సమీక్ష : మాతంగి – మరీ బోర్ కొట్టించేసింది

సమీక్ష : మాతంగి – మరీ బోర్ కొట్టించేసింది

Published on Jan 5, 2018 11:55 PM IST
Mathangi movie review


విడుదల తేదీ : జనవరి 05, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : జయరామ్, రమ్య కృష్ణ, ఓం ఫురి

దర్శకత్వం : కన్నన్ తామరాక్కులం

నిర్మాత : వినయ్ కృష్ణన్

సంగీతం : రితీష్ వేగ

సినిమాటోగ్రఫర్ : జిత్తు దామోదర్

ఎడిటర్ : పవన్ కుమార్

స్టోరీ, స్క్రీన్ ప్లే : దినేష్ పల్లాట్

2016 లో వచ్చిన మలయాళ చిత్రం ‘అడుపులియాట్టం’ చిత్రం తెలుగులో ‘మాతంగి’ పేరుతో ఈరోజే విడుదలైంది. రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలో రూపోందిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ప్రముఖ వ్యాపారస్తుడైన సత్యజిత్ (జయరాం)కు ఉన్నట్టుండి పీడ కలలు మొదలవుతాయి. తన కుటుంబమంతా నాశనం కాబోతోందని సంకేతాలు కూడా అతనికి అందుతాయి. దీంతో అతను పరిష్కారం కోసం మహేశ్వర బాబా (ఓం పురి) ని కలుస్తాడు. మహేశ్వర బాబా సత్యజిత్ గతంలో కొనుగోలుచేసి ఒక పాత కోటలో ఉన్న ఆత్మ మూలంగానే అదంతా జరుగుతోందని చెబుతాడు.

అలాగే దానికి పరిష్కారం కూడా చెబుతాడు. ఆ పరిష్కారం ఏమిటి ? అసలు కోటలో ఉన్న ఆత్మా ఎవరు ? దానికి, సత్యజిత్ కు సంబంధమేమిటి ? చివరికి సత్యజిత్, తాని కుటుంబం ఎలా కాపాడబడ్డారు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు కన్నన్ తామరాక్కులం సినిమాను ప్రారంభించిన విధానం బాగుంది. టైటిల్స్ పడేప్పుడు చూపించే విజువల్స్ హర్రర్ సినిమాను చూడబోతున్నాం అనేలా ప్రేక్షకుడ్ని ప్రిపేర్ చేస్తాయి. ఇక ప్రధాన పాత్ర అయిన జయరాంను ఆత్మ వెంటాడటం వెనకున్న అసలు కథ కొంత బాగానే అనిపించింది.

అలాగే జయరాం, రమ్యకృష్ణల గతం కూడా కొంత సేపు పర్వాలేదనిపించింది. ఇక కథ మొత్తం రివీల్ అయ్యాక ఆత్మ జయరాం కూతుర్ని చంపాలని ప్రయత్నించడం, ఆ ఆత్మ నుండి కూతుర్ని కాపాడుకోవడానికి జయరాం చేసే ప్రయత్నాలు కొంత మెప్పించాయి. ఆత్మగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

2016 లో మలయాళంలో విడుదలైన ఈ సినిమా కథ పరంగా చాలా పాతది. ఒక వ్యక్తి మూలంగా ఇంకొకరు జీవితాన్ని కోల్పోయి ఆత్మలుగా మారి అతనిపై పగబట్టడం, అతన్ని కాపాడటానికి ఒక స్వామీజీ రావాడం, చివరికి అతను అపాయం నుండి బయటపడటం అనే ఈ కథను ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో ఉపయోగించారు. కాబట్టి దర్శకుడు కథనం కొత్తగా, సన్నివేశాలు భయపెట్టే విధంగా ఉండేలా చూసుకొంటే రిజల్ట్ బెటర్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇందులో కథనం కూడా పాతదిగా, బోర్ కొట్టించేదిగానే ఉంది.

కొన్ని చిన్న చిన్న అంశాలను మినహా మిగతా కథనం మొత్తాన్ని సులభంగా ఊహించేయవచ్చు. ఇక సన్నివేశాలైతే ఒకటి కూడా బయపెట్టలేదు సరికదా కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయాయి. క్లైమాక్స్ అయితే మరీ సాగదీసిన ఫీలింగ్ కలిగింది. సినిమాలో రమ్యక్రిష్ణ వయసు తెలిసిపోతుండటంతో సినిమాపై ఆసక్తి ఇంకాస్త సన్నిగిల్లిపోయింది. చిత్రంలోని పరిసరాలు, పాత్రలు తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటం కూడా చిత్రానికి మరొక మైనస్. కొన్ని పాత్రలకు చెప్పిన డబ్బింగ్ కూడా సరిగా కుదరలేదు. సినిమా మొత్తంలో థ్రిల్ ఫీలయ్యే సన్నివేశాలుకానీ, అంశాలు కానీ అక్కడా కనబడలేదు.

సాంకేతిక విభాగం :

రచయిత దినేష్ పల్లాట్ సినిమా కోసం రాసిన కథ పాతదే అయినా కనీసం సన్నివేశాలైన కొత్తగా రాసిని ఉంటే బాగుండేది. కానీ అవి కూడా పాతవిగానే ఉండటంతో ప్రేక్షకుడికి ఎక్కడా ఎంటర్టైన్ అయ్యే అవకాశం దొరకలేదు. చివరికి దర్శకుడు కన్నన్ తామరాక్కులం సినిమాను తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకునేలా లేదు.

జిత్తు దామోదర్ సినిమాటోగ్రఫీ చెప్పుకోదగిన స్థాయిలో ఏం లేదు. రితీష్ వేగ సంగీతం మెప్పించకపోగా కొన్ని చోట్ల చిరాకు పెట్టింది. పవన్ కుమార్ ఎడిటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. సెకండాఫ్ లోని కొన్ని సీన్లని తొలగించి ఉండాల్సింది.

తీర్పు :

2016లో విడుదలైనా ఈ మలయాళం చిటర్ని చాలా ఆలస్యంగా డబ్ చేసి తెలుగులోకి రిలీజ్ చేయడంతో ఏదో పాత సినిమా చూస్తున్న ఫీలింగే కలిగింది. అలాగే కథ, కథనాలు కూడా పాతవిగానే ఉండటం, థ్రిల్ చేసే అంశాలు, సీన్లు లేకపోవడంతో బాగా బోర్ కొట్టిస్తుంది చిత్రం. కథలోని ఒక కీలక మలుపు, సినిమా ఓపెనింగ్ విజువల్స్ మినహా ఈ చిత్రంలో ఎంజాయ్ చేయడానికి పెద్దగా ఏమీ దొరకదు కాబట్టి ఈ చిత్రాన్ని ఈ వారాంతంలో మర్చిపోవడం మంచిది.

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు