సమీక్ష : నువ్వే నా బంగారం – కనీసం ఇత్తడి అంత కూడా లేదు.!

సమీక్ష : నువ్వే నా బంగారం – కనీసం ఇత్తడి అంత కూడా లేదు.!

Published on Mar 8, 2014 8:00 AM IST
Nuvve_Naa_Bangaram విడుదల తేది : 7 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకత్వం : రామ్ వెంకీ
నిర్మాతలు : పి. కృష్ణంరాజు
సంగీతం : యాజమాన్య
నటినటులుసాయికృష్ణ, షీన….

సాయికృష్ణని హీరోగా పరిచయం చేస్తూ, బిందాస్ ఫేం షీనా హీరోయిన్ గా నటించిన సినిమా ‘నువ్వే నా బంగారం’. రామ్ వెంకీ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని పి. కృష్ణంరాజు నిర్మించారు. యాజమాన్య సంగీతం అందించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నువ్వే నా బంగారం అనే సినిమా ఆడియన్స్ బంగారం లాంటి సినిమాలా ఉంది అనేలా ఉందా లేక రోల్డ్ గోల్డ్ కి బంగారం పూత వేసారు అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

ప్రేమలో పడి కొడుకు చనిపోవడంతో తన స్టడీస్ కోసం హైదరాబాద్ వెళతామన్న కూతురు హారిక (షీనా) నుంచి ఎవరిని ప్రేమించకూడదు, ప్రమలో పడకూడదు అని సుమన్ మాట తీసుకుంటాడు. అలా హారిక హైదరాబాద్ వెళుతుంది. కట్ చేస్తే సూర్య(సాయికృష్ణ) టివిఎస్ షో రూంలో పనిచేసుకుంటూ తన ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. అలాగే సూర్య సరు అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. కానీ ఆ అమ్మాయిని చూడకుండా కేవలం ఫోన్ లో మాత్రమే మాట్లాడి ప్రేమిస్తుంటాడు.

ఇలా జరుగుతున్న తరుణంలో సూర్య, హారిక మంచి స్నేహితులవుతారు. కొద్ది రోజులకి షీనాకి పెళ్లి కుదిరి వైజాగ్ వెళ్ళిపోతుంది. అదే సమయంలో సరు కూడా సూర్యని కలవాలనుకుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల సూర్య కలవలేకపోతాడు. దాంతో సరు కూడా వైజాగ్ వెళ్ళిపోతుంది. తన సరుని వెతుక్కుంటూ సూర్య వైజాగ్ వెళతాడు. అసలు సూర్య సరుని ఎందుకు కలవలేకపోయాడు? వైజాగ్ వెళ్ళిన సూర్య సరుని కలుసుకున్నాడా? లేదా? అలాగే పెళ్ళికి ఇంటికి వచ్చిన హారిక పెళ్లి అయ్యిందా? లేదా? అసలు సారు అనే అమ్మాయి ఉందా? లేదా? అనే ఆసక్తికరమైన అంశాలను మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ కాస్త బాగుంది. సెకండాఫ్ లో తల్లి తండ్రులకి – పిల్లలకి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే తీసారు. సెకండాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్ బాగుంది. షీనా తన పాత్రకి ఓకే అనిపించే నటనని కనబరిచింది. పాటల్లో గ్లామరస్ గా కనపడి ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంది. సుమన్, తనికెళ్ళ భరణి తమ పాత్రలకు న్యాయం చేసారు. హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రవీణ్ సెకండాఫ్ లో కాస్త నవ్వించాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ హీరో సాయికృష్ణ అని చెప్పాలి. కుర్రాడి బాడీలో ఉన్న ఎనర్జీ ఫేస్ లో ఉంటే బాగుండేది. ఎందుకంటే డాన్సులు వేస్తున్నాడు, బాడీ బాగా వంగుతోంది కానీ ఫేస్ లో మాత్రం ఎక్స్ ప్రెషన్ లేదు, అలాగే డైలాగ్స్ చెప్పేటప్పుడు వాయిస్ కూడా బాగుంది కానీ ఆ వాయిస్ లో ఉన్న ఇంటెన్షన్ ఫేస్ లో కానపడటం లేదు. సాయి కృష్ణ తన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో ఇంకా చాలా కేర్ తీసుకోవాలి.

సినిమాకి మొదటి అర్ధ భాగం పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ ఒకే ఒక్క ట్విస్ట్ ని రాసుకొని దాన్ని కూడా సెకండాఫ్ లో పెట్టాడు, ఒక కానీ దానికోసం ఫస్ట్ హాఫ్ ని అంత సాగదీయకుండా ఉండాల్సింది. పోనీ సాగదీసినా ఎంటర్టైన్మెంట్ అన్నా ఉండాల్సింది, అది కూడా లేకపోవడంతో ఆడియన్స్ పరమ బోర్ కొడుతుంది. ఈ మధ్య చాలా మంది డైరెక్టర్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు వారిలానే ఈ మూవీ డైరెక్టర్ కూడా రెండు మూడు భూతు ఎపిసోడ్స్ పెట్టి నవ్వించాలి అనుకున్నాడు, కానీ అవి మరీ ఎబ్బెట్టుగా ఉండడంతో ప్రేక్షకులకి నవ్వురాకపోగా చిరాకు వచ్చింది.

ఈ సినిమాలో వచ్చిన కాన్సెప్ట్ ని పలు సినిమాల నుంచి తీసుకొని రాసుకున్నారు. మనం ఇప్పటికే ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘ఆనందం’, ‘ప్రేమలేఖ’ తదితర సినిమాల్లో ఈ కాన్సెప్ట్ ని చూసాం. సెకండాఫ్ అక్కడక్కడా బాగున్నా కొన్ని చోట్ల మాత్రం బోర్ కొట్టించాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సినిమానే చాలా స్లోగా ఉంది అంటే మధ్య మధ్యలో పాటలు వచ్చి సినిమాని ఇంకా స్లో చేస్తాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒక్క ఐటెం సాంగ్ లో తప్ప మిగతా ఏ సాంగ్ లోనూ హీరో హీరోయిన్స్ పాటకి లిప్ సింక్ కూడా ఇవ్వలేదు. అలా ఎందుకు పాటలు షూట్ చేసారు అనేది ఆ డైరెక్టర్ కే తెలియాలి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో కాస్తో కూస్తో చెప్పుకోదగిన డిపార్ట్ మెంట్స్ ఉన్నాయా అంటే అందులో మొదటిది సినిమాటోగ్రాఫర్. ఆయనకి ఇచ్చిన లోకేషన్స్ ని బాగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే కొన్ని చోట్ల డైలాగ్స్ బాగున్నాయి. యాజమాన్య అందించిన పాటల్లో ఒక్కటి కూడా బాలేదు, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎడిటర్ 128 నిమిషాల సినిమాని 100 నిమిషాల సినిమాగా ట్రిమ్ చేసి ఉంటే ప్రేక్షకులు కాస్త హ్యాపీ గా ఫీలయ్యే వారు.

ఇక ఈ సినిమా కథ, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న రామ్ వెంకీ కథని బాగానే రాసుకున్నా అంతే ఎఫెక్టివ్ గా జనాలకు చెప్పలేకపోయాడు. రామ్ వెంకీ అన్ని సినిమాలను కలబోసినా రైటర్ గా పరవాలేదనిపించుకున్న దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘నువ్వే నా బంగారం’ అనే సినిమా ఓ పాత సత్తుగిన్నెకి ఇత్తడి పూత వేసి అది బంగారం అని నమ్మించడానికి ట్రై చేసినట్టుగా ఉంది. ఎందుకంటే పాత కథకే కొత్త రంగులు వేసి తీసారు, కానీ సినిమా చూసాక అవి ఒరిజినల్ రంగులు కావని తెలిసి ఆడియన్స్ నిరుత్సాహపడతారు. ఓవరాల్ గా సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ తప్ప సినిమాలో చూడడానికి ఏమీ లేవు. ఇక సినిమాకి వెళ్లాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి..

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు