న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్ ఈ గురువారం విడుదల కానుంది. ఇందులో నానిని సరికొత్త, విభిన్నమైన అవతార్‌లో చూడటానికి సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
రిలీజ్‌కి ముందే ట్రేడ్ వర్గాల్లో ‘ది ప్యారడైజ్’ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం ప్రి-రిలీజ్ బిజినెస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులే చాలా సునాయాసంగా రూ. 80 కోట్లకు పైగా వ్యాపారం చేయనున్నాయని తెలుస్తోంది. నాని మార్కెట్ స్థాయిని, సినిమాపై ఉన్న క్రేజ్‌ను ఈ గణాంకాలు స్పష్టంగా చూపుతున్నాయి.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహార్ హీరోయిన్ గా నటిస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ పవర్‌ఫుల్ విలన్ పాత్రల్లో కనిపించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
