సమీక్ష : ఒక క్రిమినల్ ప్రేమకథ – మెసేజ్ ఓకే, భూతే ఎక్కువైంది.!

సమీక్ష : ఒక క్రిమినల్ ప్రేమకథ – మెసేజ్ ఓకే, భూతే ఎక్కువైంది.!

Published on Jul 18, 2014 6:30 PM IST
Oka-Criminal-Premakatha-Rev విడుదల తేదీ : 18 జూలై 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : పి. సునీల్ కుమార్ రెడ్డి
నిర్మాత : రవీంద్రబాబు
సంగీతం :  ప్రవీణ్ ఇమ్మడి
నటీనటులు : మనోజ్, ప్రియాంక, అనిల్, దివ్య..

‘గంగపుత్రులు’, ‘సొంత ఊరు’ లాంటి సినిమాలతో విమర్శకుల మెప్పుపొంది, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ లాంటి సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న పి. సునీల్ కుమార్ రెడ్డి మరోసారి యువతని టార్గెట్ చేస్తూ చేసిన సినిమా ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. ప్రస్తుతం సమాజంలో మహిళలు బయటకు చెప్పుకోలేని సమస్యలని ఇందులో చూపించారు. మనోజ్, ప్రియాంక, అనిల్, దివ్య నటించిన ఈ సినిమాకి ప్రవీణ్ ఇమ్మడి మ్యూజిక్ అందించాడు. యువతని టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమా కూడా కమర్షియల్ గా విజయాన్ని అందుకుందో? లేదో? ఇప్పుడు చూద్దాం…

కథ :

ఫస్ట్ సీన్ అమ్మాయిపై యాసిడ్ దాడి సీన్.. కట్ చేస్తే ఓ అందమైన పల్లెటూరు. అక్కడ ఓ స్టూడియో అండ్ వీడియో షాప్ లో పనిచేసే శీను(మనోజ్) అదే ఊర్లో ఉండే బిందు(ప్రియాంక పల్లవి)ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి బిందు కూడా శీనుని ప్రేమిస్తుంది. ఇదిలా ఉండగా తన తండ్రి అనారోగ్య కారణం వల్ల బిందు తన కుటుంబంతో కలిసి వైజాగ్ లో ఉన్న వాళ్ళ మామయ్య సత్యానంద్ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో శీనుని తన కోసం వైజాగ్ రమ్మని చెప్పి బిందు వెళ్లి పోతుంది.

ఎలాగోలా శీను వైజాగ్ అంతా తిరిగి బిందు ఉన్న కాలేజ్ కనుక్కొని అదే కాలేజ్ క్యాంటీన్ లో బాయ్ గా చేరుతాడు. కానీ బిందు మాత్రం శీనుని పట్టించుకోదు. మరోవైపు నా అనుకున్న తన మామయ్య నుంచే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఆ ఇబ్బందులు ఏమిటి? ఆ ఇబ్బందుల నుండి బయటపడటానికి బిందు ఏం చేసింది? అసలు ప్రేమించిన శీనుని ఎందుకు దూరం పెట్టింది.? అన్న విషయాలు మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ సినిమాకి అసలైన మేజర్ హైలైట్. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా పూర్తయ్యే సరికి ప్రతి ఒక్కరూ ఈ పాయింట్ కి కనెక్ట్ అవడమే కాకుండా, నిజమే కదా అని ఆలోచనలో కూడా పడతారు. అందుకే ఇప్పటి తరం తల్లి తండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇది. డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని సెకండాఫ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తూ ఆసక్తికరంగా తీసాడు. అలాగే క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది.

నటీనటుల్లో ముందుగా చెప్పాల్సింది ఫిల్మ్ ట్రైనర్ మరియు రైటర్ అయిన సత్యానంద్ నటన గురించి. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర చేసాడు. సత్యానంద్ తన పాత్రకి 100కి 100 శాతం న్యాయం చేసాడు. హీరోగా చేసిన మనోజ్ నటన గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కాస్త బెటర్ అయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ బాగా చేసాడు. మిగిలిన అనిల్, దివ్య, మన్ప్రీత్ లు ఉన్నంతలో బాగా చేసారు. అక్కడక్కాడా వచ్చే కొన్ని అడల్ట్ సీన్స్, లెక్చరర్ పై వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బి,సి సెంటర్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి.

మైనస్ పాయింట్స్ :

సునీల్ కుమార్ రెడ్డి ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ సినిమా చూసిన వారు ఈ సినిమా టైటిల్ చూసాక అలాంటి కంటెంట్, కామెడీని ఆశించే ఈ సినిమాకి వస్తారు. వారుకోరుకున్న కంటెంట్ అయితే ఇవ్వగలిగాడు కానీ ఆ సినిమాలో యూత్ కనెక్ట్ అయ్యేలా పండించిన అడల్ట్ కామెడీని ఇందులో పండించలేకపోయాడు. అలాగే అనుకున్న పాయింట్ కి ఒక సొల్యూషన్ ని చూపించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో మొదటి 20 నిమిషాల తర్వాత సినిమా స్లో అయిపోయి, కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. అంతే కాకుండా అనుకున్న కంటెంట్ మొత్తాన్ని సెకండాఫ్ లోనే చెప్పడం వలన ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ కాస్త బోర్ ఫీలవుతారు.

ఇకపోతే సెకండాఫ్ లో తన మేనకోడలిని మామయ్య వేధించే సీన్స్ లో రియాలిటీ బాగా ఎక్కువైంది. మనకు నచ్చిన స్వీటైనా ఎక్కువ తింటే వెగటుగా ఉంటుంది, అలానే నువ్వు చూపించేది రియలిస్టిక్ అయినా డోస్ మరింత ఎక్కువైతే ఆడియన్స్ ఇబ్బంది పడతారు. అమ్మాయిలని వేధించడం అనేది ఒకటి రెండు సీన్స్ తో ముగించి ఉంటే ఆడియన్స్ అంత ఇబ్బందిగా ఫీలయ్యేవారు కాదు కానీ నాలుగైదు సీన్స్ పెట్టడం వల్ల బాగా ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాగే ఈ సినిమాకి ఇంకాస్త బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చే హీరోయిన్ అయ్యి ఉంటే బాగుండేది. ఎందుకంటే హీరోయిన్ పెర్ఫార్మన్స్ మరియు లుక్ బాలేదు. స్క్రీన్ ప్లే ని ఇంకాస్త టఫ్ గా రాసుకొని ఇంకాస్త లెంగ్త్ తగ్గించుకొని ఉంటే ఆడియన్స్ సినిమా ఇంకాస్త బెటర్ గా కనెక్ట్ అయ్యేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదటగా చెప్పుకోవాల్సింది ఈ మూవీకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ మరియు ఇలాంటి పాయింట్ ని ఆడియన్స్ కి చెప్పాలనుకున్న పి. సునీల్ కుమార్ రెడ్డి గురించి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ని మనం రోజూ పేపర్లో, టీవీల్లో చూస్తూనే ఉంటాం కానీ ఎక్కడో జరిగింది కదా అని పెద్దగా పట్టించుకోం.. కానీ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లోనూ దాదాపు ఇదే జరుగుతోంది. నా అనుకున్నవాల్లే మీ పిల్లల్ని వేధిస్తున్నారు అనే విషయాన్ని బోల్డ్ గా పేరెంట్స్ కి చెప్పడానికి ప్రయత్నం చేసినందుకు సునీల్ కుమార్ రెడ్డిని మెచ్చుకొని తీరాలి. ఇకపోతే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది, అలాగే ఒక డైరెక్టర్ గా వేధింపులపై రెండు సీన్స్ చూపిస్తే సరిపోయేది కానీ కమర్షియాలిటీ కోసం మరింత ఎక్కువగా చూపించేశారు. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కి రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి.

ఇక సబు జేమ్స్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ ఇమ్మడి పాటలు పెద్దగా హెల్ప్ కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి కాస్త హెల్ప్ అయ్యింది. ఎడిటర్ సినిమా రన్ టైంని తక్కువ చూసుకోవడానికి బాగానే ప్రయత్నించాడు. కానీ ఇంకాస్త గట్టిగా డైరెక్టర్ తో పోట్లాడి ఫస్ట్ హాఫ్ ని తగ్గించడం చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు :

‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’తో యువతని టార్గెట్ చేసిన పి. సునీల్ కుమార్ రెడ్డి ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ సినిమాతో యువత యొక్క పేరెంట్స్ ని టార్గెట్ చేసాడు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు పబ్లిక్ లో కంటే మన ఇళ్ళల్లోనే, నా అనుకున్న వాళ్ళ ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పడమే ఈ సినిమా ప్రథమ ఉద్దేశం. అనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి చెప్పడంలో సక్సెస్ అయిన సునీల్ కుమార్ రెడ్డి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. సినిమాకి సెకండాఫ్ హెల్ప్ అయితే ఫస్ట్ హాఫ్ మైనస్, సత్యానంద్, మనోజ్ పెర్ఫార్మన్స్ ప్లస్ అయితే ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ తక్కువ అవ్వడం మైనస్. యువతని అట్రాక్ట్ చేసే సినిమా కావడం వల్ల థియేటర్స్ కి జనాలు బాగానే వస్తారు. యువత కంటే ఎక్కువగా వారి తల్లి తండ్రులు ఈ సినిమాని చూస్తే తమ పిల్లలపై ఎలాంటి లైంగిక దాడులు జరక్కుండా చూసుకునే అవకాశం ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు