ఏఐ కోసం ఉద్యోగాల బలి: మెటా చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్, 16 వేల మందికి ఉద్వాసన!

Meta

  • ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ ‘మెటా’ (Meta) తమ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఉద్యోగుల కోతకు సిద్ధమైంది.
  • కృత్రిమ మేధ (AI) పై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఏకంగా 15 వేల నుంచి 16 వేల మంది (దాదాపు 20 శాతం) సిబ్బందిని తొలగించబోతున్నట్లు తెలుస్తోంది.
  • కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని, ఆ నిధులను ఏఐ డెవలప్‌మెంట్ కోసం మళ్లించాలని సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఐటీ రంగంలో మళ్లీ లేఆఫ్స్ (Layoffs) టెన్షన్ మొదలైంది. టెక్ దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ (Meta) తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఏకంగా 16 వేల మందిని ఇంటికి పంపేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ లేఆఫ్ కానుందని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీదే పైచేయి అని బలంగా నమ్ముతున్న సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. అందుకు తగ్గట్టే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఏఐ మోజులో ఉద్యోగాల బలి..

తాజా నివేదికల ప్రకారం ప్రస్తుతం మెటాలో దాదాపు 20 శాతం సిబ్బందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుంది. అంటే ఏకంగా 15,000 నుంచి 16,000 మంది ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోబోతున్నారు. ఏఐ ప్రాజెక్టుల కోసం కంపెనీకి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. డేటా సెంటర్లు, కొత్త సర్వర్లు, ఏఐ టెక్నాలజీ డెవలప్‌మెంట్ కోసం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ భారాన్ని బ్యాలెన్స్ చేయడంతో పాటు, ఏఐ రేసులో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీలతో దీటుగా పోరాడేందుకు జుకర్‌బర్గ్ ఈ భారీ కోతకు తెరతీశారు.

ఒకవైపు ఏఐ మీద ఫోకస్ పెంచుతూనే.. మరోవైపు కంపెనీలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో కూడా మెటా వేలాది మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏకంగా ఏఐ పేరుతో జరుగుతున్న ఈ భారీ స్కెచ్ టెక్ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. మనుషుల ఉద్యోగాలకు ఏఐ ఎసరు పెడుతుందన్న భయాలకు ఈ తాజా పరిణామం మరింత బలం చేకూరుస్తోంది. రాబోయే రోజుల్లో ఏఐ కారణంగా మరిన్ని కంపెనీలు ఇదే బాట పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Exit mobile version