సమీక్ష : కాకి – టైమ్‌పాస్ హర్రర్ థ్రిల్లర్..!

సమీక్ష : కాకి – టైమ్‌పాస్ హర్రర్ థ్రిల్లర్..!

Published on Dec 12, 2015 8:01 PM IST
Kaki-review

విడుదల తేదీ : 12 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : మనోన్.ఎం.

నిర్మాత : కిరణ్ పత్తికొండ

సంగీతం : అమ్రిత్

నటీనటులు : అశోక్ కుమార్, కిరణ్ పత్తికొండ, మేఘా శ్రీ, బేబీ యువీనా


అర్పిత క్రియేషన్స్ పతాకంపై కిరణ్ పత్తికొండ నిర్మాణంలో రూపొందిన హర్రర్ సినిమా ‘కాకి’. అశోక్ కుమార్, కిరణ్ పత్తికొండ, మేఘా శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మనోన్.యం. దర్శకత్వం వహించారు. హర్రర్ డ్రామాకు థ్రిల్లర్ అంశాలను జోడించి తెరకెక్కిందన్న ప్రచారం పొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హర్రర్ జానర్ ట్రెండ్ నడుస్తోన్న సమయంలో వచ్చిన ఈ సినిమా ట్రెండ్‌ను అందుకునేంత సినిమాగా నిలిచిందా? చూద్దాం..

కథ :

అమెరికాలో సెటిలైన కార్తీక్ (అశోక్), దీప్తి (మేఘాశ్రీ) అనే జంట వైజాగ్‌లోని తమ ఫ్యాక్టరీలో కొన్ని ముఖ్యమైన పనులను చక్కదిద్దేందుకు తమ మిత్రుడు కిరణ్ (కిరణ్)తో కలిసి వైజాగ్‌కి రావడంతో అసలు కథ మొదలవుతుంది. వైజాగ్‌లోని తమ సొంత బంగ్లానే నివాసంగా చేసుకొని ఉండే ఈ ముగ్గురికీ అక్కడి పరిస్థితులన్నీ విచిత్రంగా తోస్తుంటాయి. ఇక ఫ్యాక్టరీ పనులతో పూర్తిగా బంగ్లాకు రాకుండా కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత మేఘాశ్రీ విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటూ ఉంటుంది.

అదే బంగ్లాలో ఉండే వాచ్‌మెన్ కూతురు అమ్ములోకి (బేబీ యువీనా) ఓ ఆత్మ జొరబడడంతో ఆ పాప విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఏంటి? అమ్ములోకి జొరబడిన ఆత్మ ఎవరు? ఆమెకు కార్తీక్, దీప్తిల జంటకు ఉన్న సంబంధం ఏంటి? చివరి ఈ పరిస్థితులన్నింటి నుంచీ వీరంతా ఎలా బయటపడ్డారు అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రడక్షన్ సీన్‌తోనే చిన్న సస్పెన్స్‌ను సినిమాకు జతచేసి భయపెట్టిన విధానం బాగుంది. ఆ తర్వాత అదే సస్పెన్స్‌ను ఇంటర్వెల్ వరకూ సందర్భానుసారమైన కామెడీ, కొన్ని భయపెట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో బాగానే డిజైన్ చేశారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమా పరంగా హైలైట్. ఆ తర్వాత సినిమా మొత్తం సీరియస్ మోడ్‌లో వెళ్ళిపోతూ అసలు కథను ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ దగ్గరే రివీల్ చేస్తుంది. సెకండాఫ్ ఎలా ఉన్నా చివర్లో ప్రీ క్లైమాక్స్ పార్ట్ మాత్రం బాగుంది. కథలో భాగంగా వచ్చే చిత్రం అనే పాత్రకు చమ్మక్ చంద్ర డబ్బింగ్ తోడై ఆ పాత్ర మంచి కామెడీ పండించింది.

