సమీక్ష : నరుడా డోనరుడా – డోనార్ కామెడీ ఓకే..!

సమీక్ష : నరుడా డోనరుడా – డోనార్ కామెడీ ఓకే..!

Published on Nov 4, 2016 5:05 PM IST
Naruda Donaruda review

విడుదల తేదీ : నవంబర్ 4, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : మల్లిక్ రామ్

నిర్మాత : వై. సుప్రియ, జాన్ సుధీర్

సంగీతం : శ్రీచరణ్ పాకల

నటీనటులు : సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ళ భరణి..

2014లో వచ్చిన ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’ అనే సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుమంత్, బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనార్’ అనే సినిమాను నరుడా డోనరుడా అంటూ రీమేక్ చేశారు. ట్రైలర్, పోస్టర్స్‌తో ఎక్కడిలేని క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

విక్కీ (సుమంత్) ఏ పనీ లేకుండా అల్లరిచిల్లరిగా తిరిగే ఓ కుర్రాడు. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన విక్కీని, ఆంజనేయులు (తనికెళ్ళ భరణి) అనే ఓ ఇన్‌ఫెర్టిలిటీ సంబంధిత డాక్టర్ కలిసి వీర్య కణాలను (స్పెర్మ్) దానం చేయమని కోరతాడు. విక్కీకి ఉన్న కుటుంబ నేపథ్యాన్ని బట్టి అతడి వీర్యకణాలు పవర్‌ఫుల్ అని విక్కీని ఈ పనికి ఒప్పిస్తాడు. వీర్యదానాన్నే తన పనిగా మార్చుకొని విక్కీ బాగా సంపాదించడమే కాక, ఆషీమా (పల్లవి సుభాష్) అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తర్వాత తనకు పిల్లలు పుట్టరని తెలిసాక, విక్కీ చేసే పని గురించి ఆషీమాకు తెలుస్తుంది. ఇలాంటి పనిచేసే వాడితో ఎలా ఉండాలంటూ విక్కీతో ఆషిమా విడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విక్కీ ఎంచుకున్న మార్గం అతడికి ఏయే ఇబ్బందులు తెచ్చిపెట్టింది? చివరకు వీరిద్దరి కథ ఎక్కడికి చేరిందీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఒరిజినల్ స్టోరీ చాలా కొత్తది కావడాన్ని ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. వీర్యదానం చేసే ఓ కుర్రాడిని అతడు ప్రేమించే అమ్మాయితో సహా, మిగతా ప్రపంచమంతా ఎలా చూస్తుందన్న కోణంలో కథ చెప్పడం బాగుంది. ఇదే నేపథ్యంలో ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ కూడా కొత్తగా ఉంటూ బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ప్రధాన పాత్రలన్నింటి బ్యాక్‌స్టోరీ బాగుంది. ఎమోషనల్‍గా సాగే క్లైమాక్స్ కూడా సినిమాకు బలాన్నిచ్చేదిగా చెప్పుకోవచ్చు.

తనికెళ్ళ భరణి ఈ సినిమాకు ప్రాణం లాంటివారని చెప్పాలి. ఒక బలమైన పాత్రలో ఆయన తనదైన టైమింగ్ ఉన్న నటనతో, డైలాగ్ డెలివరీతో కట్టిపడేశారు. ముఖ్యంగా సుమంత్‌తో విత్తనం అనేప్పుడల్లా తనికెళ్ళ భరణి టైమింగ్ అదిరిపోయేలా ఉంది. హీరో సుమంత్ తన పరిధిమేర బాగా నటించాడు. నటి శ్రీలక్ష్మి చాలారోజుల తర్వాత ఒక మంచి పాత్రలో తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించారు.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైనింగ్ అంశాలతో సాగే సినిమాను అక్కడివరకూ బాగానే తీసుకొచ్చినా, సెకండాఫ్‌లో మొదలయ్యే అసలైన ఎమోషన్‌ను మాత్రం బాగా చూపలేకపోయారు. హీరో-హీరోయిన్ల మధ్యన సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలన్నీ హడావుడిగా ముగించేసి అసలు ఎమోషన్‌ను అందుకోలేకపోయారు. ఇక హీరోయిన్ పల్లవి సుభాష్ తన పాత్రకు న్యాయం చేయలేకపోవడం కూడా ఓ మైనస్‌గా చెప్పుకోవాలి. సినిమా అంతా అవసరానికి మించి లౌడ్‌గా ఉండడం కూడా కాస్త విసుగు తెప్పించింది.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడి గురించి చెప్పుకుంటే, బాలీవుడ్‌లో అద్భుతమైన విజయం సాధించిన విక్కీ డోనార్ అసలు కథను ఏమాత్రం మార్పులు చేయకుండా మంచి పనే చేసిన మల్లిక్ రామ్, ఆ కథలోని అసలైన ఎమోషన్‌ను మాత్రం పట్టుకోలేకపోయారు. ఫస్టాఫ్ వరకూ సినిమాను బాగానే ఎంటర్‌టైనింగ్‌గా నడిపించిన ఆయన, సెకండాఫ్‌లో మాత్రం ఎమోషన్స్‌ను సరిగ్గా పండించలేక నిరాశపరిచారు. ఒక అద్భుతమైన కథను ఆ స్థాయికి తగ్గ సినిమాగా నిలపడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడనే చెప్పాలి.

పాటల్లో రెండు పాటలు ఫర్వాలేదు. మిగతావన్నీ కథలోనూ అడ్డుకట్టగా రావడం మైనస్‌గా చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఇక డైలాగ్స్ ఈ సినిమాకు ఓ స్థాయి తెచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా తనికెళ్ళ భరణికి రాసిన డైలాగ్స్ అన్నీ అదిరిపోయాయి. ఎడిటింగ్ బాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి వంక పెట్టడానికి లేదు.

తీర్పు :

నరుడా డోనరుడా కమర్షియల్ తెలుగు సినిమా పరంగా చూస్తే చాలా కొత్తదనమున్న సినిమాయే! అయితే ఆ కొత్తదనమున్న కథలోని ఎమోషన్స్‌ను సరిగ్గా పండించలేకపోవడమే ఈ సినిమాలో మైనస్. తనికెళ్ళి భరణి అదిరిపోయే నటన, కామెడీ, సుమంత్ ప్రెజెన్స్, ఎంటర్‌టైనింగ్‌గా సాగే ఫస్టాఫ్‌ లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్‌ బలంగా లేకపోవడం నిరాశపరిచే అంశం. ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్తగా, కాస్త వింతగా, నవ్వించేలానే ఉన్న ఈ డోనారుడు, అనుకున్న పనిలో మాత్రం పూర్తిగా విజయం సాధించేలా లేడు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు