మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ముకుంద’. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సినీ గెలాక్సీ మరియు ఏషియన్ మూవీస్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను కూడా సినీ గెలాక్సీ మరియు ఏషియన్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను, మెగా అభిమానులను ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ సరసన పూజ హెడ్గే నటించిన ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఇటివలే ఈ సినిమా పాటలను స్విట్జర్లాండ్ లో చిత్రీకరించారు. టాకీ పార్ట్ షూటింగ్ కోనసీమ, గోదావరి పరిసర ప్రాంతాలలో చేశారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ‘ముకుంద’ను నిర్మిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల తేది ప్రకటించనున్నారు.


