
మరికొన్ని గంటల్లో విడుదలవుతున్న రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా… తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడు, ప్రముఖ కార్టూనిస్ట్.. స్వర్గీయ శ్రీ బాపును గుర్తు చేసుకుంటూ మొదలు కానుంది. దర్శకుడు కృష్ణవంశికి బాపు అంటే ఎనలేని అభిమానం, గౌరవం. అందుకే ‘గోవిందుడు..’లో తనకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన బాపుని స్మరించుకుంటున్నారు.
అంకితం అనే మాట చాలా పెద్దది. బాపుకి అంకితం ఇచ్చేటంత గొప్పవాళ్ళం కాదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ముంగిట ‘ముత్యాల ముగ్గు’ వేసిన పద్మశ్రీ బాపు గారికి వినమ్రతతో మీ ఏలకవ్య శిష్యబృందం. అంటూ సినిమా ప్రారంభంలోనే టైటిల్ కార్డ్ వేస్తున్నాం. అని కృష్ణవంశి చెప్పారు. దసరా కానుకగా వస్తున్న ఈ సినిమా అప్పుడే పండుగ వాతావరణం సృష్టించింది.
‘ముత్యాల ముగ్గు’ చిత్రం బాపు గారి సినీ ప్రయాణంలో చిరస్మరణీయంగా నిలిచినట్టు.. ‘గోవిందుడు అందరివాడేలే’ కృష్ణవంశి కెరీర్ లో ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందని నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

