
2015లో తెలుగు సినీ పరిశ్రమకు పలు అద్భుతమైన విజయాలు దక్కాయి. బాహుబలి, శ్రీమంతుడు లాంటి సినిమాలు తెలుగు సినిమా మార్కెట్‌ను, స్థాయిని కూడా పెంచాయి. ఇంకా పలు విజయవంతమైన సినిమాలతో బాక్సాఫీస్ కళతో కనిపించిన తెలుగు పరిశ్రమలో అడపాదడపా పలు డబ్బింగ్ సినిమాలు కూడా సత్తా చాటాయి. ముఖ్యంగా తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమాల హడావుడి బాగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇదే తరహాలో తెలుగులోకి పలు సినిమాలు డబ్ అయినా కూడా విజయం సాధించినవి మాత్రం తక్కువే!
మణిరత్నం మళ్ళీ తన మ్యాజిక్‌తో మెప్పించిన ‘ఓకే బంగారం’, రాఘవ లారెన్స్ సూపర్ హిట్ సిరీస్ కాంచన నుంచి వచ్చిన ‘గంగ’, విజయ్, మోహన్ లాల్‌లు హీరోలుగా నటించిన ‘జిల్లా’ లాంటివి మేజర్ హిట్స్‌గా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ లిస్ట్‌లోకి నయనతార మయూరి సినిమా వచ్చి చేరింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో వచ్చిన మయూరి సినిమా, సూపర్ హర్రర్ డ్రామాగా పేరు తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ సినిమాకు సాటిలైట్ రెవెన్యూ కూడా బాగా వచ్చింది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత సి. కళ్యాణ్‌కు మయూరి సినిమా మంచి లాభాలనే తెచ్చిపెట్టి హిట్‌గా నిలిచింది.

