ఇంటర్వ్యూ : సాయిధరమ్ తేజ్ – ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ఓ మరచిపోలేని అనుభూతి!

ఇంటర్వ్యూ : సాయిధరమ్ తేజ్ – ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ఓ మరచిపోలేని అనుభూతి!

Published on Sep 21, 2015 3:22 PM IST

sai-dharama-tej
‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అంటూ మెగా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమకు సూపర్ ఎంట్రీ ఇచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న ఈ హీరో నటించిన తాజా సినిమా ‘సుబ్రమణ్య ఫర్ సేల్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో, దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంటూ వినూత్న టైటిల్‌తో వస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది?

స) సుబ్రమణ్యం ఫర్ సేల్, దర్శకుడు హరీష్ శంకర్ స్టైల్లో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఇక దిల్‌రాజు గారి సినిమా అంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు పెద్ద పీట ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనూ ఫ్యామిలీ ఎమోషన్ బలంగా ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమాను ఓ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా చెప్పుకోవచ్చు.

ప్రశ్న) సుబ్రమణ్యం పాత్ర ప్రత్యేకలేంటి? ఈ పాత్ర ఎలా ఉండబోతోంది?

స) సుబ్రమణ్యం క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. డబ్బు కోసం రకరకాల పనులూ చేసే ఓ పాత్రగా దీన్ని చెప్పుకోవచ్చు. పూర్తిగా క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని కథలోని ఎమోషన్ నడుస్తూ ఉంటుంది. సుబ్రమణ్యంకి అంత డబ్బు అవసరం ఏముంది? అమెరికా ఎందుకు వెళ్ళాడు? లాంటి ప్రశ్నల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. కచ్చితంగా నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించే ఓ పాత్రగా సుబ్రమణ్యంను చెప్పుకోవచ్చు.

ప్రశ్న) మీ గత సినిమాల్లో పాత్రలకు, ఈ సినిమా పాత్రకు సంబంధం ఉండదు అంటున్నారు. అంటే ఈ సినిమాలో కొత్త సాయిధరమ్ తేజ్‌ను చూస్తామా?

స) కచ్చితంగా! ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్‌లోని మరో కోణాన్ని చూస్తారు. ఎమోషన్, రొమాన్స్ సన్నివేశాల్లో ఈ సినిమాలో కొత్తదనం చూపించా. ఇందుకోసం దర్శకుడితో కలిసి క్యారెక్టర్‌ను బాగా అర్థం చేసుకోవడం కోసం కొంత శ్రమించా. ఈ ప్రాసెస్ అంతా ఏదో డిగ్రీ చదివినట్లు అనిపించింది. సింపుల్‌గా చెప్పాలంటే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ఓ మరచిపోలేని అనుభూతి.

ప్రశ్న) దర్శకుడు హరీష్ శంకర్ గురించి చెప్పండి?

స) హరీష్ శంకర్ నాకు ‘మిరపకాయ్’ సినిమా అప్పట్నుంచే బాగా తెలుసు. ఈ సినిమా చేయడానికంటే ముందు కూడా ఆయన, ‘నేనిప్పుడు ఫ్లాపిచ్చిన డైరెక్టర్‌ను, ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్‌ను కాను’ అన్నారు. కథ వినగానే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. వెంటనే చేసేద్దాం అని ఫిక్సయ్యా. హరీష్ అన్నతో పనిచేయడం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

ప్రశ్న) హీరోయిన్ రెజీనాతో మీకిది రెండో సినిమా. రెజీనాతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

స) రెజీనా నాకు ఓ మంచి ఫ్రెండ్. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటూంటాం. ఇద్దరం ఫ్రెండ్సే కాబట్టి షూటింగ్ సరదా సరదాగా గడిచిపోయింది. నాకు బేసిగ్గా రొమాన్స్ సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. రొమాంటిక్ సన్నివేశాలు ఏవైనా చేయాల్సి వచ్చినపుడు రెజీనా, నేను ముందే డిస్కస్ చేసుకొని సీన్ సరిగ్గా రావడానికి మా వంతుగా ఏమేం మార్పులు చేయొచ్చో ప్లాన్ చేసుకునేవాళ్ళం.

ప్రశ్న) చిరంజీవి గారి గువ్వా గోరింకతో అనే పాటను రీమిక్స్ చేశారు కదా. దాని గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో ఒక మెలోడీలా కనిపిస్తూనే, మంచి ఎనర్జీనిచ్చే పాట రావాల్సిన సందర్భం ఒకటి ఉంది. దానికి మావయ్య సినిమాల్లోని పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందని, ఈ పాటను సెలెక్ట్ చేశాం. ఆ పాట స్థాయిని అందుకోవడం సాధ్యమయ్యే పనికాదు. మా వరకు మేము దాన్ని ఒక మంచి ప్రయత్నంగా చేశామని మాత్రం చెప్పగలను.

ప్రశ్న) చిరు పాటలను రీమిక్స్ చేస్తూ వస్తున్నారు. సినిమాలు కూడా రీమేక్ చేస్తారా?

స) లేదండీ. అలాంటి ఆలోచన అస్సలు చేయను. చిరంజీవి గారిని అందుకోవడమంటే అంత ఈజీ కాదు. ఇలా మన సినిమాలు చేస్తూ పోవడమే కానీ, మావయ్య సినిమాలు రీమేక్ చేయడమనే ఆలోచనను దగ్గరకు రానివ్వను.

ప్రశ్న) చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మ్యానరిజమ్స్ కొన్ని మీలో కనిపిస్తుంటాయి. సినిమాల్లోనూ కావాలని ఆ మార్క్ ఉండేలా చూస్తున్నారా?

స) లేదండీ. వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ను ఫాలో అవ్వడం, ఇమిటేట్ చేయడం లాంటివి అస్సలు చేయను. చిన్నప్పట్నుంచీ మావయ్య వాళ్ళను దగ్గర్నుంచి చూస్తూ పెరిగిన వాడిని కావడంతో వాళ్ళ మ్యానరిజమ్స్ కొన్ని నాకూ వచ్చాయి. అంతే తప్ప కావాలని ఇమిటేట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయను.

ప్రశ్న) నిర్మాత దిల్‌రాజు గారితో వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఏదైనా ప్రత్యేక కారణమా?

స) ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. ఆయన మంచి కథలతో సిద్ధంగా ఉన్నారు. అవన్నీ నాకూ నచ్చాయి. దీంతో వరుసగా సినిమాలు కమిట్ అయ్యా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, అనిల్ రావిపూడి సినిమా, శతమానం భవతి అనే మరో సినిమా ఇలా అన్నీ ఆయన బ్యానర్లోనే వస్తున్నాయి.

ప్రశ్న) ప్రస్తుతం ఏయే ప్రాజెక్టులు చేస్తున్నారు?

స) ప్రస్తుతం ‘తిక్క’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అనిల్ రావిపూడితో చేస్తోన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని త్వరలోనే సెట్స్‌పైకి వెళుతుంది. ఇక దిల్‌రాజు గారితోనే ‘శతమానం భవతి’ అనే సినిమా కూడా త్వరలోనే మొదలవుతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు