అల్లరి నరేష్ ‘జేమ్స్ బాండ్’ సెన్సార్ పూర్తి!

james-bond
అల్లరి నరేష్ సినిమాలంటే రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే సినిమాలుగా అందరూ చెబుతుంటారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్యకథా చిత్రాలతో ఆ స్థాయిని సొంతం చేసుకున్న హీరోగా అల్లరి నరేష్‌కు పేరుంది. తాజాగా ఆయన నటించిన సినిమా ‘జేమ్స్‌ బాండ్’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

అల్లరి నరేష్ గత చిత్రం అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోకపోవడంతో, ఈసారి పక్కా తన స్టైల్ కామెడీతో జేమ్స్ బాండ్‌ను ప్లాన్ చేశారు నరేష్. జేమ్స్‌బాండ్’ అనే పేరు, ‘నేను కాదు.. నా పెళ్ళాం’ అనే ట్యాగ్‌లైన్‌ చాలు ఈ సినిమా ఏ స్థాయిలో నవ్వించేందుకు సిద్ధమైపోయిందో చెప్పడానికి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలతో సహా ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయ్! సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారిచేసింది.

ఇదిలా ఉంటే.. జూన్ 26న ఈ సినిమాను విడుదల చేయడానికి అంతా ప్లాన్ చేసుకున్నాక చివరి నిమిషంలో సినిమా వెనక్కి వెళ్ళిపోయింది. ఒకేసారి మరో మూడు సినిమాలు విడుదల కానుండడంతో జేమ్స్ బాండ్ సోలో రిలీజ్ కోసం వాయిదా పడినట్లు తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నామని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు.

Exit mobile version