టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ అంటే ఎప్పుడూ భారీ పోటీ ఉంటుంది. కానీ 2027 సంక్రాంతి మాత్రం మరీ రద్దీగా మారబోతోంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా రేసులో ఉన్నారు. వీరితో పాటు శర్వానంద్, తేజ సజ్జ వంటి యువ హీరోలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుండటంతో, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టఫ్ ఫైట్ ఉండనుంది.
ఈ క్రమంలో మరో హీరో నితిన్ కూడా తన కొత్త చిత్రంతో సంక్రాంతి రేసులోకి దూకుతున్నారు. ‘ఆయ్’ ఫేమ్ అంజి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. టైటిల్లోనే పండగ వైబ్ ఉండటంతో, ఈ సినిమాను కచ్చితంగా 2027 సంక్రాంతికే విడుదల చేయాలని నితిన్ అండ్ టీమ్ గట్టిగా నిశ్చయించుకుంది.
అయితే, ఇంతమంది స్టార్ హీరోలు పోటీలో ఉన్నప్పుడు నితిన్ సినిమాను బరిలోకి దించడం ఒక పెద్ద సాహసమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు ఏడెనిమిది సినిమాలు ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉండటంతో, థియేటర్ల సర్దుబాటు మరియు వసూళ్ల విషయంలో నిర్మాతలు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. సీనియర్ల హవా నడుస్తున్న వేళ నితిన్ ఏ మేరకు నిలదొక్కుకుంటారో చూడాలి.
