
టాలీవుడ్ సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మరియు డైరెక్షన్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అయిన ఎస్ఎస్ రాజమౌళి తను అనుకున్న సీన్ వచ్చేంతవరకూ ఎంతో కష్టపడతారు. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ తను ఈ సినిమా కోసం తీసిన సీన్స్ లో కొన్ని సీన్స్ వాతావరణ కారణంగా సరిగా రాకపోవడంతో ఇప్పుడు వాటిని మళ్ళీ రీ షూట్ చేస్తున్నాడు.
ప్రభాస్ కి సోల్డర్ సర్జరీ మరియు ఎండల తాకిడికి ఈ చిత్ర టీం షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చారు. ఈ రోజు నుంచి ఈ చిత్ర షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది. ‘మళ్ళీ బాహుబలి సెట్లో అడుగుపెట్టాం. ఒక సంవత్సరం క్రితం వర్షం వల్ల సరిగా రాని సీన్స్ ని ఇప్పుడు రీ షూట్ చేస్తున్నాం. ఈ సీన్స్ కోసం మళ్ళీ భారీ సెట్ ని వేసాం. ఈ సారి వాతావరణం మాకు అనుకూలిస్తుందని ఆశిస్తున్నామని’ రాజమౌళి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు.
ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.

