
‘గోపాల గోపాల’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుగా రిలీజ్ అయ్యి మంచి హిట్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి 10నెలలు దాటినా మళ్ళీ వెంకీ మాత్రం మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. గత కొద్ది రోజులుగా వెంకీ చేయనున్న సినిమాల గురించి వార్తలు వస్తున్నా దేనిపైనా క్లారిటీ లేదు. ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మారుతి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ ఓ సినిమా చేయనున్నాడని, దానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని ఇది వరకే తెలియజేశాం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రాధా అనే సినిమా అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
ప్రస్తుతం మారుతి సిద్దం చేస్తున్న సరికొత్త కథ చివరి దశకు చేసుకుంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘రాధ కృష్ణ’ అనే టైటిల్ ని ఖరారు చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ నెలాఖరులోగా అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి డిసెంబర్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వెంకటేష్ సరసన అందాల భామ నయనతార జోడీ కట్టనుంది. తమిళంలో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న నయనతార ‘తులసి’ తర్వాత మరోసారి వెంకీతో జోడీ కట్టనుంది. సురేష్ బాబు సితార క్రియేషన్స్ తో కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.