అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రైమ్ డ్రామా ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. రెండో వీకెండ్లోనూ స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తూ ఈ చిత్రం ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ‘థాంక్యూ మీట్’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అడివి శేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
గతంలో తాను నటించిన ‘మేజర్’ సినిమా ఒక లాయర్‌కు ఎలా ధైర్యాన్ని ఇచ్చిందో గుర్తు చేసుకున్నాడు. “ప్రస్తుతం అందరూ సినిమా బిజినెస్ యాంగిల్ గురించే ఆలోచిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి నాకు సినిమాలోని హ్యూమన్ సైడ్‌ను గుర్తు చేశారు. పేరు కంటే కూడా ప్రేక్షకుల నమ్మకాన్ని, గుడ్‌విల్‌ను సంపాదించడమే నా లక్ష్యం” అని అన్నాడు. ‘డెకాయిట్’ కోసం గ్రీన్ మ్యాట్ వాడకుండా సహజ సిద్ధమైన లొకేషన్లలో రిస్క్ తీసుకుని షూట్ చేశామని, అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇంత నేచురల్‌గా వచ్చాయని ఆయన వివరించాడు.
గత మూడేళ్లుగా తాను ‘డెకాయిట్’ మరియు ‘గూఢచారి 2’ ప్రాజెక్టుల కోసమే శ్రమిస్తున్నానని శేష్ తెలిపాడు. ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా, ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకోవడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పాడు. మొత్తానికి డెకాయిట్ చిత్రంతో అడివి శేష్ మరోసారి హిట్ అందుకుని తన సత్తా చాటాడు.
