రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా పోషించిన ‘రెహమాన్ డెకాయిట్’ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ పవర్‌ఫుల్ పాత్ర కోసం అక్షయ్ ఖన్నా కంటే ముందు ముగ్గురు ప్రముఖ నటులు తిరస్కరించారని కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు.
రెహమాన్ డెకాయిట్ పాత్ర కోసం ఒక సౌత్ ఇండియన్ స్టార్‌తో పాటు, ఇద్దరు బాలీవుడ్ నటులను సంప్రదించగా వారు వింత కారణాలతో నో చెప్పారట. ‘ఇది చాలా మంది నటులున్న సినిమా అని, ఇందులో రణ్‌వీర్ సింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భావించి వారు వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు సినిమా సాధించిన విజయాన్ని చూసి వారు ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు’ అని ముఖేష్ ఛబ్రా పేర్కొన్నారు. కేవలం స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించి ఇంతటి గొప్ప పాత్రను వారు వదులుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
మొదట్లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి వారు కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో కాస్త సందిగ్ధంలో ఉన్నారని.. కానీ ఆర్. మాధవన్ మాత్రం కథ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ముఖేష్ తెలిపారు. మాధవన్ పాత్ర కేవలం 12 నుండి 14 రోజుల షూటింగ్ మాత్రమే అయినప్పటికీ, సినిమాపై ఆ పాత్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన వివరించారు. చివరికి అన్నీ కుదిరి అక్షయ్ ఖన్నా ఆ పాత్రలోకి రావడం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యిందని, ఆయన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.


