సమీక్ష : శంకరాభరణం – కేవలం కొన్ని నవ్వుల కోసం మాత్రమే.!

సమీక్ష : శంకరాభరణం – కేవలం కొన్ని నవ్వుల కోసం మాత్రమే.!

Published on Dec 6, 2015 3:00 PM IST
shankarabaranam-review

విడుదల తేదీ : 4 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఉదయ్ నందనవనం

నిర్మాత : ఎంవివి సత్యనారాయణ

సంగీతం : ప్రవీణ్ లక్కరాజు

నటీనటులు : నిఖిల్, నందిత, అంజలి..

హ్యాట్రిక్ హిట్స్ అందుకొని ఫుల్ జోరుమీదున్న యంగ్ హీరో నిఖిల్ స్టార్ రైటర్ కోన వెంకట్ తో కలిసి చేసిన సినిమా ‘శంకరాభరణం’. క్రైమ్ కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా నటించగా, అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నిఖిల్ కి మరో హిట్ గా నిలిచి సెకండ్ హ్యాట్రిక్ కి తెర తీసిందా లేదా? అన్నది? ఇప్పుడు చూద్దాం..

కథ :

ఓపెన్ చేస్తే బీహార్.. అక్కడ మనుషులను కిడ్నాప్ చేసే డబ్బు సంపాదిస్తారు అన్న దాన్ని సినిమాని మొదలు పెట్టారు. అక్కడి నుంచి కట్ చేస్తే సుమన్ – సితారలు అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్. వారి వారసుడే మన హీరో గౌతమ్(నిఖిల్). నాన్న కొడుకు ఇద్దరూ సంపాదించడం ఎందుకని తన బ్యాచిలర్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ సుమన్ ని తన ఫ్రెండ్స్ మోసం చేయడం వలన అప్పుల పాలవుతాడు. దాంతో సుమన్ కి ఒక్కసారిగా బ్యాంకుకి 2 మిలియన్ డాలర్స్(12 కోట్లు) కట్టాల్సి వస్తుంది. చనిపోదాం అనుకున్న సుమన్ ని ఆపి సితార తన పేరు మీద బిహార్ లో శంకరాభరణం అనే పాలెస్ ఉందని, దాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మని చెప్తుంది. దాంతో మన హీరో గౌతమ్ బీహార్ లో లాండ్ అవుతాడు.

అసలు ఆ శంకరాభరణం పాలెస్ లో ఎవరూ ఉండరు, అమ్మి డబ్బులు పట్టుకెళ్ళిపోదామనుకున్న గౌతమ్ కి షాక్. అదే ఇంట్లో వాళ్ళ అమ్మ సితారకి చెందిన ఓ పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళని ఎలా మస్కా కొట్టాలా అనే జర్నీలో నిఖిల్ హ్యాపీ ఠాకూర్(నందిత)ని చూసి ఇష్టపడతాడు. వాళ్ళని ఎలాగో మోసం చేసి ఆ పాలెస్ అమ్మేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి గౌతమ్ అండ్ హ్యాపీ ఠాకూర్ ని భాయ్(సంజయ్ మిశ్రా) గ్యాంగ్ గౌతమ్ ని కిడ్నాప్ చేస్తారు.అసలే ఇబ్బందుల్లో ఉన్న గౌతమ్ అదే గ్యాంగ్ తో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేసి డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ టైములో తనకి తెలియకుండానే తను పలు సమస్యల్లో ఇరుక్కుంటాడు. భాయ్ తో కలిసి గౌతమ్ వేసిన ప్లాన్ ఏంటి? దానివలన వచ్చిన సమస్యల నుంచి ఎలా భయటపడ్డాడు? తనకి కావాల్సిన డబ్బు కోసం ఎవరెవరిని మోసం చేసాడు? డబ్బుతో పాటు తన ప్రేమను, ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఏమేమి చేసాడు? అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

కోన వెంకట్ రైటింగ్ లో ఎక్కువ కనిపించేది, వర్కౌట్ అయ్యేది కామెడీ.. ఈ శంకరాభరణం సినిమాలో కూడా చాలా వరకూ ఆ కామెడీ ఫ్లేవర్ వర్కౌట్ అవ్వడమే సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ లో అయితే పాత్రలు పరిచయం అవుతూ ఉంటాయి, అందులో చాలా పాత్రలు నవ్విస్తాయి. ముఖ్యంగా సప్తగిరి, శకలక శంకర్, సత్యం రాజేష్ లతో సంజయ్ మిశ్రా చేసిన కామెడీ, పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటే, మరోవైపు హీరోకి ఎదురయ్యే సమస్యలు, దానికి అతను రియాక్ట్ అవుతుండే విధానం కూడా ఆడియన్స్ కి నవ్వు తెప్పిస్తుంటుంది. దీనివలన సినిమా స్టార్టింగ్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ లో ప్రుద్వి రాజ్ పంచ్ డైలాగ్స్ మరియు కిడ్నాప్ ఎపిసోడ్స్ కొన్ని బాగా నవ్వు తెప్పిస్తాయి. క్లైమాక్స్ లో సంపత్ రాజ్ పాత్ర, అతనిఎదుర్కునే సందర్భాలు చివర్లో ఆడియన్స్ ని నవ్విస్తాయి.

ఇక ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. అందులో సినిమాకి హెల్ప్ అయిన వారి గురించి చెప్పుకుందాం.. హీరోగా చేసిన నిఖిల్ మరోసారి తనకి ఇచ్చిన పాత్రలో ఒదిగిపోగలనని మరోసారి ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. కన్ఫ్యూజ్ ఇండియన్ దేశీగా తనహావ భావాలతో కామెడీ పండించి ఆకట్టుకున్నాడు. చూడటానికి స్టైలిష్ లుక్ లో, ఎన్నారైగా మానరిజమ్స్ బాగానే చూపించాడు. హీరోయిన్ నందిత ఫన్ లవింగ్ గర్ల్ గా బాగానే నవ్వించి, తన పాత్రకి న్యాయం చేసింది. ఇక గెస్ట్ రోల్ లో బందిపోటు రాణి మున్నిగా అంజలి చాలా బాగా చేసింది. తన పాత్ర వలన సినిమాలో కాస్త వేగం పెరుగుతుంది. కమెడియన్స్ అయిన సప్తగిరి, పృథ్వి రాజ్, సంజయ్ మిశ్రా, హర్షల పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న హోం మినిష్టర్ గా కనిపించే సంపత్ నటన బాగుంది. చెప్పాలంటే చివర్లో సంపత్ రాజ్ ఎక్కువగా నవ్విస్తాడు. ముఖ్య పాత్రలు చేసిన రావు రమేష్, సుమన్, సితార, రఘుబాబులు తమ పాత్రల పరిదిమేర నటించారు. ఈ సినిమా ద్వారా పరిచయం అయిన గజి మరియు పూజ కపూర్ లు ఇద్దరూ పర్ఫెక్ట్ గా వారి పాత్రలకి సెట్ అయ్యారు.

మైనస్ పాయింట్స్ :

శంకరాభరణం సినిమా నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే.. ఇది హిందీలో 2010లో వచ్చిన ‘పస్ గయారే ఒబామా’ అనే సినిమాకి స్పూర్తిగా తెలుగులో రీమేక్ అయ్యింది. కథలో మార్పులు చేయాలని చాలా పాత్రలని, ఫ్యామిలీ ఎమోషన్స్ ని సృష్టించారు. కానీ సెకండాఫ్ లో ఈ ఎక్కువ పాత్రల వలన, వారు వేసే ప్లాన్స్ వలన ఆడియన్స్ కి ఎక్కడో తెలియని కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ పెట్టాలని ఫస్ట్ హాఫ్ అంతా తీసారు, ఆ ఎపిసోడ్ చాలా రొటీన్ గా ఉండడమే కాకుండా ఎమోషనల్ గా కూడా పెద్దగా కనెక్ట్ అవ్వవు. ఫస్ట్ హాఫ్ ని చాలా ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ చేసి, ఆ తర్వాత బోరింగ్ గా నడిపించేశారు. సెకండాఫ్ లో అక్కడక్కడా ఉన్న కామెడీ తప్పితే మిగతా అంతా స్లో అండ్ సీరియస్ గా సాగుతుంది అది బోరింగ్ గా అనిపిస్తుంది.

కథలో చేసిన మార్పుల్లో వర్కౌట్ అయ్యింది చాల తక్కువ, కథ తర్వాత కథనం కూడా ఆకట్టుకునేలా లేకపోవడం సినిమాకి మరో మైనస్. మొదటి 20 నిమిషాల్లోనే మిగతా 2 గంటల కథ దేని కోసం జరగనుందనే క్లారిటీ ఆడియన్స్ కి వచ్చేస్తుంది. దానికి తోడు సినిమాలో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ కూడా ఏమీలేకపోవడం వలన చాలా చోట్ల బోరింగ్ గా ఉంటుంది. అలాగే సినిమాలో పాటలు సినిమా వేగాన్ని మరింత దెబ్బతీసేలా ఉన్నాయి. ఉదాహరణకి సెకండాఫ్ మొదలవ్వగానే వచ్చే పాట, అంజలి పాత్రని హైలైట్ చెయ్యాలని పెట్టిన పాట, ఈ పాటలు సినిమాకి అవసరం లేదు. అలాగే షార్ట్ అండ్ స్వీట్ గా 120 నిమిషాల్లో సినిమాని ఫినిష్ చెయ్యడానికి ట్రై చేయాల్సింది కానీ 145 నిమిషాల సినిమా నిడివి కూడా సినిమాకి మైనస్. అలాగే నిఖిల్ నందితల లవ్ ట్రాక్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి చాలా మంది కొత్త టెక్నీషియన్స్ పని చేసారు కానీ అందులో చాలా మంది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ముందుగా ఎన్నారై లొకేషన్స్ తో సినిమాని స్టార్ చేసి, ఆ తర్వాత బిహారీ మూడ్ లోకి ఆడియన్స్ ని తీసుకెళ్ళిపోయి, బిహారీ నేపధ్యాన్ని చూపించడంలో సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఆ విజువల్స్ కి, సినిమాలోని సీన్స్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ప్రవీణ్ లక్కరాజు రీ రికార్డింగ్ చేసాడు. తను చేసిన పాటలు కూడా అంత బాగాలేవు. అలాగే అవివచ్చే సందర్భాలు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. చిన్న తన ఆర్ట్ వర్క్ లో బిహార్ నేటివిటీని పర్ఫెక్ట్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాలేదు. ఎక్కడా స్పీడ్ ఎడిట్ కనిపించలేదు, అలాగే చాలా లాగ్స్ ని కట్ చేసి ఉండొచ్చు.

ఇక సినిమాకి మెయిన్ అయిన కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వ పర్యవేక్షణ విభాగాలను కోన వెంకట్ డీల్ చేసాడు. కథ – ఒరిజినల్ వెర్షన్ కథతో పోల్చుకుంటే కోన చేసిన మార్పుల్లో కామెడీ మాత్రం కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యింది కానీ మిగతా అన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కథనం – కొద్దిసేపటికే కథలోని మెయిన్ మెయిన్ బ్లాక్స్, సస్పెన్స్ వచ్చేయడం వలన ఆ తర్వాత ఆడియన్స్ తెసుకోవాల్సింది ఉండదు. అందుకే ఫస్ట్ హాఫ్ సగం నుంచే బాగా రొటీన్ గా అనిపిస్తుంది. డైలాగ్స్ – అవే సినిమాకి హెల్ప్ అయ్యాయి. కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. దర్శకత్వ పర్యవేక్షణ పరంగా చూసుకుంటే ఇంకా ఎక్కువగా ఉదయ్ నందనవనంని గైడ్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. ఉదయ తనకిచ్చిన స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా తీసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేశాడే తప్ప ఆన్ స్క్రీన్ పైకి వస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా పడుతున్నాయా లేదా అన్నది చూసుకోలేదు. స్టార్టప్ లో ఉన్న ఫ్లో మధ్యలో మధ్యలో మిస్ అవుతోందా? లేదా అన్నది కూడా చూసుకోలేదు. ఈ విషయాల్లో కోన వెంకట్ అన్నా కేర్ తీసుకోవాల్సింది. ఎంవివి సత్యనారాయణ నిర్మాణ విలువలు మాత్రం హై బడ్జెట్ సినిమా రేంజ్ లో ఉన్నాయి.

తీర్పు :

క్రైమ్ కామెడీ జానర్లో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా రెగ్యులర్ కంటెంట్ మరియు కామెడీతో తెలుగు ప్రేక్షకులను పార్ట్స్ పార్ట్స్ గా ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా అనిపించినా ఈ వారాంతంలో థియేటర్ కి వెళ్లి కాసేపు నవ్వుకోవాలి అనుకునే వారు ఓ సారి చూడదగిన సినిమా ‘శంకరాభరణం’. నిఖిల్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కథలో కొత్తదనం అనేది కనిపించదు. కానీ ఈ మధ్య ఎక్కువగా వర్కౌట్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ లో వచ్చిన సినిమా కావడం ప్లస్ అయ్యింది. కోన వెంకట్ కామెడీని బాగానే పండించినా, సినిమాలోని చాలా ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా డీల్ చేయలేకపోయాడు. ఓవరాల్ గా అక్కడక్కడా బాగా వర్కౌట్ అయిన ఎంటర్టైన్మెంట్, నిఖిల్ పెర్ఫార్మన్స్, బీహార్ నేపధ్యం సినిమాకి పెద్ద హెల్ప్ అయితే కథ -కథనం బాగా రెగ్యులర్ గా అనిపించడం, చాలా చోట్ల సినిమా స్లో అయ్యి బోర్ కొట్టడం, ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం సినిమాకి మైనస్. ఫైనల్ గా రెగ్యులర్ తరహా కామెడీ ఎంటర్టైనర్స్ ఇష్టపడే వారు ఒకసారి చూడదగిన సినిమా ‘శంకరాభరణం’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు