సమీక్ష : వెళ్ళిపోమాకే – షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ సినిమాకు తక్కువ

సమీక్ష : వెళ్ళిపోమాకే – షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ సినిమాకు తక్కువ

Published on Sep 2, 2017 3:14 PM IST
Vellipomakey movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 2, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : అలీ మహమ్మద్

నిర్మాత : రాఘవరెడ్డి, అలీ మహమ్మద్, బాలరాజు పూరి

సంగీతం : ప్ర‌శాంత్ విహారి

నటీనటులు : విశ్వక్ సేన్, సుప్రజ, శ్వేత

‘పెళ్లి చూపులు’ వంటి సినిమాల రాకతో ప్రస్తుతం ఇండస్ట్రీ జనాలు, ప్రేక్షకులు చిన్న సినిమాల్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎవరైనా ఔత్సాహికులు మంచి కథతో, పనితనంతో సినిమా చేస్తే పెద్ద నిర్మాతలు వాటిని చూసి స్వయంగా సపోర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘వెళ్ళిపోమాకే’ అనే చిన్న సినిమాను విడుదలచేశారు. ఇప్పుడు ఆ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఒక యానిమేషన్ కంపెనీలో ఉద్యోగి అయిన చందు (విశ్వక్ సేన్) అనే కుర్రాడు తన స్నేహితులంతా అమ్మాయిలతో ప్రేమలో ఉండి సంతోషంగా ఉండటం చూసి తానూ కూడా ఎవరినైనా ప్రేమిస్తే బాగుంటుందని ఆశపడుతుంటాడు. కానీ అతను దగ్గరవ్వాలనుకున్న అమ్మాయిలెవరూ అతని పట్ల ఆసక్తి చూపకపోవడంతో తనలో తానే భాధపడుతుంటాడు.

అలాంటి అతనికి ఒకరోజు ఫేస్ బుక్ లో శ్వేత అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అలా చందు ప్రేమలోని సంతోషాన్ని, చిన్న చిన్న ఇబ్బందుల్ని అనుభవిస్తూఉండగానే ఒకరోజు ఉన్నట్టుండి శ్వేత అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. దాంతో కంగారుపడ్డ చందు ఎంక్వైరీ చేయగా శ్వేత కావాలనే తనని వదిలిపోయిందని తెలుసుకుంటాడు. శ్వేత ఆలా చందుని వదిలిపోవడానికి కారణం ఏమిటి ? ఆమెకున్న సమస్య ఏంటి ? శ్వేత ఎడబాటుతో చందు ఎలా బాధపడ్డాడు ? చివరికి అతని జీవితం ఏమైంది ?అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ సినిమా కాన్సెప్ట్. ఒక అమ్మాయి తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకు వలన ఎక్కడైతే ఎసెక్యూర్డ్ అండ్ కేరింగ్ లవ్ ఉంటుందో వెతుక్కుంటూ వెళ్లడం అనే అంశం కొత్తగా బాగుంది. అలా అమ్మాయి వెతుకులాటలో, ప్రయాణంలో చిన్న మజిలీలా ఒక అబ్బాయి, అతని ప్రేమ మిగిలిపోవడం అనే ఆలోచన కూడా బాగుంది. దర్శకుడు అలీ మహమ్మద్ ఈ డెలికేట్ అంశాన్ని చాలా బాగా డీల్ చేశారు. అమ్మాయి చేసిన పనివలన ఒక అబ్బాయి తీవ్రమైన బాధకు గురవుతున్నా ప్రేక్షకుడికి ఆ అమ్మాయి మీద, ఆమె ప్రేమ మీద కోపం రాకుండా ఆమె పరిస్థితి అంతే అని జాలిపడేలా కథను నడిపాడు.

ఇక హీరో విశ్వక్ సేన్ కూడా ఒక ఇంట్రావర్ట్ కుర్రాడు ఎలా ఉంటాడో తన అభినయం ద్వారా చూపించాడు. ఫస్టాఫ్లో ఏ అమ్మాయి తనను ప్రేమించడంలేదని ఫీలయ్యే సగటు కుర్రాడిగా, సెకండాఫ్లో ప్రేమించిన ఒక్క అమ్మాయి కూడా అర్థవంతరంగా వదిలిపోయినప్పుడు బాధతో ఆమె మీద కోపం పెంచుకోకుండా ఆమెను అర్థం చేసుకునే మంచి మనసున్న అబ్బాయిగా కూడా చాలా బాగా నటించాడు.

మైనస్ పాయింట్స్ :

తీసిన కాన్సెప్ట్ బాగానే ఉన్నా అది సినిమాగా తీయడానికి తగినది కాకపోవడంతో పూర్తి స్థాయి చిత్రాన్ని చూస్తున్న ఫీలింగ్ కలగలేదు. ప్రతి రెండు సీన్లకొకసారి షార్ట్ ఫిల్మ్ చూస్తున్నామా అనే అనుభూతి కలిగింది. అలాగే ఫస్టాఫ్ అంతా హీరో పాత్రని పరిచయం చేయడానికి, అతని పరిస్థితిని వివరించడానికి ఖర్చు చేయడంతో మొదటి అర్థ భాగంలో పెద్దగా ఫీల్ అవడానికి ఏమీ దొరకలేదు. అంతేగాక హీరో మీద ఒకే తరహా సన్నివేశాలు పదే పదే తీయడం కూడా ఇబ్బందిని కలిగించింది.

కొంచెంలో చెప్పాల్సిన కంటెంట్ ను తిప్పి తిప్పి చెప్పడం కూడా కొంచెం నిరుత్సాహాన్ని కలిగించింది. కథలో బాగానే ఉంది అనే కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని సినిమాగా తీయాలనే ఆలోచనతో సాగదీయడం మూలాన అందులో ఫీల్ చూసేవారిని బలంగా తాకలేకపోయింది. అంతేగాక సినిమా ముగింపు కూడా పూర్తి క్లారిటీగా లేదు. ఇంతకీ ఆ అమ్మాయి ప్రేమ వలన అబ్బాయి తెలుసుకుందేమిటి, ప్రేమ పట్ల అతని దృక్పథం ఎలా మారింది, ఇకపై అతను ఎవరి ప్రేమనైనా నమ్మగలడా లేదా వంటి అంశాలకు సమాధానం దొరకలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అలీ మహమ్మద్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా దాన్ని ఫుల్ లెంగ్త్ సినిమాగా తీయడంతో రిజల్ట్ కాస్త అసంపూర్ణంగా మిగిలిపోయింది. లవ్ ట్రాక్ అనేది సినిమా మొత్తాన్ని నడపడానికి సరిపోకపోతే అండర్ ప్లేలో ఇంకేదన్నా బలమైన అంశాన్ని నడిపి ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసుంటే బాగుండేది. ఇక నటీ నటుల నుండి మంచి నటనను రాబట్టుకోవడంలో మాత్రం దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. మొత్తం మీద ఒక సినిమాను తీయడానికి కావాల్సిన సామర్థ్యం తనలో ఉందనే విషయాన్ని రుజువుచేసుకున్నాడు.

ప్ర‌శాంత్ విహారి సంగీతం బాగానే ఉంది. శ్రీ సాయి కిరణ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. విద్యా సాగర్, అఖిలేష్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. అలీ మహమ్మద్ ఎడిటింగ్ పర్వాలేదు. రాఘవరెడ్డి, అలీ మహమ్మద్, బాలరాజు పూరి నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగానే ఉన్నాయి. ఇరాక్ చివరగా నిర్మాత దిల్ రాజుగారు ఇలాంటి చిన్న సినిమాని ప్రోత్సహించడం అనేది నిజంగా అభినందనీయం అంశం.

తీర్పు :

షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ ఫుల్ లెంగ్త్ సినిమాకు తక్కువ అనేలా ఉన్న ఈ ‘వెళ్ళిపోమాకే’లో సోల్ కాన్సెప్ట్ బాగున్నా సినిమాకు సరిపడే కంటెంట్ లోపించడంతో రిజల్ట్ అంత గొప్పగా స్థాయిలో రాలేదు. అలీ మహమ్మద్ చెప్పాలనుకున్న చిన్న అంశం, దాన్ని చెప్పిన సున్నితమైన విధానం, హీరో విశ్వక్ సేన్ నటన బాగుండగా అసంపూర్తిగా మిగిలిపోయిన క్లైమాక్స్, పూర్తి స్థాయి చిత్రాన్ని చూసిన ఫీలింగ్ కలగకపోవడం, కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు నిరుత్సాహపరిచాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘వెళ్ళిపోమాకే’ అనే ప్రయత్నం మెచ్చుకోదగ్గది కాగా థియేటర్లలో కూర్చుంటే పూర్తిస్థాయి సంతృప్తినిచ్చే కంటెంట్ అయితే కాదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు