సమీక్ష : మిక్షర్ పొట్లం – ఈ పొట్లాన్ని గట్టిగా కట్టలేదు

సమీక్ష : మిక్షర్ పొట్లం – ఈ పొట్లాన్ని గట్టిగా కట్టలేదు

Published on May 19, 2017 6:15 PM IST
Mixture Potlam movie review

విడుదల తేదీ : మే 19, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : వి.సతీష్ కుమార్

నిర్మాత : వీరన్న చౌదరి

సంగీతం : కె.మాధవపెద్ది సురేష్

నటీనటులు : శ్వేతా బసు ప్రసాద్, జయంత్, గీతాంజలి తస్య

వి.సతీష్ కుమార్ దర్శకత్వంలో వీరన్న చౌదరి,లక్ష్మి ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మిక్షర్ పొట్లం’. ఎటువంటి అంచనాలు లేకుండా ఫుల్ కామెడీ మరియు థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. చాలా రోజుల తర్వాత శ్వేతాబసు మెయిన్ రోల్ లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కథ :

సువర్ణ సుందరి (శ్వేతాబసు ) ఒంటరిగా ఉండే అమ్మాయి. తన పేరుతో ఒక ట్రావెల్ బస్సును నడుపుతూ ఉంటుంది. ఈ క్రమంలో అమలాపురం నుంచి షిరిడి కి వేసిన బస్సులో ప్రయాణికులతో పాటు సువర్ణ సుందరి కూడా వెళుతుంది. అయితే బస్సు షిరిడీకి చేరువయ్యే సమయంలో కొంతమంది బస్సులో ఉన్నవారందరిని కిడ్నప్ చేస్తారు. ఇంతకీ ఆ కిడ్నాప్ చేసిన వారు ఎవరు? వారు ఆ బస్సునే ఎందుకు కిడ్నాప్ చేస్తారు ? ఆ కిడ్నాప్ వెనుక ఉన్న ఆంతర్యమేమిటి ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో అంతగా చెప్పుకోదగిన గొప్ప అంశాలేవీ లేకపోయినా కొంత వరకు మెప్పించిన విషయాలు అక్కడక్కడా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో బస్ ట్రావెలింగ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదనిపించాయి. చిత్రంలోని ప్రధాన ప్రేమ జంట మధ్య రొమాన్స్,లవ్ సీన్స్ కొన్ని చోట్ల మెప్పించే ప్రయత్నం చేశాయి.

పోసాని, సుమన్ ల మధ్య జరిగే కొన్ని రాజకీయ పరమైన సన్నివేశాలు కాస్తలో కాస్త బెటర్ అనిపించాయి. అలాగే కిడ్నాప్ అయినప్పుడు కమెడియన్స్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే పండాయి. కథ పాతదే అయినా దర్శకుడు ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చిన ట్విస్ట్ సెకండ్ ఆఫ్ లో ఏం జరగబోతోందో అనే ఆసక్తిని రేకెత్తించడంలో సఫలమైంది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలోని మైనస్ పాయింట్స్ గురించి చెప్పడం మొదలుపెడితే చాలానే దొరుకుతాయి. మొదట కథ విషయానికొస్తే ఫస్ట్ ఆఫ్ లో బస్ ట్రావెలింగ్ బ్యాక్ డ్రాప్లో కామెడీగా నడుస్తుంది. ఆ తరువాత సెకండ్ ఆఫ్ మొత్తం ఫారెస్ట్ లో కిడ్నాప్ చుట్టూ కథ తిరుగుతుంది. మరి ఇలాంటి కథకి మిక్షర్ పొట్లం అనే టైటిల్ ను ఎలా పెట్టారో ఎవ్వరికి అర్ధం కాదు. సెకాండా ఆఫ్ లో చాలా ఎమోషన్ సీన్స్ ను తీసే ప్రయత్నం చేసిన దర్శకుడు ఆ తర్వాత కథను హత్యకు గురైన ఒక అమ్మాయి చుట్టూ నడిపించే ప్రయత్నం చేశాడు. సెకండ్ ఆఫ్ లో బయటపెట్టిన ట్విస్టులో కొత్తదనం ఏమి లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్.

ఇక ప్రతి నాయకుడి పై వచ్చే కొన్ని సన్నివేశాలు అంత ఆసక్తికరంగా ఏమి లేవు. శ్వేతా బసు మెయిన్ రోల్ అని చెప్పి ఆమెను మెయిన్ గా మూడు స్పెషల్ సాంగ్స్ వరకే పరిమితం చెయ్యడం మరో మైనస్. సినిమా చివర్లో నడిపిన స్క్రీన్ ప్లేలో ఏమాత్రం పట్టు లేకపోవడంతో నిరాశపర్చినట్టయింది. ముఖ్యంగా శ్వేతబసుకి ఇచ్చిన వాయిస్ ఓవర్ ఆమె బాడీ లాగ్వేజ్ కి అస్సలు సెట్ కాలేదు. ఇక హీరో,హీరోయిన్స్ పాత్రలు సినిమాకి అంతగా ఏమి ఉపయోగపడలేదు. అసలు దర్శకుడు వారిని సరిగ్గా ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

సినిమాకి ముఖ్యమైన క్లైమాక్స్ విషయానికి వస్తే ఏ సన్నివేశం ఎక్కడికి పోతుందో కొంచెం కూడా అర్ధం కాదు. ఇక సినిమా పాటల విషయానికి వస్తే మొదటి రెండు పాటలు బావున్నా.. ఆ పాటలో వచ్చే లొకేషన్లన్స్ మాత్రం అస్సలు బాగోలేవు. ఆ తర్వాత వచ్చే రెండు పాటలు కూడా అంతంత మాత్రంగా ఉండే కథనానికి అడ్డుతగులుతున్నట్లు అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

సినిమాలో నటీనటులు తమ పాత్రలకు సరైన న్యాయం చేసినా , దర్శకుడు ఎంచుకున్న కథనంలో చాలా చోట్ల కొత్త ధనం లేకపోవడం వల్ల వారిని చూడడానికి కష్టంగా ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు చాలా వరకు నిరాశపరిచాడు. కథలోని ట్విస్ట్ బావున్నా ఆ తరువాత స్క్రీన్ ప్లే లో తన ప్రతిభను ఏ మాత్రం చూపలేకపోయేవాడు. చిత్ర యూనిట్ సభ్యుల్లో సినిమాటో గ్రాఫర్ చాలావరకు కష్టపడ్డాడు అని చెప్పుకోవచ్చు. అడవిలో వచ్చే కొన్ని సీన్లలో కెమెరా పనితనం బాగా కనిపించింది. ఎడిటింగ్ అయితే నామమాత్రంగానే ఉంది. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన మాధవశెట్టి సురేష్ మొదటి రెండు పాటలతో మంచి మార్కులే కొట్టేశాడు. ఇక చిత్ర నిర్మాణ విలువలు ఏదో పర్వాలేదనిపించాయి.

తీర్పు :

సాధారణంగా చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఏదో ఒక పాయింట్ ను పట్టుకొని కథనంలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా చేయాలని జరిపిన ప్రయత్నమే ఈ ‘మిక్షర్ పొట్లం’. అయితే ఈ ప్రయత్నంలో కొత్తదనం అనే ముఖ్యమైన అంశమే మిస్సయింది. ఫస్ట్ ఆఫ్ కాస్త బావుంది అనిపించగానే అనవసరమైన సీన్లు వచ్చి కథలో క్లారిటీ లేకుండా చేస్తాయి. పోసాని ,సుమన్ ల మధ్య వచ్చే సీన్స్ కొంత వరకు మెప్పిస్తాయి. అలాగే ఫస్ట్ ఆఫ్ లో కృష్ణ భగవాన్ , భద్రం , రేలంగి వంటి కమెడియన్స్ సీన్స్ బెటర్ అని చెప్పొచ్చు. ఇక శ్వేతా బసు తన నటన కన్నా డాన్స్ తో పర్వాలేదనిపించింది. మొత్తంగా చెప్పాలంటే శ్వేతా బసు, పోస్టర్, టైటిల్ బావుంది కదా అని సినిమాకు వెళితే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు