
‘రామ్ గోపాల్ వర్మ’ అనే దర్శకుడు, ‘శివ’ అనే సినిమా. ఈ రెండు విషయాలు తెలుగు సినిమాకు కొత్త దారిని చూపించాయి. శివ అనే సినిమా రామ్ గోపాల్ వర్మ అనే జీనియస్‌ని పరిచయం చేస్తే.. ఆ జీనియస్ తెలుగు సినిమా దారినే మార్చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో నాగార్జున హీరోగా 1989లో విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా శివ. మళ్ళీ ఇరవై ఐదేళ్ళ తర్వాత ఈ సినిమాను వెండితెరపై ఇప్పటి సినిమాను చూస్తున్న ఎక్స్‌పీరియెన్స్‌తో చూసే అవకాశం శివ అభిమానులకు దక్కింది.
అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకొని, ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ లైఫ్ ఇచ్చిన సినిమా శివ. వర్మ మేకింగ్ చూసి తెలుగు సినిమా ఆశ్చర్యపోయింది. శివ మాయలో పడిపోయి ఎంతోమంది రామ్ గోపాల్ వర్మకు శిష్యులుగా మారిపోవాలని తపించారు. ఇక ఏకలవ్య శిష్యుల సంగతి చెప్పే పనిలేదు. అలాంటి చరిత్ర సృష్టించిన సినిమా మళ్ళీ వెండితెరపై చూడగలిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ రీ రిలీజ్‌కి నాంది. కొత్తగా తయారు చేసిన డిజిటల్ మాస్టర్ ప్రింట్ ద్వారా శివ మళ్ళీ కొత్త అనుభూతిని కల్పించనుంది. దీని కోసం ఎంతో కాలం వేచి చూడాల్సిన పని కూడా లేదు. మే 15న ఈ సినిమాను సరికొత్త సౌండ్ టెక్నాలజీతో మళ్ళీ ఇరవై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళి చక్కగా చూసేయొచ్చు. మే 15న ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశారు.