నటీనటుల పరంగానే కాక సినిమాకే మేజర్ హైలైట్ అంటూ ఒకటి చెప్పుకోవాల్సి వస్తే అది బేబీ యువీనా నటన అని చెప్పుకోవచ్చు. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఆ పాప తన నటనతో కట్టిపడేసింది. ఇక అశోక్, కిరణ్, మేఘాశ్రీ అందరూ తమ పరిధిమేర బాగా నటించారు. ఫస్టాఫ్‌లో కార్తీక్ పాత్ర పూర్తిగా కథ నుంచి వెళ్ళిపోయాక కిరణ్ పాత్రలో నటించిన కిరణ్ పత్తికొండ బాగా మెప్పించాడు. అతడి కామెడీ టైమింగ్ బాగుంది. కిరణ్ – యోగిబాబుల కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. నాజర్, జయసుధ ఇద్దరూ కథను మలుపుతిప్పే అతిథి పాత్రలతో మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్ అంటే పెద్దగా కొత్తదనం లేని కథ అని చెప్పుకోవచ్చు. ఒక బంగ్లాలో దయ్యం ఉండడం, అక్కడికి ప్రధాన పాత్రలు రావడం, వారిని దయ్యం వెంటాడడం, దయ్యానికి ఓ ఫ్లాష్‌బ్యాక్.. ఇది సాధారణంగానే అన్ని హర్రర్ సినిమాల్లోనూ చూసే ఫార్మాట్. ఈ సినిమాలోనూ అదే ఫార్మాట్‌ను ఫాలో అయిపోయారు. సినిమా పరంగా చూస్తే ఒక మంచి ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమా వేగాన్ని తగ్గించాయి.

ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కొంచెం లెంగ్త్ ఎక్కువైంది. కథ అవసరాన్ని బట్టి ఈ పార్ట్‌ను కొంత తగ్గించి ఉన్నా పర్లేదు కదా అనిపిస్తుంది. ఇక సినిమాలో చాలాచోట్ల లాజిక్ అన్న మాటను పట్టించుకోలేదు. ముఖ్యంగా దయ్యం ఒక శరీరాన్ని ఆవహించిన తర్వాత ఆ శరీరానికి ఎంత ప్రమాదం జరిగినా అతి సాధారణంగానే ఉండడం, హర్రర్ సినిమా లాజిక్‌కు కూడా అందని ప్రశ్న! ఇక ఒకే రకమైన ఫార్మాట్ అలవాటు పడి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ సినిమా మళ్ళీ రొటీన్ అనిపిస్తుంది. ఇక థ్రిల్స్ బాగానే ఉన్నా, ఓవరాల్‌గా ఒక పూర్తి స్థాయి సినిమాటిక్ అనుభూతిని పంచడంలో సినిమా కేవలం ఫర్వాలేదనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల ప్రస్తావనకు వస్తే.. ముందు దర్శకుడు మనోన్.ఎం. గురించి చెప్పుకోవాలి. ఒక సాదాసీదా రొటీన్ కథనే రెండు గంటల హర్రర్ సినిమాగా మలిచే క్రమంలో ఏయే అంశాలు అవసరమో అవన్నీ సరిగ్గా కుదుర్చుకొని దర్శకుడిగా మంచి ప్రతిభనే కనబరిచాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ రూపొందించిన విధానం అతడి ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

సినిమాటోగ్రాఫర్ శరవణన్ నటరాజన్ పనితనం బాగుంది. నో లైట్/లో లైట్‌లో హర్రర్ మూడ్‌ను తెస్తూ, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు మంచి లైటింగ్ ఇచ్చి సినిమాను బాగా నడిపించారు. ఇక సంగీతం విషయంలో అమ్రిత్ ఆకట్టుకుంటాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ప్లస్ పాయింట్. ఎడిటింగ్ పరంగా మరికాస్త జాగ్రత్త పడాల్సింది. డైలాగ్స్ ఆకట్టుకునేలా లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదు.

తీర్పు :

హర్రర్, హర్రర్ కామెడీ, హర్రర్ థ్రిల్లర్, హర్రర్ డ్రామా.. మళ్ళీ వీటిల్లోనే మిక్సింగ్ చేస్తూ వచ్చే సినిమాలు ఇలా హర్రర్ జానర్లో ఈమధ్య కాలంలో చాలా ప్రయోగాలు చూస్తూనే ఉన్నాం. ‘కాకి’ సినిమా జానర్ పరంగా ప్రయోగమే అయినా, కథ, కథనాల విషయంలో కొన్నేళ్ళుగా వస్తోన్న హర్రర్ సినిమా ఫార్మాట్‌నే ఫాలో అయిన టైమ్‌పాస్ సినిమా. చూస్తున్నంత సేపు తెలిసిన కథే అయినా బోర్ కొట్టనివ్వకుండా చేసే సన్నివేశాలు, బేబీ యువీనా కట్టిపడేసే నటన, కొన్ని థ్రిల్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఏ అంచనాలు పెట్టుకోకుండా ఒక రెండు గంటలు హర్రర్ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే ప్రేక్షకులకు ‘కాకి’ మంచి ఆప్షన్. లేదూ, హర్రర్‌లోనూ కొత్తదనం కావాలి అనే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ రొటీన్ అటెంప్ట్‌గా నిలుస్తుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు