
తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా ‘పులి’ తెలుగు, తమిళ భాషల్లో గత వారం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తమిళంలో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అదేస్థాయి అంచనాలతో విడుదలైంది. ఇక భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన సినిమా కావడం, విజయ్ గత డబ్బింగ్ సినిమా తుపాకి, జిల్లా వంటి సినిమాలు తెలుగులోనూ మంచి విజయం సాధించడంతో విజయ్ పులికి తెలుగులోనూ మంచి క్రేజ్ కనిపించింది.
ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే ‘పులి’ తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్న ఎస్వీఆర్ మీడియా, పెద్ద ఎత్తున ఈ సినిమాను విడుదల చేయగా ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా నిన్నటితో రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా పులిని తెలుగులో విడుదల చేసిన నిర్మాత శోభారాణి ఆనందం వ్యక్తం చేశారు. రెండో వారమైనా సినిమా మంచి కలెక్షన్స్‌లో దూసుకుపోతోందని, విజయ్ కెరీర్లో తెలుగులో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన సినిమా ‘పులి’యే అని ఈ సందర్భంగా ఎస్వీఆర్ మీడియా స్పష్టం చేసింది. పులి సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఎస్వీఆర్ మీడియా తెలిపింది.

