సమీక్ష : కాయ్ రాజా కాయ్ – రొటీన్ క్రైమ్ కామెడీ

సమీక్ష : కాయ్ రాజా కాయ్ – రొటీన్ క్రైమ్ కామెడీ

Published on Apr 23, 2015 3:48 PM IST
Kai Raja Kai

విడుదల తేదీ : 23 ఏప్రిల్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : శివ గణేష్

నిర్మాత : మారుతి టాకీస్, ఫుల్‌మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం : జె.బి.

నటీనటులు : రామ్‌ఖన్నా, మానస్‌, షామిలి, శ్రావ్య..

మారుతి టాకీస్ సమర్పణలో ఫుల్‌మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సినిమా ‘కాయ్ రాజా కాయ్’. రామ్ ఖన్నా, మానస్, షామిలి, శ్రావ్యలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ద్వారా శివ గణేశ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘కాయ్ రాజా కాయ్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగానే కొత్త దర్శకుడి సినిమా అనగానే సినిమాలో కొత్తదనం కోరుకోవడం సహజం. మరి ఈ సినిమాలో ఆ కొత్తదనం ఉందా? కాయ్ రాజా కాయ్ ఏ మేరకు మెప్పించింది? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక బంగారం వ్యాపారిని చంపేసి అతడి వద్దనున్న ఓ బంగారం పెట్టెను కొందరు దుండగులు దోచుకెళతారు. ఆ పెట్టెను ఓ కార్లో పెట్టి ఆ కారును పాడుబడిన గ్యారేజీలో పడేసి వెళ్ళిపోతారు. ఇదే బంగారం పెట్టె కోసం భట్టూ అనే గ్యాంగ్‌స్టర్ తన వాళ్ళతో వెతుకుతూ ఉంటాడు. బంగారాన్ని దొంగతనం చేసిన వారిని పట్టుకొని చివరకు బంగారాన్ని సొంతం చేసుకుంటాడు. ఈ కథతో పాటు సినిమాలో సమాంతరంగా నడిచే మరోకథే ఆనంద్(మానస్), కన్నా(రామ్ ఖన్నా), చిట్టీ(జోష్ రవి) అనే ముగ్గురు యువకులది. ఆనంద్ ఓ చిన్న ఉద్యోగం సంపాదించాలనే క్రమంలో కష్టపడుతుండగా, కన్నా ఓ చిన్న మెకానిక్ షాపులో పనిచేస్తుండాడు. చిట్టీ వీరిద్దరికి భిన్నంగా కిడ్నాప్, స్మగ్లింగ్ లాంటివి చేసి డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలో ఉంటాడు.

అతి సాధారణంగా సాగిపోయే వారి జీవితంలో ఒకేసారి కుదుపులు వచ్చిపడతాయి. కన్నా ఎంతగానో ప్రేమించే అమ్మాయి అతణ్ణి మోసం చేసి వెళ్ళిపోవడం, ఒక అమ్మాయి వల్ల ఆనంద్ ఉద్యోగం ఊడిపోవడం జరిగిపోతుంది. బాధలో ఉన్న ఆ ముగ్గురు కలిసి ఓ కిడ్నాప్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో భట్టూ తాను ఎంతో కష్టపడి సాధించుకున్న బంగారం పెట్టే ఈ ముగ్గురి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భట్టూ వీరి కోసం వెతకడం, వీళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయి (ఆనంద్ గర్ల్‌ఫ్రెండ్) కోసం కొందరు వెతకడం.. ఇలా నడుస్తుంది కథ. ఆ తర్వాత ఏమైంది? బంగారం పెట్టె గురించి భట్టూకి మాత్రమే తెలిసిన విషయమేంటి? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఎంచుకున్న నేపథ్యాన్ని ప్రధాన బలంగా చెప్పుకోవాలి. క్రైమ్ కామెడీ కథలను ఎప్పుడు చెప్పినా కొత్తగా చెప్పే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ విషయంలో ఈ సినిమా కొంతమేర ఫర్వాలేదనిపించుకుంటుంది. మొదటి సన్నివేశంతోనే కథలోకి తీసుకెళ్ళడం బాగుంది. ఫస్టాఫ్‌లో మెయిన్ ప్లాట్‌ను, సబ్‍ ప్లాట్‌ను బాగానే డీల్ చేశారని చెప్పాలి. అలాగే ప్రీ ఇంటర్వెల్‌కు వచ్చేసరికి సబ్‌ ప్లాట్‌ను మెయిన్ ప్లాట్‌కు కనెక్ట్ చేసే విధానం ఆకట్టుకునేలా ఉంది.

జోష్ రవి పాత్ర సినిమాకు మంచి ప్లస్‌పాయింట్‌గా చెప్పుకోవాలి. సినిమా డల్ అయిన సందర్భాల్లో ఆ పాత్ర మళ్ళీ జోష్ నింపే ప్రయత్నం చేసింది. చాలా సన్నివేశాల్లో సినిమాను అతనే నిలబెట్టాడంటే ఆశ్చర్యం కాదు. ఇద్దరు హీరోలు, వారి లవ్‌ట్రాక్‌లు కొంతవరకు బాగానే ఆకట్టుకుంటాయి. హీరో ఇంటి ఓనర్ నేపథ్యంలో వచ్చే అడల్ట్ కామెడీ, అలాంటి సన్నివేశాలను కోరుకునేవారికి బాగా నచ్చే అంశం.

హీరో హీరోయిన్లుగా నటించిన వారిలో అందరూ తమ తమ పరిధిమేర బాగానే నటించారు. రామ్ ఖన్నా తన పాత్రకు అన్ని విధాలా న్యాయం చేశాడు. భవిష్యత్‌లో మరిన్ని మంచి పాత్రలు చేయగలడన్న నమ్మకాన్ని కలిగించాడు. మానస్ తన పాత్రను బాగా పోషించాడు. సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తాన్ని రెండు సమాంతర కథలతో నడిపి ఫర్వాలేదనిపించారు. సెకండాఫ్‌లో ఈ రెండు కథలను కలిపేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో సినిమా మంచి క్రైమ్ కామెడీగా నడవడానికి అవకాశమున్న సన్నివేశాలను అందుకునే ప్రయత్నం చేసి బాగుందనిపించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్‌లంటే కథ, కథనాల గురించే చెప్పుకోవాలి. క్రైమ్ కామెడీ అనే నేపథ్యం ఆకట్టుకునేదే అయినా కథ మాత్రం గతంలో ఎన్నో సినిమాల్లో చూసి ఉన్న ఫార్ములా కథను ఎంచుకోవడం ఆకట్టుకోదు. కథనంలో కొంత మేర ఆ మైనస్‌ను కవర్ చేసే ప్రయత్నం చేసినా 140 నిమిషాలకు పైనే నడిచే సినిమాలో ఆ ప్రయత్నం కొంత మేర వృథా అయింది. సినిమాలో అనవసరంగా వచ్చే రిపీటెడ్ సన్నివేశాలు, సినిమా పేస్‌ను దెబ్బతీయడానికే అన్నట్టు వచ్చే కొన్ని పాటలు మైనస్ అనే చెప్పాలి.

సినిమా కథ మొదలైన కొద్దిసేపటికే క్లైమాక్స్‌ను ఊహించే విధంగా రూపొందిన సన్నివేశాలను చూస్తూ పోవడమే తప్ప థ్రిల్ ఫీలవ్వలేం. ఇక ఈ సినిమా చూస్తున్నపుడు గతంలో రూపొందిన క్రైమ్ కామెడీ సినిమాలు, లవ్ ట్రాక్‌లు, ఫార్ములా కామెడీ సన్నివేశాలు గుర్తొస్తే అది మన తప్పు కాదు. అక్కడక్కడా విలన్ పాత్ర ఓ అర్థం పర్థం లేని పదార్థంగా తయారైనట్లు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే రిపీటెడ్ చేజింగ్ సన్నివేశాలు సినిమా స్పీడ్‌ను తగ్గించడమే కాక, సినిమా ట్రావెల్‌లో అడ్డుకట్టలుగా మిగిలిపోయాయ్.

సాంకేతిక విభాగం :

ముందుగా సినిమాటోగ్రాఫర్‌ దేవ్ పనితనం గురించి చెప్పాలి. ఓ చిన్న సినిమా చూస్తున్నామనే అభిప్రాయం సినిమా చూస్తున్నపుడు కలగకుండా లో బడ్జెట్‌లోనే మంచి లైటింగ్‌తో తీశారు. క్రైం కామెడీ సినిమాకు అవసరమైన మూడ్‌ను క్యాప్చర్ చేయడంలో సినిమాటోగ్రాఫర్‌ సక్సెస్ అయ్యాడు.

ఇక దర్శకుడు శివ గణేష్ గురించి చెప్పుకుంటే.. కథ, కథనాల్లో పెద్దగా కొత్తదనమేమీ లేదు. దర్శకత్వం విషయంలో మాత్రం అక్కడక్కడా దర్శకుడి పనితనాన్ని గమనించొచ్చు. ఓ క్రైమ్ కామెడీ సినిమాను తెరకెక్కించే క్రమంలో సినిమాను అందరికీ కనెక్ట్ చేయాలన్న ఆత్రుతతో చేసిన సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ కొంత మేర ఫర్వాలేదనిపిస్తుంది. జే.బీ అందించిన సంగీతం ఫర్వాలేదనిపించేలా ఉంది. టైటిల్ సాంగ్ వినడానికి బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. సినిమాటోగ్రాఫర్‌ దేవ్ పనితనం బాగుంది. ఓ చిన్న సినిమా చూస్తున్నామనే అభిప్రాయం సినిమా చూస్తున్నపుడు కలగకుండా లో బడ్జెట్‌లోనే మంచి లైటింగ్‌తో తీశారు. క్రైం కామెడీ సినిమాకు అవసరమైన మూడ్‌ను క్యాప్చర్ చేయడంలో సినిమాటోగ్రాఫర్‌ సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ కొన్ని సన్నివేశాల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. జోష్ రవి కామెడీ, క్రైమ్ కామెడీ సినిమాకు మాత్రమే పరిమితమయ్యే కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు సినిమాకు కలిసివచ్చే అంశాలు. ఊహించదగ్గ కథనం, లెంగ్తీ రన్‌టైమ్ సినిమాకు మైనస్ పాయింట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. కథలో కొత్తదనం లేకపోయినా నవ్వించే కొన్ని సన్నివేశాలు, ఊహించదగ్గదే అయినా విసుగు తెప్పించని కథనం కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఇక రొటీన్ కామెడీ కథలను కోరుకునే వారికి మరికాస్త ఎక్కువే నచ్చే సినిమా.. ‘కాయ్ రాజా కాయ్’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు