‘హ్యాపీ డేస్’ చిత్రంతో హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్ కెరీర్ ఏమంత హ్యాపీగా ముందుకు సాగడం లేదు. కెరీర్ ఆరంభంలో ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారులోకం’ చిత్రాలు వరుణ్ సందేశ్ కు విజయాలు అందించాయి. మధ్యలో ‘ఏమైంది ఈ వేళ’ మినహాయిస్తే చాలా చిత్రాలు ఆశించిన రీతిలో విజయం సాదించలేదు. తన తాజా చిత్రం ‘నువ్వలా నేనిలా’.. ‘ఏమైంది ఈ వేళ’ తరహాలో విజయం సాదిస్తుందని, మళ్లీ అంతటి గుర్తింపు తీసుకొస్తుందని వరుణ్ సందేశ్ అన్నారు.
వరుణ్ సందేశ్, పూర్ణ, సోనియా బిర్జే నటినటులుగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నువ్వలా నేనిలా’. ఇందూరి రాజశేఖర రెడ్డి నిర్మాత. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో బుధవారం చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో విడుదలయింది. దర్శకుడిపై నమ్మకంతో కథ కూడా వినకుండా ‘నువ్వలా నేనిలా’ చిత్రం అంగీకరించానని హీరో తెలిపారు. ఈ చిత్రం ఆగస్ట్ రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


