నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంత’ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన చిత్రకళా పోటీలు ఘనంగా ముగిశాయి. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రాన్ని సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై బి.ఎస్.జె నిర్మిస్తుండగా, సురేష్ ఆత్రేయ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్య భరత్ చంద్ర, శ్రావ్యారావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
’మీరు చూసిన వారాంతపు సంత’ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీకి విశేష స్పందన లభించింది. వందలాది మంది చిత్రకారులు ఇందులో పాల్గొనగా, వారిలో ప్రతిభ చూపిన 50 మంది పెయింటింగ్స్‌ను హైదరాబాద్‌లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు షీల్డులు, శాలువాలు, నగదు బహుమతులను అందజేశారు. ఈ వేడుకకు ప్రొఫెసర్ మల్లేశం, క్రియేటివ్ హార్ట్స్ అధినేత అంజి ఆకొండి, సంగీత దర్శకుడు భోలే షావలి, జబర్దస్త్ ఫణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలను అభినందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ.. ఎంపిక చేసిన 50 మంది చిత్రకారుల ఆర్ట్ వర్క్స్‌ను సినిమా చివర్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. త్వరలోనే జరగనున్న ఆడియో విడుదల వేడుకలో విజేతలను మరోసారి ఘనంగా సత్కరిస్తామని, అదే వేదికపై సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
