సమీక్ష : ఎగరలేకపోయిన ‘తూనీగ తూనీగ’

సమీక్ష : ఎగరలేకపోయిన ‘తూనీగ తూనీగ’

Published on Jul 20, 2012 2:46 PM IST
విడుదల తేది : 20 జూలై 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.5/5
దర్శకుడు : ఎమ్.ఎస్.రాజు
నిర్మాత : మాగంటి రామ్ చంద్రన్
సంగీత దర్శకుడు: కార్తీక్ రాజ
తారాగణం : సుమంత్ అశ్విన్, రియా, మృణాల్ దత్

నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన ఎమ్.ఎస్ రాజు తన కొడుకు సుమంత్ అశ్విన్ ని హీరోగా పరిచయం చేయడానికి తీసిన సినిమా ‘తూనీగ తూనీగ’. వాన సినిమాతో దర్శకుడిగా మారిన ఎమ్.ఎస్ రాజు ఈ సినిమా దర్శకత్వ భాద్యతలు కూడా ఆయనే మోసాడు. సుమంత్ అశ్విన్ కి జోడీగా రియా అనే కొత్త అమ్మాయిని కూడా పరిచయం చేసారు. పద్మిని ఆర్ట్స్ బ్యానర్ పై మాగంటి రామ్ చంద్రన్ నిర్మించిన ఈ సినిమాని దిల్ రాజు సమర్పించారు. ఈరోజే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ :
ఆర్.ఆర్ గ్రూప్స్ అధినేత రవీంద్ర బాబు (నాగేంద్ర బాబు), వంట వాడు అయిన మదురై రామస్వామి (ప్రభు), డాక్టర్ జేమ్స్ (షాయాజీ షిండే) ముగ్గురు ప్రాణ స్నేహితులు. రవీంద్ర బాబు కూతురు నిధి (రియా) ని, రామస్వామి కొడుకు కార్తిక్ (సుమంత్ అశ్విన్) చిన్నతనం నుండే బాగా అల్లరి చేస్తూ ఏడిపిస్తాడు. నిధి ఇండియాలో ఉంటే సరిగా చదవట్లేదు అని అమెరికా పంపిస్తారు. ఆ తరువాత విడిపోయిన స్నేహితులని కలుసుకోడానికి 10 సంవత్సరాల తరువాత రవీంద్ర బాబు ఏర్పాటు చేసిన క్యాంపులో అందరూ కలుసుకుంటారు. అమెరికా నుండి నిధి, హైదరబాదు నుండి కార్తీక్ ఆ క్యాంపుకి వస్తారు. కార్తీక్ మొదటి చూపులోనే నిధిని చూసి ప్రేమిస్తాడు. కొన్ని డ్రామా సన్నివేశాల మధ్య ఇద్దరు విడిపోతారు. నిధికి వేరొకరితో పెళ్లి నిశ్చయిస్తారు. వీరి ప్రేమను తెల్సుకున్న డాక్టర్ జేమ్స్ వీరిద్దరినీ కలిపే ప్రయత్నమే మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :
పెద్ద నిర్మాత కొడుకు కావడంతో సుమంత్ అశ్విన్ కి మొదటి సినిమాతో గ్రాండ్ గా వెల్ కం ప్లాన్ చేసారు. సుమంత్ కూడా తన వంతు ప్రయత్నం చేసాడు. డాన్సులు బాగా చేసాడు. నటనలో ఓనమాలు వరకు నేర్చుకున్నాడు. తరువాతి సినిమాకి పెద్ద డైరెక్టర్ చేతిలో పడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అశ్విన్ కి జోడీగా నటించిన రియా, జెనీలియా కజిన్ సిస్టర్ లా ఉంది. హావ భావాల్లో కూడా జెనీలియానే అనుకరించింది. మొదటి సినిమా అయిన బాగానే చేసింది. మిగతా వారిలో నాగేంద్ర బాబు, ప్రభు, పరుచూరి వెంకటేశ్వర రావు, షాయాజీ షిండే, వినోద్ కుమార్ తమ రొటీన్ నటనని ప్రదర్శించగా మనీషా యాదవ్ చిన్న పాత్రలో కనిపించింది.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో గతంలో కరుణాకరన్ డైరెక్షన్లో వచ్చిన ‘డార్లింగ్’ సినిమా షేడ్స్ కనిపిస్తాయి. పాత చింతకాయ పచ్చడి లాంటి ప్రేమకథని కొత్తగా మళ్లీ మనకు చూపించే ప్రయత్నం చేసారు. ఫస్ట్ హాఫ్ వరకు సరదాగానే సాగిన సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ లేక ముందుకు సాగలేక నీరసించింది. సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి కాని కొన్ని పాత్రలు ఎందుకు ఉన్నాయో అర్ధం కాదు. నిధి బావగా నటించిన మృణాల్ దత్ మరియు మనీషా యాదవ్ పాత్రలు వృధా అయ్యాయి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎమ్.ఎస్ నారాయణ కామెడీ ట్రై చేద్దామని బొక్క బోర్లా పడ్డారు.

సాంకేతిక విభాగం :
పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ప్రాస కోసం ట్రై చేసారు. కార్తీక్ రాజా సంగీతంలో తూనీగ తూనీగ, దిగు దిగు జాబిలీ పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం అంతంత మాత్రమే. ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కె.వి కృష్ణా రెడ్డి కత్తెరకి పని చెప్పి సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ట్రిం చేస్తే బావుండేది. జంతువులను ఉపయోగించకూడదు అని చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ వాడారు. అవి నాసి రకంగా ఉండి తేలిపోయాయి.

తీర్పు :
పోస్టర్ మీద ఎమ్. ఎస్ రాజు, దిల్ రాజు పేర్లు చూసి వారి బ్యానర్లో గతంలో వచ్చిన సినిమాల్లాగే తూనీగ తూనీగ కూడా మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది. పాత చింతకాయ పచ్చడి కథ ఎంచుకొని, స్లో నేరేషన్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by Ashok Reddy

సంబంధిత సమాచారం

తాజా వార్తలు