
రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘బ్రూస్ లీ’ సినిమా ఈమధ్యే విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే కొల్లగొడుతూ స్టడీగా వెళుతోన్న విషయం తెలిసిందే. మళ్ళీ ఓ రొటీన్ సినిమానే తీశారన్న టాక్ వినిపించినా, కలెక్షన్స్ బాగుండడంతో రామ్ చరణ్ బ్రూస్ లీ విషయంలో హ్యాపీగానే ఉన్నారు. ప్రస్తుతం కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోనున్న రామ్ చరణ్ తన తరువాతి సినిమాను డిసెంబర్ చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారు. ఈ రెండు నెలల గ్యాప్‌లో సినిమాల ఎంపిక విషయంలో, నటన విషయంలో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు చెర్రీ తెలిపారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే తని ఒరువన్ రీమేక్ డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఈ గ్యాప్‌లో ఓ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ చేసేందుకు చెర్రీ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిందని, డ్యాన్స్, ఫైట్స్ మాత్రమే చేస్తా అంటే చూడట్లేదు. ప్రేక్షకులు బలమైన కథలను కోరుకుంటున్నారన్న విషయం సుస్పష్టం. అందుకోసమే స్క్రిప్ట్ ఎంపికలో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ చేయనున్నానని చెర్రీ ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

