సమీక్ష : శ్రీరస్తు శుభమస్తు – ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్

సమీక్ష : శ్రీరస్తు శుభమస్తు – ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్

Published on Aug 6, 2016 1:18 PM IST
'Srirastu Subhamastu review

విడుదల తేదీ : 5 ఆగష్టు 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : పరశురామ్

నిర్మాత : అల్లు అరవింద్, బన్నీ వాసు

సంగీతం : ఎస్. థమన్

నటీనటులు : అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి


రెండు సినిమాలు చేసినప్పటికీ హీరోగా సరైన హిట్ అందుకోలేకపోయిన ‘అల్లు శిరీష్’ ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా దర్శకుడు ‘పరశురామ్’ డైరెక్షన్లో చేసిన సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై ‘అల్లు అరవింద్, బన్నీ వాసు’లు ఈ సినిమాను నిర్మించారు. మొదటి నుండి ట్రైలర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలతో మంచి హైప్ క్రియేట్ చేసుకుని ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

మిడిల్ క్లాస్ కుటుంబాలన్నీ వాళ్ళ అమ్మాయిల్ని ధనవంతులకిచ్చి పెళ్లి చేసి ఓవర్ నైట్ లో సెటిల్ అయిపోవాలని చూస్తుంటాయనే అభిప్రాయంతో ఉండే ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ కొడుకు శిరీష్ (అల్లు శిరీష్) అనన్య (లావణ్య త్రిపాఠి) అనే ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అదే విషయాన్ని అతను వాళ్ళ నాన్నకు చెప్పగా ఆయన మిడిల్ క్లాస్ అమ్మాయిలు నీ వెనకున్నడబ్బుని చూసి ప్రేమిస్తారని కాదంటాడు.

కానీ శిరీష్ మాత్రం నేను ఒక డబ్బులేని వాడిగానే అమ్మాయి ప్రేమను సాధిస్తానని వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేస్తాడు. అలా ఛాలెంజ్ చేసిన శిరీష్ అనన్య ప్రేమను పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? అనన్యను ఎలా మెప్పించాడు ? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన అనుభవాలేమిటి ? చివరికి అనన్య ప్రేమను దక్కించుకున్నాడా లేదా ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ లో మొదటగా చెప్పుకోవలసింది దర్శకుడు ‘పరశురామ్’ ఎంచుకున్న ప్రేమ ప్లస్ కుటుంబ విలువలు అనే కథాంశం. అలాగే వాటి రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ రాసుకున్న ఎంటర్టైనింగ్ కథనం కూడా బాగా వర్కవుట్ అయింది. ఈ రెండు అంశాల్లో ప్రతిభ కనబరిచిన పరశురామ్ రచయితగా పూర్తిగా సఫలమయ్యారు. అలాగే శిరీష్, లావణ్య త్రిపాఠీల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.

శిరీష్ గత రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ చిత్రంలో అతని నటన, స్క్రీన్ అప్పియరెన్స్ బాగున్నాయి . లావణ్య త్రిపాఠి కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. సినిమా మొదటి భాగం మొత్తం హీరో హీరోయిన్ల మధ్య నడిచే ఫన్నీ సన్నివేశాలతో, కొన్ని కుటుంబ పరమైన భావోద్వేగపూరిత సన్నివేశాలతో టైమ్ తెలీకుండానే సాగిపోయింది. ఇక మొదటి భాగంలో ప్రభాస్ శీను, రెండవ భాగంలో అలీ, సుబ్బా రాజులు చేసిన కామెడీ బాగా పండింది. అలాగే రెండవ భాగంలో ప్రీ క్లైమాక్స్ లో శిరీష్, ప్రకాష్ రాజ్ ల మధ్య నడిచే డ్రామా ఆకట్టుకుంది. సినిమాలోని ముఖ్యమైన పాత్రలకు పరశురామ్ రాసుకున్న మాటలు బాగుంది ఆలోచింపజేస్తాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలున్నాయి. హీరో హీరోయిన్ కు దగ్గరవ్వడం అనే ఎపిసోడ్ కొంత సహజత్వాన్ని మిస్సై ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. అలాగే రెండవ భాగంలో హీరో హీరోయిన్ లో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు పాతవిగానే ఉండి కొంత బోర్ కొట్టిస్తాయి. అలాగే క్లైమాక్స్ సన్నివేశం అంత బలంగా ఏమీ లేదు. చాలా సింపుల్ గా కథ సుఖాంతమైపోవడం కాస్త నిరుత్సాహానికి గురిచేస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పరశురామ్ రాసుకున్న కథ, కథానాన్ని నడిపిన తీరు, రాసుకున్న డైలాగులు బాగున్నాయి. థమన్ అందించిన సంగీతం బాగుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కథనానికి బాగా హెల్ప్ అయింది. మణికంధన్ సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు వెయ్యొచ్చు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, తనికెళ్ళ భరణి లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇకపోతే గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలాగే బాగా రిచ్ గా ఉండి సినిమాను మరో మెట్టు పైకెక్కించాయి.

తీర్పు :

ప్రేమ, కుటుంబ విలువలు అనే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్సుకు కావాల్సిన అన్ని భావోద్వేగాలను తనలో నింపుకుంది. అలాగే అల్లు శిరీష్ తనకు కావలసిన విజయాన్ని ఈ సినిమా ద్వారా అందుకోవడమే కాక ఫ్యామిలీ ఆడియన్సుకు కూడా ఓ మంచి చాయిస్ అవుతాడు. నటీనటుల నటన, మోతాదుకు మించని కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, బోర్ కొట్టించని కథనం ఈ సినిమాకు ప్రధానమైన బలాలు. చాలా సినిమాల్లో చూసే కొన్ని రెగ్యులర్ సన్నివేశాలను మినహాయిస్తే ఈ చిత్రం ఖచ్చితంగా వినోదాన్ని అందించే చిత్రమే.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు