సమీక్ష: కృష్ణార్జున యుద్ధం – కృష్ణ పాత్ర మనసుల్ని గెలిచింది

సమీక్ష: కృష్ణార్జున యుద్ధం – కృష్ణ పాత్ర మనసుల్ని గెలిచింది

Published on Apr 13, 2018 11:00 PM IST
Krishnarjuna Yuddham movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 12, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్

దర్శకత్వం : మేర్లపాక గాంధీ

నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది

సంగీతం : హిపాప్ తమిజా

సినిమాటోగ్రఫర్ : కార్తీక్ ఘట్టమనేని

ఎడిటర్ : సత్య.జి

స్క్రీన్ ప్లే : మేర్లపాక గాంధీ

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి మంచి అంచనాల నడుమ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

చిత్తూరు జిల్లాలోని అక్కుర్తి అనే గ్రామంలో ఉండే కల్మషం లేని కుర్రాడు కృష్ణ (నాని) అదే ఊరికి సెలవులకి వచ్చిన రియా (రుక్సార్ మీర్)ను ప్రేమిస్తాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ప్రేమకు ఒప్పుకోకుండా రియాను హైదరాబాద్ పంపేస్తారు. అదే సమయంలో యూరప్లో ఉండే రాక్ స్టార్ అర్జున్ (నాని) సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్)ను చూసి ప్రేమిస్తాడు.

కానీ ఎప్పుడూ అమ్మాయిల వెంట తిరుగే అర్జున్ పట్ల సదాభిప్రాయం లేని సుబ్బలక్ష్మి అతన్ని ప్రేమించకుండా హైదరాబాద్ వచ్చేస్తుంది. అలా హైదరాబాద్ వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఇళ్లకు చేరకుండా మాయమైపోతారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఏమయ్యారు, వాళ్లకు ఏర్పడిన ప్రమాదం ఏమిటి, ఆ ప్రమాదం నుండి వారిని కృష్ణ, అర్జున్ లు ఎలా కాపాడారు అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ కథలోని కృష్ణ పాత్ర, అందులో నాని నటించిన తీరు. దర్శకుడు గాంధీ క్రియేట్ చేసిన ఆ పాత్రలో సాహసం, నిజాయితీ, ప్రేమ, హాస్యం వంటి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతేగాక ఆ పాత్రలో నాని నటించిన విధానం చూస్తే ఆ పాత్ర తన కోసమే పుట్టిందన్నట్టు నటించాడు. చిత్తూరు యాస మాట్లాడుతూ, పంచె కట్టులో కనిపిస్తూ, మంచి కామెడీ టైమింగ్ తో ఆయన కనబర్చిన పెర్ఫార్మెన్స్ ఆద్యంతం ఆకట్టుకుంది.

కృష్ణ పాత్రను కథలో, కథనంలో ఎక్కువ భాగం ఉపయోగించుకుని సినిమాను ముందుకు నడిపే ప్రయత్నం చేసిన దర్శకుడు గాంధీ ఫస్టాఫ్ మొత్తాన్ని కాసేపు కృష్ణ, ఇంకాసేపు అర్జున్ పాత్రల మీద, వాళ్ళ ప్రేమ కథల మీద నడిపిస్తూ ఆకట్టుకున్నారు. అలాగే ప్రధాన పాత్రల లవ్ ట్రాక్స్ కూడ బాగానే ఉన్నాయి.

ఇక ఇంటర్వెల్ సమయానికి హీరోయిన్లను మాయం చేసి హీరోలను కష్టల్లోకి నెట్టి మంచి ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు సెకండాఫ్లో కూడ కొంత కామెడీని, ఎమోషన్ పండించగలిగాడు. ఇక నటుడు బ్రహ్మాజీ తన హాస్యంతో ఫస్టాఫ్లో పలు చోట్ల నవ్వించగా అందమైన పాటలు ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ప్రధమార్థం మొత్తం కొంచెం కొత్తదైన కథనం, హాస్యం, నాని నటనతో సరదాగా సాగిపోగా సెకండాఫ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా రొటీన్ ట్రాక్లోకి మారిపోయి నిరుత్సాహానికి గురిచేస్తుంది. హీరోయిన్లు మాయమైపోవడం వెనకున్న కారణం కూడ రొటీన్ గా, చాలా సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. ఇక ఇద్దరు నానిలు కలిసి తమ తమ హీరోయిన్లను వెతికే ప్రయత్నాల్లో కూడ తీవ్రత కనిపించదు. అంతేగాక కృష్ణ పాత్రను రాసినంత బలంగా అర్జున్ పాత్రను రాయలేదు దర్శకుడు. సెకండాఫ్ కథనంలో చాలా చోట్ల కృష్ణ పాత్ర లీడ్ తీసుకుంటుంటే అర్జున్ పాత్ర మాత్రం కేవలం సపోర్టివ్ పాత్రగానే మిగిలిపోయింది.

హీరోలకు ఎదురయ్యే కష్టాలు, వాళ్లకు అడ్డుపడే మనుషులు చాలా బలహీనంగా ఉంటారు. దాంతో కథనంలో పట్టు లోపించి చాలా సన్నివేశాలు పేలవంగా అనిపించాయి. సినిమాను ముగించడానికి దర్శకుడు తీసుకున్న సమయం కూడ ఎక్కువగానే ఉంది. అనవసరమైన సన్నివేశాలు, సంభాషణలు చాలానే దొర్లాయి ద్వితీయార్థంలో. బలమైన ప్రతినాయకుడు లేకపోవడంతో హీరో మీద పెట్టిన హెవీ యాక్షన్ సీన్స్ సరిగా పండలేదు. ఇక క్లైమాక్స్ కూడ ఏమంత ప్రభావంతంగా లేక రొటీన్ గా, కొద్దిగా భారంగానే ముగిసింది.

సాంకేతిక విభాగం :

కృష్ణ లాంటి మంచి పాత్రల్ని సృష్టించిన దర్శకుడు మేర్లపాక గాంధీ రెండు సమాంతర ప్రేమ కథల్ని హాస్యంతో మిక్స్ చేసి నాని నటనను బేస్ చేసుకుని ఫస్టాఫ్ ను సరదగా నడపి ఆకట్టుకున్నారు కానీ ద్వితీయార్థాన్ని మాత్రం రొటీన్, కొన్ని బలహీనమైన అంశాలతో, కథనంతో నింపేసి కొంత నిరుత్సాహాపరిచారు. పాత్రలకు ఆయన రాసిన డైలాగ్స్ చాలా వరకు ఆకట్టుకున్నాయి.

కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కుర్తి గ్రామంలో షూట్ చేసిన ప్రతి సన్నివేశం బాగుంది. సంగీత దర్శకుడు హిపాప్ తమిజా పాటలకు ఆకట్టుకునే సంగీతాన్ని ఇవ్వడమే గాక మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించారు. ఎడిటింగ్ బాగానే ఉంది కానీ సెకండాఫ్ ను కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ ‘కృష్ణార్జున యుద్ధం’లో కృష్ణ పాత్రలో ఆయన కనబర్చిన నటన ఆయన అభిమానుల మనసుల్ని గెలుచుకుంటుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తయారుచేసుకున్న ఫస్టాఫ్ కథనం, పాత్రల ద్వారా ఆయన పండించిన హాస్యం, పాటలు, ముఖ్య తారాగణం నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే అంశాలు కాగా రొటీన్ గా ఉన్న సెకండాఫ్ కథనం, అందులోని బహీనమైన సన్నివేశాలు, ముగింపు కొంత డిసప్పాయింట్ చేస్తాయి. మొత్తం మీద నాని నటనను, మంచి హాస్యాన్ని కోరుకునేవారిని , కొంత రెగ్యులర్ సినిమాల్ని ఎంజాయ్ చేయగలిగినవారిని ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు