విశ్వంభర : ఈ సైలెన్స్ కి కారణం ఏమిటో..?

విశ్వంభర : ఈ సైలెన్స్ కి కారణం ఏమిటో..?

Published on Apr 7, 2026 12:00 AM IST

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చుట్టూ ప్రస్తుతం నెలకొన్న నిశ్శబ్దం మెగా అభిమానులతో పాటు సినీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సినిమాపై మొదట్లో భారీ హైప్ ఉండేది. దీని సోషియో ఫాంటసీ నేపథ్యం చూసి చాలామంది చిరంజీవి క్లాసిక్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’తో పోల్చారు. కానీ, టీజర్ విడుదలైన తర్వాత నాసిరకం వీఎఫ్ఎక్స్ పై వచ్చిన ట్రోలింగ్ ఆ అంచనాలపై నీళ్లు చల్లింది.​ఈ పరిణామాల వల్ల సినిమా విడుదల తేదీలు వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి.

విచిత్రమేమిటంటే, ఈ చిత్రం కంటే ఆలస్యంగా ప్రకటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అప్పటికే విడుదలై ఘనవిజయం సాధించింది. ఇటీవల ఒక సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేస్తామని వెల్లడించారు. అయినప్పటికీ, మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన గానీ, ప్రమోషన్లు గానీ లేకపోవడం ప్రేక్షకుల్లో అనుమానాలను పెంచుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా జూలైలో కూడా రాకపోవచ్చని, మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

​కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రంలో త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ, నిర్మాణ సంస్థ పాటిస్తున్న మౌనం సినిమా ఫలితంపై మరియు క్వాలిటీపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.

తాజా వార్తలు