
భారతీయ సినీ పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయి పేరున్నది ఫిల్మ్‌ఫేర్ అవార్డులకే! హిందీ, తెలుగు, తమిళం, కన్నడం మళయాలం ఇలా ఒక్కో భాష సినిమాలకు విడివిడిగా ఈ అవార్డులను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. 2014లో విడుదలైన హిందీ సినిమాలకు సంబంధించిన అవార్డులను ఇప్పటికే ప్రదానం చేయగా ఈనెల 26న సౌతిండియాలోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జూన్ 26న సాయంత్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకను హీరో రాహుల్ రవీంద్రన్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన అతడి భార్య చిన్మయిలు తమ యాంకరింగ్‌తో నిర్వహించనున్నారు. నాలుగు సౌతిండియన్ సినీ పరిశ్రమల్లోని పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక పలు క్యాటగిరీల్లో అవార్డు కోసం 2014లో విడుదలైన టాప్ సినిమాలు పోటీ పడుతున్నాయి.
తెలుగులో ఉత్తమ నటుడు అవార్డు కోసం అల్లు అర్జున్ (రేసు గుర్రం), మోహన్ బాబు (రౌడీ), నాగార్జున (మనం), శర్వానంద్ (రన్ రాజా రన్), వెంకటేష్ (దృశ్యం) పోటీ పడుతున్నారు. ఇక 2014లోనే విడుదలైన మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమా అవార్డుల రేసులో దూసుకుపోతుందని భావించిన అభిమానులకు 62వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు చేదు అనుభవాన్నే మిగిల్చనున్నాయి.

