అమ్మ అరెస్ట్ తో రాజకీయాలలోకి రజినీకాంత్..?

అమ్మ అరెస్ట్ తో రాజకీయాలలోకి రజినీకాంత్..?

Published on Sep 29, 2014 10:02 PM IST

rajinikant
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలలోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుండో కోరుతున్నారు. ప్రతిసారి వారి కోరికను రజిని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. రాజకీయాలలో అడుగుపెట్టే ఉద్దేశ్యం తనకు లేదని పలుమార్లు వెల్లడించారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, మాజీ హీరోయిన్ జయలలిత (అమ్మ – అభిమానులకు ముద్దుగా) అరెస్ట్ తో మరోసారి రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలనే కోరిక తమిళనాట బలంగా వినిపిస్తుంది.

తమిళులలో మన అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ప్రాంతీయ పార్టీలదే హవా. అందుకే దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీచినా తమిళనాడులో బిజెపి ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుత ప్రాంతీయ పార్టీల నాయకులు అవినీతి ఆరోపణలతో జైలు పాలు కావడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను పూరించే సమర్ధత ఒక్క రజినికే ఉందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారట. అమ్మ అరెస్ట్ తర్వాత ప్రస్తుత తమిళ రాజకీయాలపై మీడియాలో జరిగే చర్చలలో రజినీకాంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

రజినీకాంత్ అభిమానులు సైతం తలైవా రాజకీయ అర్రంగేట్రానికి ఇదే సరైన సమయం అంటున్నారు. యధావిధిగా రజిని నోరు మెదపడం లేదు. రాజకీయాలు అంటే ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడం తప్ప మరొకటి కాదని ఇటివల పలు సంఘటనలు రుజువు చేశాయి. ఇండియాలో సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ 63 ఏళ్ళ వయసులో రాజకీయాలలోకి అడుగుపెట్టి తన ఇమేజ్, గౌరవాన్ని పణంగా పెడతారా..? అభిమానుల కోరిక మేరకు రాజకీయాలలోకి వస్తే ఆయన వెంట నిజాయితిగా నడిచే నాయకులు ఎందరు ఉంటారు..? స్వచ్చమైన, నీతివంతంగా రాజకీయాలను నడిపే సత్తా రజినికి ఉందా..?

ఎన్నో ప్రశ్నలు, సవాలక్షా సవాళ్ళు.. ఇవన్నీ తెలిసే రజినీకాంత్ సైలెంట్ గా ఉన్నారు. ఆయన అంతరంగం ఎవ్వరికి అంతుబట్టడం లేదు. వస్తారో..? లేదో..? అనే ఊహాగానాలు వార్తలలో ఎప్పుడు వస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం, రజిని వస్తే రాజకీయ తెరపై సంచలనాలు నమోదు అవుతాయి. అని అభిమానులు నమ్ముతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు