సమీక్ష : మయూరి – భయపెట్టే హర్రర్ థ్రిల్లర్..!

సమీక్ష : మయూరి – భయపెట్టే హర్రర్ థ్రిల్లర్..!

Published on Sep 19, 2015 11:32 AM IST
mayuri-review

విడుదల తేదీ : 17 సెప్టెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : అశ్విన్ శరవణన్

నిర్మాత : సి. కళ్యాణ్

సంగీతం : రాన్ ఎథన్ యోహాన్

నటీనటులు : నయనతార, ఆరి

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న నయనతార, సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు లేడీ ఓరియంటడ్ సినిమాలతోనూ మెప్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నయనతార హీరోయిన్‌గా తమిళంలో ‘మాయ’ పేరుతో ఓ హర్రర్ డ్రామా రూపొందింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ చేశారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నేడు తెలుగు, తమిళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలైంది. భారీ హైప్‌తో వచ్చిన ఈ హర్రర్ డ్రామా అనుకున్నంతగా భయపెట్టిందా? చూద్దాం..

కథ :

‘మాయావనం’ అనబడే ఒక భయానక ఫారెస్ట్ ప్రాంతం నేపథ్యంలో నడిచే కథగా మయూరి సినిమాను చెప్పుకోవచ్చు. మాయ పేరుతోగల ఒక మహిళ ఆత్మ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుందనే కారణంతో మాయావనం భయానక ప్రదేశంగా పేరుగాంచుతుంది. ఇదే విషయంపై పలు పరిశోధనలు జరగడమే కాక ‘మాయ’ పేరుతో ఓ సినిమా కూడా రూపొందుతుంది. ఇక ఇదిలా ఒక అడ్వర్టైజింగ్ కంపనీలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసే మయూరి (నయనతార)కి మాయ సినిమా గురించి తెలుస్తుంది. తన భర్త వికాస్ (ఆరి) నుంచి విడాకులు తీసుకొని కూతురితో పాటు ఒంటరి జీవితాన్ని గడిపే మయూరి, ఒకానొక రోజు మాయావనం నేపథ్యంలో రూపొందిన సినిమాను చూస్తుంది.

కాగా ఈ సినిమా చూస్తున్నప్పుడే మయూరికి, ఆ సినిమాకు ఒక సంబంధం ఉందన్న విషయం తెలుస్తుంది. అసలు మయూరి జీవితానికి, ఆ సినిమాకు ఉన్న సంబంధం ఏంటి? సినిమా చూసిన తర్వాత మయూరి జీవితంలో వచ్చే మార్పులేంటి? చివరకు ఈ కథ ఏమైంది? అన్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమే ‘మయూరి’.

ప్లస్ పాయింట్స్ :

మయూరి సినిమాకు మేజర్ హైలైట్ అంటే పేరుకు తగ్గట్టుగానే ఫుల్ లెంగ్త్ హర్రర్ డ్రామాను భయపెట్టేలా, మంచి కాన్సెప్ట్‌తో చెప్పిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో, సెకండాఫ్‌లో భయపెట్టడాన్ని మేజర్ హైలైట్‌గా చేసుకొని వచ్చే కొన్ని సన్నివేశాలు వణుకు పుట్టిస్తాయి. ఇవన్నీ హర్రర్ అంశాలను కోరుకునే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే.. ప్రధాన పాత్రలో నటించిన నయనతార అద్భుతంగా నటించిందనే చెప్పాలి. సినిమా మొత్తాన్నీ నయనతార తన భుజాలపై మోసిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో నయనతార తన స్థాయి నటనను ప్రదర్శించి కట్టిపడేసింది. ఇక మిగిలిన పాత్ర ధారులంతా తమ తమ పరిధిమేర చాలా బాగా నటించారు.

సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్‌లోని మొదటి ఇరవై నిమిషాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్బ్ అనే చెప్పాలి. ఇక సెకండాఫ్‌ కూడా పర్ఫెక్ట్‌గా చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలతో చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు హర్రర్ ఎలిమెంట్స్ అన్నీ సరిగ్గానే కుదిరినా, కథలో కొంత క్లారిటీ మిస్ అయింది. ఇదే సినిమాకు మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. అదే విధంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు కథను కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తాయి. ఇక్కడ కొంత క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. సెకండాఫ్‌లో నయనతార పాత్రకు సరైన ప్రాధాన్యత లేకుండా పోయింది.

సెకండాఫ్‌లో నయనతార చాలా తక్కువ సన్నివేశాల్లో కనిపిస్తుంది. సినిమాకు దీన్ని ఓ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇక మొదటి ఇరవై నిమిషాల తర్వాత కొన్ని అనవసరమైన సన్నివేశాలు వస్తూ సినిమా ఫ్లోను దెబ్బతీశాయి. సెకండాఫ్‌లో అక్కడక్కడా సినిమా వేగం తగ్గినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ను మరీ సాగదీసినట్లు కనిపిస్తుంది. క్లైమాక్స్‌ను ఈ సినిమాకు ఓ ప్రధాన మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శకుడు అశ్విన్ శరవణన్ గురించి చెప్పుకోవాలి. అశ్విన్ ఎంచుకున్న కథలో కొంతమేర క్లారిటీ లోపించినా, ఓ హర్రర్ సినిమాతో అనుకున్న విధంగా భయపెట్టించేందుకు మంచి సన్నివేశాలను అల్లుకున్నారు. దర్శకుడిగానూ చాలా చోట్ల అశ్విన్ మంచి విజయం సాధించాడు.

రాన్ ఎథన్ యోహాన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను సాంకేతికంగా ఓ రేంజ్‌లో నిలబెట్టింది. సినిమా మొత్తంలో మూడ్ క్యారీ చేయడంలో యోహాన్ మంచి విజయం సాధించారు. సత్యమ్ సూర్యన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హర్రర్ మూడ్‌ను క్యాప్చర్ చేయడంలో సత్యం మంచి క్రెడిట్ సొంతం చేసుకున్నారు. టీ.ఎస్.సురేష్ ఎడిటింగ్ ఫర్వాలేదు. అయితే కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి ఉండాల్సింది. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

హర్రర్ సినిమా అనగానే ఆ తరహా సినిమాలను ఇష్టపడే వారు విపరీతమైన ఆసక్తి కనబరుస్తుంటారు. ఆ కారణం వల్లే హర్రర్ జానర్ ఇప్పటికీ ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది. ఇక హర్రర్ పేరుతోనే భయపెట్టేందుకు వచ్చిన మయూరి కూడా పేరుకు తగ్గట్టుగానే భయపెట్టే విషయంలో మంచి విజయం సాధించిందనే చెప్పాలి. నయనతార సూపర్ యాక్టింగ్, కొత్త దర్శకుడు అశ్విన్ థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే వంటివి ఈ సినిమాకు మేజర్ హైలైట్స్. ఇక కథలో సరైన క్లారిటీ లేకపోవడం, సాగదీసునట్లుండే క్లైమాక్స్ వంటివి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. చెప్పాలనుకున్న విషయాన్ని వీలైనంత థ్రిల్లింగ్‌గా, హర్రర్ సినిమా ద్వారా ప్రేక్షకులు ఏయే అంశాలు కోరుకుంటారో అన్నింటినీ సమపాళ్ళలో చూపిన ‘మయూరి’, టార్గెట్ ఆడియన్స్‌కి బాగా నచ్చే సినిమా!

123తెలుగు రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు