సమీక్ష : కంచె – ఎమోషనల్ వరల్డ్ వార్ డ్రామా.!

సమీక్ష : కంచె – ఎమోషనల్ వరల్డ్ వార్ డ్రామా.!

Published on Oct 24, 2015 10:00 AM IST
kanche-review

విడుదల తేదీ : 22 అక్టోబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : క్రిష్

నిర్మాత : వై. రాజీవ్ రెడ్డి – సాయి బాబు

సంగీతం : చిరంతన్ భట్

నటీనటులు : వరుణ్ తేజ్, ప్రాగ్య జైస్వాల్, నికేతన్ దీర్, అవసరాల శ్రీనివాస్..


గమ్యం, వేదం, కృష్ణం వందేజగద్గురుమ్ లాంటి డిఫరెంట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రిష్ దర్శకత్వంలో వచ్చిన మరో సరికొత్త మూవీ ‘కంచె’. తెలుగు తెరపై ఇదివరకూ మునుపెన్నడూ రాని, చూడని వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమానే ఈ కంచె. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా, ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా, బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 1930 నాటి ప్రేమకథకి వరల్డ్ వార్ II ని ఎంతవరకూ మిక్స్ చేసి, ఎంత ఎంగేజింగ్ గా ఈ సినిమాని చెప్పాడు అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :
‘కంచె’ సినిమా రెండు టైం జోన్స్ లో నడుస్తుంది.. ఒకటి 1936.. మరొకటి 1944.. ఇక అసలు కథలోకి వెళితే.. 1936లో.. ఒకే ఊరికి చెందిన ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ్) – రాచకొండ సీతాదేవి(ప్రాగి జైశ్వాల్)లు మద్రాసు యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటారు. కానీ సీతాదేవి రాచకొండ జమిందారి వంశంలో జన్మించిన ప్రిన్సెస్.. హరిబాబు మంగలి ఫ్యామిలీలో పుట్టిన కుర్రాడు. యూనివర్సిటీలో పరిచయం అయిన వీరిద్దరూ ప్రేమికులుగా మారతారు. కానీ వీరి ప్రేమని రాచకొండ సంస్థానం అధినేత, సీతాదేవి అన్న అయిన ఈశ్వర్ ప్రసాద్(నికేతన్ ధీర్) అంగీకరించడు. దాంతో ఆ ఊర్లో కులాల మధ్య చిచ్చు మొదలవుతుంది. ఆ చిచ్చుని హరిబాబు ఎలా చల్లార్చాడు.? తన ప్రేమని దక్కించుకున్నాడా లేదా అన్నది మొదటి పార్ట్..

ఇక 1944 కథకి వస్తే.. రాయల్ ఇండియన్ ఆర్మీ కల్నల్ ఈశ్వర్ ప్రసాద్ మరియు మేజర్ ధూపాటి హరిబాబులు వరల్డ్ వార్ లో ఇటలీ తరపున జర్మనీతో పోరాడటానికి యుద్ధంలోకి దిగుతారు. ఒక్కసారిగా జర్మనీ దళాలు వీరి స్థావరం మీద దాడి చేసి అందరు సైనికులను చంపి ఆ ఆర్మీ చీఫ్ కెప్టెన్ మరియు కల్నల్ ఈశ్వర్ ప్రసాద్ లను బందిస్తారు. జర్మన్ అటాక్ నుంచి వరుణ్ తేజ్, అతనితో పాటు మరో నలుగురు తప్పించుకుంటారు. ఆ ఐదు మంది కలిసి వెళ్లి తమ కెప్టెన్ మరియు కల్నల్ ని ఎలా కాపాడారు.? వారిని కాపాడే క్రమంలో హరిబాబు వ్యూహం ఏమిటి.? అలాగే ఈ జర్నీలో ఆ టీం ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.? చివరికి ఆ యుద్ద భూమి నుంచి ఎవరెవరు భయటపడ్డారు.? అన్నది మీరు వెండితెరపైనే చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

కమర్షియల్ అనే కంచెని చెరిపేస్తూ కంచె లాంటి ఓ సరికొత్త సినిమాని తెలుగు తెరపై చూపించడానికి సాహసం చేసిన డైరెక్టర్ క్రిష్ కి మొదట మా హ్యాట్సాఫ్.. ఇక కంచె సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. వరల్డ్ వార్ II గురించి చెబుతూ సినిమాని స్టార్ట్ చేసిన విధానం మొదట ఆడియన్స్ ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత వచ్చే వరల్డ్ వార్ II ఎపిసోడ్ సీన్ చూస్తున్న ఆడియన్స్ కి ఒక్కసారి హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్నాం అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. ఆ తర్వాత వచ్చే లవ్ ట్రాక్ చాలా మంచి ఫీల్ ని ఇవ్వడమే కాకుండా మీ పెదవులపై ఓ చిరునవ్వుని క్యారీ అయ్యేలా చేస్తుంది. లవ్ స్టొరీ తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ ఒక 10 నిమిషాలు సూపర్బ్. ఇక్కడ తెలుగు ఆడియన్స్ కి తెల్లోడికి చూపించరా తెలుగోడి సత్తా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే వార్ సీన్స్ వీరు తప్పించుకుంటారా లేదా అన్న చిన్న ఆసక్తిని క్రియేట్ చేస్తాయి.

ఇక ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. నటీనటుల నుంచి పర్ఫెక్ట్ ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకోవడంలో క్రిష్ దిట్ట.. వరుణ్ తేజ్ నటన, అతని హావ భావాలు సింప్లీ సూపర్బ్.. కొన్ని కొన్ని సీన్స్ లో అతను ఇచ్చిన మెచ్యూర్ హావ భావాలు వరుణ్ కి అందరి నుంచి ప్రశంశలు కురిపిస్తాయి.. రెండవ సినిమాకే వరుణ్ తేజ్ కి ఇలాంటి ఓ వైవిధ్యమైన పాత్రని చేసే అవకాశం రావడం లక్ అని చెప్పాలి. ధూపాటి హరిబాబుగా వరుణ్ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. అలాగే తన వాయిస్ లో, డైలాగ్ డెలివరీలో చాలా మెచ్యూరిటీ చూపించాడు. ప్రాగ్య జైశ్వాల్ రియల్ ప్రిన్సెస్ అంటే ఇలానే ఉంటుందేమో అనేలా ఉంది. యువత మాత్రం ఈ ప్రిన్సెస్ మాయలో పడిపోతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాగే తన పెర్ఫార్మన్స్, క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. నికేతన్ దీర్ కూడా తన పాత్రలో నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు. అవసరాల శ్రీనివాస్ ఒక భయస్తుడైన సైనికుడుగా ప్రేక్షకులను బాగా నవ్విస్తాడు. తన చుట్టూ జరుగుతున్న సందర్భాలను వివరిస్తూనే కామెడీని పండించడం చాలా బాగుంది. గొల్లపూడి మారుతీ రావు, సింగీతం శ్రీనివాసరావు లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఇక విజువల్స్ పరంగా కంచె మీకో డిఫరెంట్ ఫీల్ ని కలుగజేస్తుంది. అలాగే ఈ సినిమా కోసం ప్రతి చిన్న విషయాన్ని చాలా రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేసారు. అది చూసే ఆడియన్స్ కి మనం నిజంగా అక్కడే ఉన్నాం అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

కంచె సినిమాకి మైనస్ పాయింట్స్ అంటే ముందుగా నేరేషన్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచీ యావరేజ్ స్పీడ్ లో వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడా ఆ యావరేజ్ స్పీడ్ కూడా తగ్గుతూ మళ్ళీ యదా స్థానానికి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యావరేజ్ స్పీడ్ కూడా తగ్గుతుందో అప్పుడు సినిమా బోరింగ్ గా మారుతుంది. మొదటి అర్ధభాగంలో మొదటి 30 నిమిషాల తర్వాత ఓ 20 నిమిషాలు కథ స్లోగా సాగుతుంది. అలాగే సెకండాఫ్ స్టార్టింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అప్పటికే స్లోగా ఉంది అనుకుంటుంటే అప్పుడు ఓ రొమాంటిక్ డ్యూయెట్ వచ్చి సినిమాని మరింత స్లో చేసేస్తుంది. ఆ పాటని తీసేస్తే సెకండాఫ్ ఇంకాస్త బెటర్ ఫీల్ ఉంటుంది.

ఇక కథనం పరంగా అటు, ఇటు అని సింక్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగుంది కానీ కథలో కొన్ని మిస్టేక్స్ చేసాడు. అదేమిటంటే ఇంటర్వల్ కే కథని ఎలా ముగించే అవకాశం ఉంది అనే క్లూని ఆడియన్స్ కి ఇచ్చేయడం.. దానికి తోడూ సెకండాఫ్ మొదటి నుంచి అదే విషయాన్ని రివీల్ చేస్తూ పోవడం అనేది ఆడియన్స్ కి కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది. ఆ విషయంలో స్క్రీన్ ప్లే తో ఇంకాస్త మేజిక్ చేసి ఉంటే బాగుండేది. అలాగే క్రిష్ ఈ సినిమాలో కూడా చేసిన తప్పు వార్ సీన్స్ లో హీరోలోని ఇంటెన్స్ ని పీక్స్ లో చూపకపోవడం.. దీనివలన ఓ రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాల్సిన సీన్స్ కాస్త తక్కువ రేంజ్ లో కనెక్ట్ అవుతాయి. ఇందులో కమర్షియల్ అంశాలు ఉన్నాయి అలా అని మన తెలుగులో వస్తున్న రెగ్యులర్ కమర్షియల్ తెలుగు ఫార్మాట్ సినిమా కాదు కావున రెగ్యులర్ కామెడీ కామెడీ అని కోరుకునేవారిని మెప్పించే కామెడీ ఇందులో లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో కంచెకి దాదాపు అన్ని విభాగాలు వెన్ను దన్నుగా నిలిచాయనే చెప్పాలి.. ముందుగా 1936-44 ఫీల్ వచ్చేలా ఆర్ట్ డైరెక్టర్ సాహి డిజైన్ చేసిన సెట్స్ సింప్లీ సూపర్బ్.. సినిమా చూస్తున్నప్పుడు ఆ సెట్స్ మనల్ని 1936 టైంకి తీసుకెళ్తాయి. ఆ సెట్స్ ని, అలాగే ప్రతి విజువల్ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ చాలా బాగా షూట్ చేసాడు. ప్రతి విజువల్ ని చాలా కలర్ ఫుల్ గా చూపించాడు. ముఖ్యంగా వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్స్ ని షూట్ చేసిన విధానం హాలీవుడ్ సినిమా ఫీల్ ని తెస్తుంది. ఈ విజువల్స్ కి చిరంతన్ భట్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చాలా ఎమోషనల్,సీరియస్ సీన్స్ లో అతని మ్యూజిక్ చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. సూరజ్ – రామకృష్ణ కలిసి చేసిన ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఇంకాస్త స్పీడ్ గా ఉండాల్సింది. అనవసరపు సీన్స్ మరియు సెకండాఫ్ లో వచ్చే పాటని కట్ చేసి ఉండాల్సింది. వెంకట్ అండ్ డేవిడ్ కలిసి కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఇక సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ వావ్ అనేలా ఉండడమే కాకుండా మనల్ని ఆలోచించేలా చేస్తాయి.

ఇక ఈ సినిమాకి కెప్టెన్ గా నిలిచిన క్రిష్ గురించి చెప్పాలంటే క్రిష్ రాసుకున్న కథ అందుకోసం ఎంచుకున్న నేపధ్యం బాగుంది. కథ మొదట్లో ఉన్నంత గ్రిప్పింగ్ కథ చివర్లో లేకపోవడం ఆయన చేసిన మిస్టేక్.. ఎందుకంటే చివర్లో వచ్చే ఫీల్ తోనే ఆడియన్స్ బయటకి వస్తారు. కావున క్లైమాక్స్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. ఇకపోతే కథనంలో కొన్ని ఎలిమెంట్స్ ని సూపర్బ్ గా కనెక్ట్ చేసినా, అక్కడక్కడా కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. ఇక డైరెక్టర్ గా అందరి నుంచి అల్టిమేట్ పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. అలాగే అనుకున్న బ్లాక్స్ ని చాలా బాగా తీసాడు కూడాన. డైరెక్టర్ గా ఆయనెక్కడన్నా తగ్గాడు అంటే అది కేవలం కొన్ని సీన్స్ లో ఇంటెన్స్ ని హై రేంజ్ లో చూపించకపోవడమే.. ఓవరాల్ గా క్రిష్ ఇలాంటి ప్రాజెక్ట్ ని అటెంప్ట్ చేసినందుకు మా తరపున సాల్యూట్ తు క్రిష్. మినిమమ్ బడ్జెట్ అయినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ ని చాలా బాగా చూపించారు. ఇక రాజీవ్ రెడ్డి – సాయి బాబుల నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ నుంచి వచ్చిన ‘కంచె’ సినిమా తెలుగు ప్రేక్షకులను మరింత గర్వంగా ఫీలయ్యేలా చేసే సినిమాగా నిలిచిపోతుంది. తెలుగు ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని వరల్డ్ వార్ II ని తెరపై ఆవిష్కరించిన విధానం సింప్లీ సూపర్బ్. రొటీన్ సినిమాల నుంచి విభిన్న తరహా కోరుకునే ప్రేక్షకులను అమితంగా మెప్పించే సినిమా ‘కంచె’. ఈ సినిమాలో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రేమకథ, ఎమోషన్స్ తో పాటు సూపర్బ్ వార్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో మిస్ అయ్యింది అంటే నేరేషన్ కాస్త స్లోగా ఉండడంతో పాటు కొన్ని సీన్స్ లో ఉండాల్సిన ఇంటెన్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్. ఇకపోతే ఈ సినిమాలో రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే కామెడీ ఉండదు. అలాగే ఈ సినిమా మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్ ఆడియన్స్ కి బాగా నచ్చేస్తుంది, కానీ బి,సి సెంటర్ ఆడియన్స్ కి అంట పెద్దగా నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా కంచె సినిమా టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచే సినిమా, ప్రతి ఒక్కరికీ పర్సనల్ గా బాగా నచ్చే సినిమా, అలాగే ప్రతి ఒక్కరూ ఈ దసరాకి ఒకసారి చూడదగిన సినిమా. చివరిగా ‘కంచె’ సినిమా ద్వారా క్రిష్ సినిమా ద్వారా చెప్పాలనుకున్న మాట ‘మనుషులు కలిసి బతకాలి రా.. కంచెలు వేసుకొని కాదు’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు