సమీక్ష : పిజ్జా – థ్రిల్ చేసిన పిజ్జా టేస్ట్

సమీక్ష : పిజ్జా – థ్రిల్ చేసిన పిజ్జా టేస్ట్

Published on Feb 15, 2013 7:00 AM IST
Pizza విడుదల తేదీ15 ఫిబ్రవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాత : సురేష్ కొండేటి
సంగీతం : సంతోష్ నారాయణన్ 
నటీనటులు : విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్..


2012 అక్టోబర్లో తమిళనాడులో విడుదలైన ‘పిజ్జా’ మూవీ రుచి అక్కడ అందరికీ నచ్చడమే కాకుండా, బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ తో పాటు, పలు ముఖ్యమైన అవార్డులను కూడా గెలుచుకుంది. ఆ పిజ్జా రుచిని ఆంధ్రా ప్రేక్షకులకి కూడా చూపించాలనే ఉద్దేశంతో సురేష్ కొండేటి ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసి ఫిబ్రవరి 15న రిలీజ్ చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ హర్రర్ – సస్పెన్స్ థ్రిల్లర్లో విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు ప్రత్యేకంగా ప్రసాద్ లాబ్స్ లో వేసిన ప్రీమియర్ షో సందర్భంగా ఈ సినిమాని విడుదలకి రెండు రోజుల ముందే మేము చూసాము. ఇంతకీ పిజ్జా టేస్ట్ ఎలా ఉందో, తమిళ పిజ్జా తెలుగు వారికి ఎంత వరకు నచ్చిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

మైఖేల్ కార్తికేయన్ (విజయ్ సేతుపతి) పిజ్జా డెలివరి బాయ్ గా పనిచేస్తూ తను ప్రేమించిన అను(రమ్య నంబీసన్) తో కలిసి జీవిస్తుంటాడు. అను దెయ్యాలపై నవలలు రాయాలని దెయ్యాలపైన, వాటికి సంబందించిన విషయాల పై రీసర్చ్ కూడా చేస్తూ ఉంటుంది. కానీ మైఖేల్ కి మాత్రం దీనిపై నమ్మకం ఉండదు. ఇలా సాగిపోతున్న సమయంలో పెళ్ళికి ముందే అను గర్భవతి కావడంతో ఇబ్బందులు మొదలవుతాయి. అలాంటి తరుణంలో తను పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేసే రెస్టారెంట్ ఓనర్ కూతురు నిత్యాకి దెయ్యం పట్టడంతో ఆమె చేసే వింత చేష్టలు చూసి మైఖేల్ భయపడతాడు.

అలాంటి పరిణామాల మధ్య పిజ్జా డెలివరీ చేయడానికి ఒక ఇంటికి వెళ్ళిన మైఖేల్ అక్కడ కొన్ని అనుకోని పరిణామాలను, భయానకమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో అను కనపడకుండా పోతుంది. అసలు పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళిన ఇంట్లో ఏం జరిగింది? ఆ ఇంటింకి అనుకి సంబంధం ఏమిటి? అను మిస్సయ్యిందా? లేక ఎవరన్నా చంపేసారా? ఇన్ని సమస్యల నుండి మైఖేల్ ఎలా అధిగమించాడు? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ ఇండియన్ థ్రిల్లర్ సినిమాల్లో ‘పిజ్జా’ కూడా ఒకటి. స్క్రీన్ ప్లే ఎక్కడా పట్టు తప్పకుండా ఉంటుంది, అలాగే సస్పెన్స్ మిమ్మల్ని సీట్లో నుంచి కదలనీకుండా చేస్తుంది. మైఖేల్ పాత్రలో విజయ్ సేతుపతి నటన సినిమాకి హైలైట్. హార్రర్ సీన్స్ లో, అలాగే కన్నింగ్ గా బిహేవ్ చేయాల్సిన సీన్స్ లో అతని హావ భావాలు, నటన చాలా బాగుంది. రమ్య నంబీసన్ నటన పాత్రకి తగ్గట్టుగా ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, ఉత్కంఠంగా నడిపించే స్క్రీన్ ప్లే సినిమాకి మెయిన్ హైలెట్స్.

మొదటి సినిమాతోనే ఇలాంటి సూపర్బ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుని మెచ్చుకోవాలి. ‘స్మిత బంగ్లా’ లో వచ్చే సీన్స్ వెన్నులో భయాన్ని పుట్టించేలా ఉంటాయి. అలాగే కొన్ని హర్రర్ సీన్స్ ఇప్పటి వరకూ మన ఇండియన్ సినిమాలో రాని విధంగా ఉంటాయి. ఇంట్రవల్ కి ఒక 30 నిమిషాల ముందు నుంచి, ఇంట్రవల్ తర్వాత వచ్చే ఒక 20 నిమిషాలలో ప్రేక్షకున్ని భయపెట్టేలా కొన్ని బెస్ట్ హార్రర్ థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సెకండాఫ్ సోల్ గా నిలిచి లైఫ్ ఇచ్చింది. అలాగే క్లైమాక్స్ సీక్వెన్స్ ని చాలా బ్రిలియంట్ గా తీసారు.

ప్రేక్షకులు బాగా ట్రై చేస్తే సినిమాలో మొదట వచ్చే ట్విస్ట్ ని తెలుసుకోవచ్చేమో గానీ, రెండవ సారి వచ్చే ట్విస్ట్ ని మాత్రం ఎవరూ ఊహించలేరు. బాగా సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూస్తే ఈ సినిమాలోని సౌండ్ ఎఫెక్ట్స్, నారాలను ప్రేరేపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తాయి, అలాగే ఇలాంటి మ్యూజిక్ ఇచ్చినందుకు సంతోష్ నారాయణ్ ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు.

మైనస్ పాయింట్స్ :

రమ్య నంబీసన్ మేకప్, లుక్ ఇంకా బాగుండాల్సింది. బహుశా తమిళ నేటివిటీకి తగ్గట్టు అలాగే ఈ సినిమాకి గ్లామర్ అంతగా అవసరం లేదని డైరెక్టర్ అనుకున్నా అది తెలుగు వారికి అంతగా నచ్చదు. టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉన్న ఈ సినిమాకి పాటలు పెద్ద మైనస్. కామన్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి అంతగా నచ్చదు, వారు కోరుకునే అంశాలు కూడా ఇందులో ఏమీ ఉండవు. కామెడీ, మాస్ మసాలా మోమెంట్స్ మొదలైన కమర్షియల్ అంశాలు అసలు లేనేలేవు.

సాంకేతిక విభాగం :

గోపి అమర్ నాథ్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మేజర్ హైలైట్. నిత్యా బంగ్లాలో అతను చేసిన కెమెరా పనితనం సినిమాకే ప్రాణం పోసింది. తప్పులేమీ ఎంచలేని విధంగా ఎడిటింగ్ ఉంది. డైలాగ్స్ ఓకే. తన మొదటి సినిమా కోసం ఇంతలా ఎఫోర్ట్స్ పెట్టిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తీసిన ఈ సినిమాతో అతను ఫుల్ మార్క్స్ సంపాదించుకున్నాడు.

తీర్పు :

‘పిజ్జా’ సినిమాని ప్రత్యేకంగా ఒక జోనర్ కిందకి తీసుకురావడం కాస్త కష్టమైన పనే. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లరా? లేదా ఒక హర్రర్ థ్రిల్లరా? అంటే.. ఇది ఖచ్చితంగా థ్రిల్లర్ సినిమానే, అలాగే ది బెస్ట్ హర్రర్ సినిమాల్లో ఒకటి. ఇంటెలిజెంట్ గా ఉండాలి, బాగా ఇంప్రెస్ అవ్వాలి అలాగే భయపడాలి అనుకుంటే ఈ శుక్రవారం వెళ్ళి ‘పిజ్జా’ సినిమా చూడండి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

రాఘవ

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు