సక్సెస్ అయిన నాగ్, వెంకిల స్ట్రాటజీ

సక్సెస్ అయిన నాగ్, వెంకిల స్ట్రాటజీ

Published on Jul 18, 2014 9:20 AM IST

venki-nagarjuna
ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడితే అంత పెద్ద హిట్. 100 రోజులు, 150 రోజులు, 175 రోజులు ఆడింది అంటూ సినిమా గురించి గొప్పగా చెప్పేవారు. ప్రస్తుతం లెక్క మారింది. రోజులు లెక్క పెట్టడం మానేసి నోట్ల కట్టలను లేక్క పెడుతున్నారు. సినిమా విజయానికి కొలమానం మారింది. సినిమాకి వచ్చిన కలెక్షన్స్ బట్టి సినిమా హిట్టా.. ఫట్టా.. అని తేల్చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలకైతే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..? ఫస్ట్ వీక్ఎండ్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది..? అనే విషయాలను పరిగణలో తీసుకుంటున్నారు. అభిమానులు కూడా కలెక్షన్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మా హీరో సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు.

అగ్ర హీరోల సినిమాలను వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇలా విడుదల చేయడంలో తప్పు లేదు. స్టార్ హీరోల సినిమాలను నిర్మించాలంటే ఎంత లేదన్నా మినిమం 40, 50 కోట్లు కావాల్సిందే. అంత పెట్టుబడి పెట్టి విడుదల చేసిన తర్వాత ప్లాప్ టాక్ వస్తే ధియేటర్ వైపు కన్నెత్తి చూసే ప్రేక్షకుడు ఉండడం లేదు. నిర్మాతకు కొట్లలో నష్టం వస్తుంది. అందుకని తోలి మూడు రోజుల్లో సినిమా బడ్జెట్ రికవర్ చేయడానికి నిర్మాతలు, పంపిణిదారులు ప్రయత్నిస్తున్నారు. బడ్జెట్ రికవర్ చేయాలంటే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయక తప్పదు.

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా కొన్నిసార్లు కలెక్షన్స్ ఆశాజనకంగా ఉండడం లేదు. పైరసీ దెబ్బకు సినిమా పరిశ్రమ కుదేలవుతుంది. పైరసీ కట్టడి చేయడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండడం లేదు. కొందరి అత్యాశ పైరసీదారులకు వరంగా మారుతుంది. కొన్ని ధియేటర్ల ఓనర్లు డబ్బులకు ఆశపడి పైరసీదారులతో చేతులు కలుపుతున్నారు. విడుదల రోజు సాయంత్రానికి ఇంటర్నెట్లో కొత్త సినిమా ఫ్రీగా చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుంది. తద్వారా నిర్మాత జేబుకు గండి పడుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి తమ పెట్టుబడి రాబట్టడంలో తప్పులేదు.

రెగ్యులర్ స్ట్రాటజీకి భిన్నంగా తమ సినిమాలను విడుదల చేశారు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. అక్కినేని త్రయం ఎన్నార్, నాగార్జున, నాగ చైతన్య కలసి నటించిన ‘మనం’, వెంకటేష్ ‘దృశ్యం’ సినిమాలను అతి తక్కువ థియేటర్లలో విడుదల చేశారు. విశ్లేషకులు ఈ పద్ధతి మంచిది కాదని హెచ్చరించారు. నిర్మాతకు నష్టం వస్తుందని వారించారు. అయినా నాగ్, వెంకిలు పాత పద్ధతిని ఫాలో అయ్యారు. సూపర్ హిట్ కొట్టారు.

కథ, కథనం, సినిమాలను తెరకెక్కించిన విధానం చూసుకుంటే ‘మనం’, ‘దృశ్యం’ రెండూ సినిమాలు తెలుగుతెరకు కొత్త బాణీని పరిచయం చేశాయి. 6 పాటలు, 5 ఫైటులు, 4 కామెడీ సీన్లు, 3 సెంటిమెంట్ సీన్లు, 2 ట్విస్టులు, 1 ఐటెం సాంగు అనే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు నిర్మించి విజయం సాదించారు. ఇదొక మంచి పరిణామం. తెలుగులో ప్రయోగాలు చేయాలి అనుకునే ఔత్శాహికులకు ఊపిరి ఇచ్చాయి. త్వరలో తెలుగు తెరపై మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు తెరకేక్కే అవకాశం ఉంది.

తాజా వార్తలు