపతి బాబు ,విక్రమ్,అనుష్క

శివ పుత్రుడు, అపరిచితుడు సినిమాల తెలుగు వారికి సుపరిచితుడు అయిన విక్రమ్ కి ఆ రెండు సినిమాల తరువాత తెలుగులో ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. ఆ తరువాత మజా, విలన్, నాన్న, వీడింతే లాంటి సినిమాలు వరుసగా చేసాడు కాని హిట్ మాత్రం అందని ద్రాక్షే అయింది. నాన్న సినిమా డైరెక్టర్ ఎ.ఎల్ విజయ్ కుమార్ కి మరో అవకాశం ఇచ్చి అయన డైరెక్షన్లో మరో సినిమా చేసాడు. ఈ సారి విక్రమ్ కి జగపతి బాబు కూడా జత కలిసాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మల్టి స్టారర్ సినిమా తాండవం. ఈ సినిమా తమిళనాడులో తాండవం పేరుతో గత వారమే విడుదలైంది. తెలుగులో శివ తాండవం పేరుతో ఈ వారం విడుదల చేసారు. ఇంతకు ఎవరు ఎవరి మీద శివ తాండవం చేసారో ఒకసారి చూద్దాం.

కథ :

‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) డిపార్టుమెంటులో టాప్ 5 ఇంటెలిజెన్స్ అధికారులలో ఒకరైన శివ కుమార్ (విక్రమ్) మరియు అదే విభాగంలో పని చేసే మరో అధికారి శరత్ (జగపతి బాబు) మంచి స్నేహితులు. విధి నిర్వహణలో ఇద్దరిలో ఎవరికి ఆపద ఏ వచ్చినా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. శివకి మీనాక్షి (అనుష్క) తో వివాహం జరుగుతుంది. అతను తన వివాహ సమయంలో బిజీగా ఉన్న సమయంలో ఒక ముఖ్యమైన కేసు ఇన్వెస్టిగేషన్ శరత్ కి అప్పగిస్తారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో శరత్ కి ఇష్టం లేకపోయినా శివ సహాయం చేస్తుంటాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో శరత్ గాయ పడటంతో ఆ కేసుని శివ హ్యాండిల్ చేయడం మొదలు పెడతాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగం గానే శివ లండన్ వెళతాడు. లండన్ వెళ్ళిన శివకి అనుకోని సమస్యలు ఎదురై కొన్ని భయంకర నిజాలు తెలుస్తాయి. తనకు ఎదురైన సమస్యల నుండి శివ ఎలా బైట పడ్డాడు. విజయవంతంగా ఆ ఇన్వెస్టిగేషన్ ముగించాడా లేదా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

గత పది సంవత్సరాలుగా విక్రమ్ చేసిన సినిమాలు గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అతని సినిమాల్లో హీరో పాత్రకి ఏదైనా అంగ వైకల్యం/మానసిక వైకల్యం లేదా హీరో విచిత్రమైన గెటప్స్ వేయడం కనిపిస్తాయి. అదే తరహాలో విక్రమ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఒకటి దేశాన్ని కాపాడే ఇంటెలిజెన్స్ అధికారి శివ పాత్ర కాగా, మరొకటి తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే కెన్ని అనే అంధుడి పాత్రల్లో నటించాడు. స్వతహాగా విక్రమ్ మంచి నటుడు ఈ సినిమాలో తెలివైన అందుడిగా బాగా నటించాడు. స్లోగా నడుస్తున్న సినిమాలో జగపతి బాబు పాత్ర కొంత వరకు ఊరటనిచ్చింది మీనాక్షి పాత్రలో అనుష్క బాగానే చేసింది. ఒక వైపు పాటలో చాలా బావుంది. ఈ సినిమా మొత్తంలో చివరి నలభై నిముషాలు మాత్రమే బావుంది. ఫస్టాఫ్ అంత స్లోగా సాగి ఇంటర్వెల్ తరువాత ఒక పావుగంట సేపు కూడా అలాగే నత్త నడకన సాగిన సినిమా ఒక వైపు పాట తరువాత నుండి సినిమా వేగం పుంజుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

కమల్ హాసన్ తరువాత విభిన్నమైన పాత్రలు చేయడంలో మేటి అనిపించుకున్న నటుడు విక్రమ్ కథల ఎంపిక విషయంలో ఇకనైనా జాగ్రత్త వహిస్తే బావుంటుంది. నటన పరంగా అతనిని అనడానికి ఏమీ లేదు. వచ్చిన సమస్యల్లా ఏమిటంటే అతను తన పాత్ర మీద మమకారం ఎక్కువై ఆ పాత్ర సాధారణ ప్రేక్షకుడికి ఎంత వరకు చేరుతుంది అన్న విషయాన్ని విస్మరిస్తున్నాడు. హీరోకి సహాయం చేయడానికి అంటూ సృష్టించిన యామి జాక్సన్ పాత్ర శుద్ధ దండగ. అసలు డాన్స్ రాని ఆమెకి సోలో పాట ఒకటి. ఆ పాటలో ఆమె క్యాట్ వాక్ తప్ప ఏమీ చేయలేదు. సినిమాలో నుండి ఆ పాట ఎడిట్ చేస్తే బెటర్. సీరియస్ సినిమాలో కామెడీ ట్రాక్ పెట్టకపోయినా బావుండేది, అనవసరంగా సంతానంతో కామెడీ ట్రాక్ అని పెట్టారు. నవ్వుదామని తెగ ట్రై చేసి చక్కిలిగింతలు పెట్టుకున్నా కూడా నవ్వు రాలేదు. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే అంతా రోడ్ రోలర్ కంటె స్లో. లండన్లో ఉండే తెలుగు పోలీసు అధికారి వీరకతి (నాజర్) కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ యాంగ్రీ బర్డ్స్ లాంటి గేమ్స్ ఆడుతూ సొంత డబ్బింగ్ తో విసుగు తెప్పించాడు. లక్ష్మి రాయ్ పాత్ర సినిమాకి పెద్దగా ఉపయోగపడింది ఏమీ లేదు. సినిమా ప్రారంభంలో లండన్లో పేలుళ్ళకి సంబందించిన దృశ్యాల్లో గ్రాఫిక్స్ చాలా నాసి రకంగా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో ఒక్క పాట కూడా ఆకట్టుకోలేదు కాని చిత్రీకరణ పరంగా ఒక వైపు పాట బావుంది. నేపధ్య సంగీతం కేవలం చివరి నలభై నిమిషాలకు తప్ప ఉపయోగపడింది ఏమీ లేదు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ చాలా బావుంది. లండన్ లోకేషన్లు మాత్రం చాలా బాగా చూపించాడు. గజిని, రంగం వంటి ఎన్నో సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన అంటోనీ ఈ సినిమా విషయంలో మాత్రం కత్తెరకి పని చెప్పలేదు.

తీర్పు :

గత వారమే విడుదల కావాల్సిన ఈ సినిమా వివాదం వల్ల ఒక వారం ఆలస్యంగా విడుదలైంది. ఇప్పటికే తమిళ్లో విడుదల కావడం సినిమాలో విషయం లేదని తేలడంతో ఈ వారం విడుదలైన ఈ సినిమాని చూడడానికి ఇక్కడ ఎవరూ ఆసక్తి చుపించకపోవడంతో కనీస ఓపెనింగ్స్ కూడా లేవు. విక్రమ్ నటన చివరి నలభై నిముషాలు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

అశోక్ రెడ్డి. ఎమ్

Click Here For ‘Shivathandavam’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు