సమీక్ష : ప్రభంజనం – ఓ గందరగోళం.!

సమీక్ష : ప్రభంజనం – ఓ గందరగోళం.!

Published on Apr 18, 2014 3:07 PM IST
Prabhanjanam-review విడుదల తేదీ : 18 ఏప్రిల్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకత్వం :భాస్కరరావు వేండ్రాతి
నిర్మాత :భాస్కరరావు వేండ్రాతి
సంగీతం:ఆర్.పి పట్నాయక్
నటీనటులు: అజ్మల్, పాంచి బోర, ఆరుషి..

తమిళ డబ్బింగ్ ‘రంగం’, రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమాలో కనిపించిన హన్డ్సం బాయ్ అజ్మల్ హీరోగా నటించిన సినిమా ‘ప్రభంజనం’. పాంచి బోర, ఆరుషి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి భాస్కరరావు దర్శకనిర్మాతగా వ్యవహరించారు. ఆర్.పి పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాని ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పాలనే కాన్సెప్ట్ తో తీసారు. ఇంతకీ ఈ ప్రభంజనం సినిమా ప్రేక్షకులకి ఎలాంటి ఫీలింగ్ కలిగించిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

సమసమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే నాగ్య నాయక్(నాగబాబు), బిజినెస్ మాన్ ఆహుతి ప్రసాద్, ఐఎఎస్ ఆఫీసర్ బెనర్జీ మంచి ఫ్రెండ్స్. వీరి ముగ్గురు పిల్లలైన చైతన్య(అజ్మల్), సంధ్య(ఆరుషి), చందు మరియు ప్రణిత(పాంచి బోర) మంచి ఫ్రెండ్స్. చైతన్యకి లైఫ్ లో ఇది చేయాలని క్లారిటీ ఉండదు. సంధ్య ఐఎఎస్ అవ్వాలని అనుకుంటుంది. చందు ఐఐఎంలో ఎంబిఎ చేయాలనుకుంటాడు. అదే తరుణంలో వీరి క్లాస్ మేట్ అయిన బాలరాజు ఐఐఎంలో సీటు రాలేదని ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో కథ మలుపు తిరుగుతుంది.

తనకి ఎక్కడికి వెళ్ళినా జాబ్ రాదని తెలుసుకున్న చైతన్య రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని సమ సమాజ్ వాద్ పార్టీకి యూత్ లీడర్ అవుతాడు. ఆ తర్వాత అతని లైఫ్ లో జరిగిన కొన్ని విషయాల వల్ల డబ్బు తీసుకొని ఓటేసి మోసపోతున్న ప్రజల్లో ఓటు విలువ ఏంటనేది చాటి చెప్పి, తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకి సేవ చేయాలనుకుంటాడు. అందుకోసం చైతన్య ఏమేమి చేసాడు? చైతన్య ఫఫ్రెండ్స్ అయిన సంధ్య, శ్రావని, చందులు ఎలా సాయపడ్డారు? అధికారంలో ఉన్న ప్రగతి పధం పార్టీని ఎలా ఓడించారు? అన్నది మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అంటే సినిమా కోసం ఎంచుకున్న నటీనటుల టీం అని చెప్పాలి. సీనియర్ నటులైన నాజర్, నాగబాబు, కోట శ్రీనివాసరావు, చలపతి రావుల పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. హీరోగా అజ్మల్ పెర్ఫార్మన్స్ బాగుంది. డైరెక్టర్ అనుకున్న పాత్రకి అతని పర్సనాలిటీ బాగా సరిపోయింది. హీరో ఫ్రెండ్ గా చేసిన ఆరుషి లుక్ మరియు పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. చందు పాత్ర చేసిన యాక్టర్, పాంచి బోరలు పరవాలధనిపించారు. సినిమాకి అనుకున్న స్టొరీ లైన్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

పైన చెప్పినట్టు ‘ప్రభంజనం’ సినిమా కోసం ఎంచుకున్న స్టొరీ లైన్ మరియు నటీనటుల సెలక్షన్ తప్ప మిగతా అంతా మైనస్ చెప్పాలి. డైరెక్టర్ మొదటగా తను అనుకున్న పాయింట్ ని సూటిగా చెప్పకుండా దానికి ఏదేదో జత చేసి చూపించాలని ప్రయత్నించాడు, అందులో భాగంగా తను అనుకున్న పాయింట్ నే మరిచిపోయి మరో కొత్త కథని తెరపైకి తీసుకొచ్చాడు. సినిమాకి స్క్రీన్ ప్లే పెద్ద మైనస్. సినిమాలో ఎలివేట్ చెయ్యాల్సిన సీన్స్ చాలా ఉన్నప్పటికీ వాటన్నిటిని మరచి కమర్షియల్ హంగుల మీద పడడంతో సినిమా ఎక్కడా ఆడియన్ ని కనెక్ట్ అయ్యేలా ఉండదు. మూవీలో నాజర్ పాత్ర చాలా ఆవేశంగా డైలాగ్స్ చెబుతుంది కానీ అందులో 90% సందర్భానికి సంబంధం లేకుండా ఉన్నాయి. అలాగే అజ్మల్ పాత్రకి సెకండాఫ్ లో ఒక్క పవర్ఫుల్ డైలాగ్ కూడా పడలేదు.

సినిమా మొదటి అర్ధ భాగం చూసాక డైరెక్టర్ ఇంతలా ఎందుకు సాగదీశారు అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే సెకండాఫ్ మొత్తం ప్రస్తుతం రాజకీయ పార్టీలు తమ పార్టీ ప్రమోషన్ కోసం చేసుకున్న ప్రకటనలన్నిటినీ కలిపి ఒక్కసారి చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సెకండాఫ్ లో ఓటర్లను ఎడ్యుకేట్ చేయాలని అంటాడు కానీ ప్రజలని ఎలా ఎడ్యుకేట్ చేసాడు అనేది సరిగ్గా చూపించకుండానే హీరో పార్టీ గెలవడం అనే దానిలో అస్సలు లాజిక్ లేదు. అలాగే సినిమాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అలాగే సినిమాలో పాటలు సందర్భాను సారంగా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండడం వల్ల ఆడియన్స్ కి చిరాకేస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో పరవాలేధనిపించినవి రెండే రెండు.. అందులో మొదటిది సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రాఫర్ తకిచ్చిన లోకేషన్స్ ని బాగా చూపించాడు. ఇక రెండవది ఆర్.పి పట్నాయక్ అందించిన పాటలు పెద్దగా లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పరవాలేదనిపించింది. అసలు సినిమాలో కంటెంట్ కి సంబంధం లేకుండా డైలాగ్స్ ఉన్నాయి. ఎడిటర్ కనీస కేరింగ్ కూడా తీసుకోకపోవడం వల్ల సినిమా ఆద్యంతం స్లోగా, బోరింగ్ గా సాగుతుంది.

ఇక సినిమాకి కీలకమైన కథ – స్క్రీన్ ప్లే – మాటలు – నిర్మాత – దర్శకత్వ విభాగాలను ఒంటి చేత్తో భాస్కరరావు వేండ్రాతి డీల్ చేసాడు. కథ కోసం అనుకున్న లైన్ లో మేటర్ ఉన్నప్పటికీ కథ తయారు చేసేటప్పుడు అది మిస్ అయిపొయింది. దాంతో అనుకున్న కంటెంట్ కి కథకి పెద్ద సంబంధం ఉండదు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అనేది రాసుకున్నారా? అని అనిపిస్తుంది ఎందుకంటే సినిమా స్టార్టింగ్ లోనే క్లైమాక్స్ వరకు చెప్పేయగలం కాబట్టి. కథ స్క్రీన్ ప్లే బాలేనప్పుడు నటీనటుల నుంచి ఎంత పెర్ఫార్మన్స్ రాబట్టుకోవాలని ప్రయత్నించినా డైరెక్టర్ ఫెయిల్ అయినట్టే లెక్క, అదే ఇక్కడా జరిగింది. భాస్కరరావుని కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైలాగ్స్ లో మెచ్చుకోకపోయినా నిర్మాణ విలువల విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. రిచ్ ఫీల్ ని చూపించాడు.

తీర్పు :

ఎన్నికల ముందు ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని చేసిన ‘ప్రభంజనం’ సినిమా ప్రజల్లో చైతన్య కలిగిస్తుందో లేదో తెలియదు కానీ థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి మాత్రం డైరెక్టర్ ఏమి చెప్పాలనుకున్నాడా అనే గందరగోళాన్ని మాత్రం క్రియేట్ చేస్తుంది. సినిమాలో మంచి కథ ఉంటే సీనియర్ నటీనటులే నటించాల్సినవసరం లేదు. కానీ డైరెక్టర్ ఈ లాజిక్ ని మరిచి కథని పక్కకి నెట్టి నటీనటులను, ప్రొడక్షన్ వాల్యూస్ పై ఎక్కువ ద్రుష్టి పెట్టి తప్పు చేసాడు. దాంతో సినిమా ఆశించిన స్థాయిలో జనాల్లోకి వెళ్ళలేకపోయింది. అన్నీ చిన్న సినిమాలే బాక్స్ ఆఫీసు వద్ద రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సీనియర్ నటుల ఫోటోలు చూసి ఈ వీకెండ్ థియేటర్ కి ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు