
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు చేపట్టిన ‘హరిత హారం’ అనే కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఊహించని స్థాయిలో స్పందన కనిపిస్తోంది. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సమాజ శ్రేయస్సుకు, పచ్చదనానికి తోడ్పడాలన్న ఉద్దేశంతో కేసీఆర్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో తెలుగు సినిమాకు సంబంధించిన పలువురు టాప్ స్టార్స్ పాల్గొంటూ, మొక్కలు నాటడం వల్ల కలిగే మంచిని తెలియజేస్తున్నారు. నిన్న ఉదయం నుంచే టాలీవుడ్ స్టార్స్ హరిత హారం సందడి మొదలుపెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా, రెజీనా, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ తదితర స్టార్స్ అంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ తమ వంతుగా మొక్కలు నాటారు. ఇక ఈ ఉదయం ‘హరిత హారం’ కార్యక్రమంలో భార్య స్నేహా, కుమారుడు అయాన్‌లతో కలిసి అల్లు అర్జున్ పాల్గొన్నారు. తాను తన కుమారుడితో మొక్కలు నాటించానని, అందరూ తమ తమ పిల్లలతో మొక్కలు నాటించే ఆలోచన చేపట్టాలని బన్నీ ఈ సందర్భంగా అన్నారు. టాలీవుడ్ స్టార్స్ అంతా ఇలా ఒక మంచి కార్యక్రమానికి అండగా నిలబడడాన్ని అభినందించాల్సిందే!