సమీక్ష : జత కలిసే – సరదా సరదా లవ్ జర్నీ!

సమీక్ష : జత కలిసే – సరదా సరదా లవ్ జర్నీ!

Published on Dec 27, 2015 2:45 PM IST
Jatha-Kalise-review

విడుదల తేదీ : 25 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : రాకేష్ శశి

నిర్మాత : నరేష్ రావూరి

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : అశ్విన్, తేజస్వి, స్నిగ్ధ

‘రాజుగారి గది’ సినిమాతో పరిచయమైన అశ్విన్ హీరోగా ‘సీతమ్మ వాకిట్లో..’, ‘కేరింత’ సినిమాలతో మెప్పించిన తేజస్వి హీరోయిన్‌గా నటించిన సినిమా ‘జత కలిసే’. రాకేష్ శశి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాను నరేష్ రావూరి నిర్మించారు. గత కొద్దికాలం క్రితం ఎవ్వరికీ పెద్దగా పరిచయం కూడా లేని ఈ సినిమాను, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తన సొంత బ్యానర్ వారాహి చలన చిత్రంపై విడుదల చేసేందుకు సిద్ధమవ్వడంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ క్రేజ్‌తోనే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జత కలిసే’ ఎంతమేరకు ఆకట్టుకుందీ.. చూద్దాం..

కథ :

రిషి (అశ్విన్).. అమెరికాలో ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీయీఓ. తన ఫ్రెండ్ పెళ్ళికి వైజాగ్ వచ్చిన రిషి, అతడి ఫ్రెండ్స్‌తో చేసే ఓ గొడవ వల్ల పెళ్ళి ఆగిపోతుంది. ఇక ఆ తర్వాత తిరిగి అమెరికా వెళ్ళేందుకు రిషి ఓ క్యాబ్‌లో హైద్రాబాద్ వరకూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే.. హైద్రాబాద్‌లో జరిగే సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్ళాల్సిన తేజస్వి (తేజస్వి) కూడా అదే క్యాబ్‌లో అనుకోకుండా ప్రయాణించాల్సి వస్తుంది. వైజాగ్ నుంచి హైద్రాబాద్ వరకు జరిగే ఈ ప్రయాణంలో రిషి, తేజస్విలకు ఏమేం అనుభవాలు ఎదురయ్యాయి? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఓ తండ్రి ఇరవై ఏళ్ళ కలను కూతురు ఎలా నెరవేర్చింది? ఈ మొత్తం జర్నీలో ఏం జరిగిందీ? అన్నదే ‘జత కలిసే’ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఓ రోడ్ జర్నీలో ప్రేమకథను చెప్పాలనుకున్న ఆలోచన గురించి చెప్పవచ్చు. రోడ్ జర్నీ నేపథ్యంలో నడిచే కథలన్నింటిలో జీవం ఉంటుంది. అలా ఓ కథ చెప్పాలన్న ఆలోచన అభినందనీయమే. ఇక ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్లు ప్రయాణించే కారు డ్రైవర్ గా ‘అలా మొదలైంది’ స్నిగ్ధ, హీరో కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. సెకండాఫ్‌లో ‘శ్రీమంతుడు’, ‘గబ్బర్ సింగ్’, ‘బెంగాల్ టైగర్’, ‘సైజ్ జీరో’ తదితర సినిమాలను కలుపుతూ చేసిన ఆరు నిమిషాల స్పూఫ్ మంచి రిలీఫ్. అదేవిధంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే పాట, ఆ తర్వాత క్లైమాక్స్ బాగున్నాయి. టైటిల్ కార్డ్స్ వేసిన విధానం చాలా బాగుంది.

హీరో అశ్విన్ మొదటి సినిమాతో పోల్చితే మంచి పరిణతి కనబరిచాడు. ఎనర్జిటిక్ సన్నివేశాల్లో బాగా చేసినా, ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం కొన్నిచోట్ల తేలిపోయాడు. హీరోయిన్ తేజస్వి తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. స్నిగ్ధ తన కామెడీతో ఫస్టాఫ్‌ను చాలాచోట్ల నిలబెట్టింది. ఇక మిగతా నటీ నటులంతా తమ పరిధిమేర బాగానే నటించారు. సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్‌లో స్నిగ్ధ కామెడీ, సెకండాఫ్‌లో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పార్ట్ ఆకట్టుకునేలా ఉంది. జర్నీ సినిమాలు పెద్దగా పరిచయం లేని తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఉన్నంతలో కూసింత కొత్తగా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఓ రోడ్ జర్నీ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ చెప్పాలన్న ఆలోచన మంచిదే, కానీ ఆ బ్యాక్ డ్రాప్ కి తగిన కథ రాసుకోవడంలో ఫెయిల్ అవ్వడమే ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్. అలా అంటే.. ఎక్కడా బోర్ కొట్టని కథ, ఆ జర్నీలానే హాయిగా, ఆహ్లాదకరంగా సాగిపోయే సన్నివేశాలతో పాటు ఓ ఎమోషన్ కూడా ఉండడమే రోడ్ జర్నీ సినిమాలకు ప్రధాన బలం. ఈ సినిమా ఆ అంశంలోనే చాలాచోట్ల తడబడ్డట్టు కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల ఆలోచనలేంటి? నేపథ్యమేంటి? వారి టార్గెట్ ఏంటీ? లాంటి అంశాలను చెప్పినప్పుడు ఆ పాయింట్స్ ని బేస్ చేసుకుంటూనే కథని నడిపించాలి. కానీ ఈ అంశాలను పొందు పరచకుండా వేరెవరో జర్నీ చూపిస్తున్నట్లు జర్నీని సాగించడం వలన హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్‌లలో సహజత్వం కనిపించదు.

సినిమాను మొదలుపెట్టడమే ఒక సీరియస్ అంశాన్ని చిల్లర వ్యవహారంలా చూపి, ఆ తర్వాత అదే అంశాన్ని సీరియస్ అంశంలా ప్రస్తావించి ఒక క్లారిటీ లేకుండా ఫస్టాఫ్ అంతా నడిపించారు. సెకండాఫ్‌లో ఈ మైనస్‌ను కప్పిపుచ్చేలా కొన్ని సన్నివేశాలను రూపొందించినా అప్పటికే సినిమా సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోవడం వలన డైరెక్టర్ ఇచ్చిన క్లారిటీ అవ్వలేదు. ‘జత కలిసే’ అన్న టైటిల్‌లో తెలీకుండానే ఓ రొమాంటిక్ లవ్ స్టొరీ అన్న ఫీలింగ్ ఉంది. సినిమా మాత్రం వేరే కోణంలో సాగుతుంది. టైటిల్‍ను కేవలం క్యాచీగా ఉండడానికే పెట్టినట్లు ఈ విషయంతో తెలిసిపోతుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూసుకుంటే సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి పనితనాన్ని మెచ్చుకోవాలి. ఒక జర్నీ సినిమాకు కావాల్సిన మూడ్‌ను, ట్రావెల్‌లో వచ్చే మార్పును బాగా క్యాప్చర్ చేశారు. సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ బాగుంది. రెండు పాటలు వినడానికి, చూడడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం మాత్రం రొటీన్‌గా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. స్పూఫ్ సన్నివేశాలను కూడా రిచ్‌గా తెరకెక్కించిన విషయంలో ప్రొడక్షన్ ని మెచ్చుకోవచ్చు.

ఇక దర్శక, రచయిత రాకేష్ శశి గురించి చెప్పుకుంటే.. ఒక్క రెండు రోజుల్లో నడిచే కథను, ఒక రోడ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కించాలన్న ఆలోచన ద్వారా కొత్త దర్శకుడిగా ఏదో కొత్తదనం చూపించాలన్న తాపత్రయం కనిపిస్తుంది. అయితే ఆ తాపత్రయానికి ఒక సరైన కథ, కథనాన్ని అల్లుకోవడంలో మాత్రం తడబడినట్లు కనిపించింది. దర్శకుడిగా మాత్రం కొన్ని అంశాలను జాగ్రత్తగా పట్టుకొని చివరివరకూ సినిమాను ఫర్వాలేదనిపించేలా నడపడంలో కొంతమేరకు సఫలమయ్యాడు. కొన్ని డైలాగులు కూడా బాగా రాశాడు.

తీర్పు :

ముందే చెప్పుకున్నట్లు, రోడ్ జర్నీ కథల్లో జీవం ఉంటుంది. ఆ అంశాన్నే పట్టుకొని ఒక కథ చెప్పాలన్న ఆలోచనను, ప్రయత్నాలను తక్కువ సార్లు మాత్రమే చూస్తుంటాం. అలాంటి రోడ్ జర్నీ నేపథ్యానికే ఓ ప్రేమకథను జత చేసి చూడటానికి డీసెంట్ గా అనిపించేలా తీసిన సినిమాయే ‘జత కలిసే’. ఒక మంచి ఆలోచనను పూర్తి స్థాయి కథగా, సినిమాగా రూపొందించడంలో తడబడడం, కొన్ని చోట్ల కథా గమనం మందగించడం, క్లారిటీ లేకుండా వచ్చే కొన్నిసన్నివేశాలను పక్కనబెడితే, నవ్వించే కామెడీ, సెకండాఫ్‌లో వచ్చే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో ఎమోషన్, ఉన్నంతలో ఒక జర్నీ సినిమాను చూస్తున్నామన్న ఫీలింగ్.. లాంటి అంశాలు ఈ సినిమాకు కలిసివచ్చే అంశాలు. పెద్ద స్టార్స్ లేరు కావున ఏ అంచనాలూ లేకుండా ఈ సినిమాకి వస్తారు, అలా వచ్చిన వారు హాయిగా నవ్వుకొని ఓ సరదా లవ్ జర్నీ సినిమా చూసాం అనే ఆలోచనతో బయటకి వచ్చే సినిమా ‘జత కలిసే’!!

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు